న్యాయవాదుల దీక్షకు టిడిపి, జనసేన మద్దతు

Dec 21,2023 22:38
న్యాయవాదుల దీక్షకు టిడిపి, జనసేన మద్దతు

ప్రజాశక్తి- పుంగనూరు: భూ హక్కు చట్టంకి వ్యతిరేకంగా పుంగనూరు న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు తెలుగుదేశం, జనసేన పార్టీలు పూర్తి మద్దతు ప్రకటించాయి. స్థానిక మినీబైపాస్‌ రోడ్డులోని కోర్టు సమీపంలో న్యాయవాదులు చేపట్టిన రిలే దీక్ష గురువారం మూడో రోజుకు చేరుకున్నది. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం తీసుకొస్తున్న నల్లచట్టాలలో భాగంగా భూహక్కు చట్టం (యాక్ట్‌ 27) వల్ల పేదలకు అన్యాయం జరుగుతుందని, ఈచట్టం వల్ల భూవివాదాలలో రాజకీయ జోక్యం అధికమవుతుందని అన్నారు. పేదలకు అన్యాయం జరుగుతుంది అని, వెంటనే ఈచట్టం విషయంలో అందరికీ సమన్యాయం జరిగేలా చూడాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం న్యాయవ్యవస్థలను అపహాస్యం చేసే విధంగా ఉన్నాయని తెలిపారు. వెంటనే ఈ చట్టాన్ని రద్దు చెయ్యాలని, రద్దు చెయ్యకపోతే తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇలాంటి నల్ల చట్టాలను రద్దు చేస్తామన్నారు. న్యాయవాదులకు తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పారు. న్యాయవాది వెంకట ముని, టిడిపి పుంగనూరు రూరల్‌ అధ్యక్షుడు మాధవరెడ్డి, ఆసురి బాలాజీ, సివి రెడ్డి, పోలీస్‌ గిరి, సద్దాం, జనసేన పార్టీ నాయకుడు పగడాల రమణ తదితరులు పాల్గొన్నారు.

➡️