అన్నమయ్య గొప్ప సామాజికవేత్త

అన్నమయ్య గొప్ప సామాజికవేత్త

అన్నమయ్య గొప్ప సామాజికవేత్త ప్రజాశక్తి – తిరుపతి సిటిభగవంతుని దష్టిలో మనుషులందరూ సమానమేనని తన సంకీర్తనల ద్వారా చాటి చెప్పిన తాళ్లపాక అన్నమయ్య గొప్ప సామాజికవేత్త అని శ్రీ కష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ విసి ఆచార్య భూమన కుసుమకుమారి చెప్పారు. తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 521వ వర్థంతి ఉత్సవాలు శనివారం రెండో రోజుకు చేరుకున్నాయి.ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య కుసుమకుమారి ”అన్నమయ్య – సామాజికత” అనే అంశంపై ఉపన్యసించారు. 600 సంవత్సరాల క్రితం అప్పటి సామాజిక పరిస్థితులకు వ్యతిరేకంగా అన్నమయ్య గళం విప్పారని చెప్పారు. పలు సంకీర్తనల్లో ఆనాటి గ్రామీణ పరిస్థితులు, పాడి పంటలు, సాగునీరు, కుటుంబ సంబంధాలు తదితర అంశాలను తెలియజేశారని అన్నారు. మహిళలకు సమాన అవకాశాలు ఉండాలని నొక్కి చెప్పారని తెలిపారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంకు చెందిన ఉపన్యాసకులు డా.సౌజన్య ”అన్నమయ్య – నైతికత ” అనే అంశంపై ఉపన్యసించారు. నెల్లూరు క్లాసికల్‌ తెలుగు సెంటర్‌ పరిశోధకులు డా.లోకేశ్వరి ” వెంగమాంబపై అన్నమయ్య ప్రభావం ” అనే అంశంపై ప్రసంగించారు. విశాఖపట్నంకు చెందిన హరిత సిస్టర్స్‌, గ్రంధి సాయికృతి బృందం సంగీత సభ అందరినీ అలరించింది. అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్‌ ఆకెళ్ల విభీషణ శర్మ పాల్గొన్నారు.

➡️