ప్రాణం తీసిన అతివేగం

May 12,2024 21:29 #car accident, #died, #two children

-వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో నలుగురు మృతి
-ముగ్గురికి గాయాలు
ప్రజాశక్తి – గోపాలపట్నం (విశాఖపట్నం):రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదాలలో నలుగురు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. ప్రకాశం జిల్లాలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. విశాఖపట్నంలో ఇద్దరు యువకులు మరణించారు. ఈ రెండు ఘటనలకు అతి వేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు, స్థానికులు సమాచారం మేరకు… విశాఖ కంచరపాలెం ప్రాంతానికి చెందిన ఆరెల్లి పవన్‌ కుమార్‌ (23), దొండపర్తి ప్రాంతానికి చెందిన తానవరపు కుమార్‌ (24), తాటిచెట్ల పాలెంకు చెందిన గాంధీ ముగ్గురు స్నేహితులు కలిసి గాజువాక నుంచి నగరంలోకి ఎన్‌ఎడి జంక్షన్‌ మీదుగా బైక్‌పై వెళ్తున్నారు. ఎన్‌ఎడి ఫ్లైఓవర్‌పైకి వచ్చేసరికి బైక్‌ వేగాన్ని అదుపు చేయలేకపోయారు. దీంతో డివైడర్‌ను బలంగా ఢకొీట్టి ఫ్లైఓవర్‌ పై నుంచి కింద పడిపోయారు. ఈ ఘటనలో పవన్‌ కుమార్‌ తలకు తీవ్ర గాయమై ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కుమార్‌, గాంధీలకు తీవ్ర గాయాలవడంతో కెజిహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమించి కుమార్‌ మృతి చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని గుర్తించారు. సిఐ చక్రధరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బాపట్లకు చెందిన యాలవల వెంకటేశ్వర్లు, భారతి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వెంకటేశ్వర్లు ఉప్పుగుండూరులోని ఒక మిఠాయి దుకాణంలో పనిచేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో స్వగ్రామమైన బాపట్లలో ఓట్లు వేసేందుకు భార్యాభర్తలిద్దరూ ఒక బైక్‌పై, ముగ్గురు ఆడపిల్లలు, వెంకటేశ్వర్లు తమ్ముడు లక్ష్మయ్య మరో బైక్‌పై బాపట్లకు బయలుదేరారు. చినగంజాం రొంపేరు కాలువ వద్దకు వచ్చేసరికి పొన్నూరు వైపు నుండి ఒంగోలు వెళుతున్న కారు అతివేగంగా వచ్చి పిల్లలతో ఉన్న బైక్‌ను ఢ కొట్టింది. ఈ ప్రమాదంలో దేవి సంధ్య (11), జస్విత (9) అక్కడికక్కడే మృతిచెందారు. మరో బాలిక అశ్విని, లక్ష్మయ్యకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చీరాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. చిన్నగంజాం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️