కాసులు కురిపిస్తోన్న గ్రావెల్‌

Dec 15,2023 21:53

మట్టిని తవ్వేస్తున్న ఈ చిత్రం బాడంగి మండలం కేంద్రం సమీపంలోనిది. ఇక్కడ మట్టి తవ్వకాలు చేపట్టేందుకు ఎలాంటి అనుమతులూ లేవు. జిల్లాలో రాయల్టీ వసూలు చేస్తున్న ప్రయివేటు సంస్థను ఓ వ్యక్తి ప్రసన్నం చేసుకోవడంతో తాత్కాలిక పర్మిట్ల పేరిట తవ్వకాలు చేపట్టేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చారు. దీంతో వందలాది టిప్పర్ల మట్టిని అక్రమంగా తవ్వేసుకొని అమ్మేసు కుంటున్నారు. రూ.లక్షలు విలువ చేసే గ్రావెల్‌ తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఈ తతంగం మొత్తం తహశీల్దార్‌ కనుసన్నల్లోనే సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

బాడంగి : పైసలిస్తే చాలు నిబంధనలు అతిక్రమించి మరీ మట్టి తవ్వుకునేందుకు పచ్చ జెండా ఊపేస్తున్నాడో అధికారి. ఆయన అండతో రాయల్టీ చెల్లించకుండా, సీనరేజీ కట్టకుండా ఎర్ర మట్టిని తవ్వేసుకుంటూ అక్రమార్కులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. సదరు అధికారి రియల్టర్లకు కొమ్ముకాస్తూ ప్రభుత్వానికి చేరాల్సిన ఆదాయాన్ని సైతం దారి మళ్లించి తన జేబు నింపుకునే పనిలో నిమగమయ్యారు. ఈ విషయాన్ని ఆ శాఖ సిబ్బంది బహిరంగంగా చర్చించుకుంటున్నారు.బాడంగి మండల కేంద్రంలో గ్రావెల్‌ దందా అడ్డగోలుగా సాగుతోంది. తహశీల్దార్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న చెరువు నుంచి నిత్యం ట్రిప్పర్లతో వందల లోడ్ల గ్రావెల్‌ తరలిపోతోంది. జెసిబితో తవ్వి ట్రిప్పర్లు, ట్రాక్టర్లతో రాత్రీ పగలూ తేడా లేకుండా గ్రావెల్‌ తరలిస్తున్నారు. ప్రయివేటు లేఅవుట్లతోపాటు పలు గ్రామాలకు అమ్మేసుకుంటూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో ట్రిప్పర్‌ మట్టిని రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు విక్రయిస్తున్నారు. ట్రాక్టర్‌ మట్టి రూ.1200కు అమ్ముతున్నారు. బాడంగి మండల కేంద్రానికి సమీపంలో ఓ వ్యక్తికి తాత్కాలిక పర్మిట్ల పేరిట అక్రమ మట్టి తవ్వకాలకు రెవెన్యూ అధికారే అనుమతి ఇచ్చారని సమాచారం. సిపిఎం పరిశీలనతో కదలికబాడంగి మండల కేంద్రం సమీపంలో గ్రావెల్‌ అక్రమ తవ్వకాలను సిపిఎం నాయకులు పరిశీలించారు. అనుమతులున్నాయా? లేవా? అని జెసిబి డ్రైవర్‌ను ప్రశ్నించగా లేవని సమాధానమిచ్చాడు. సిపిఎం నాయకులు సమాచారాన్ని మీడియా దృష్టికి తీసుకెళ్లడంతో అక్రమంగా గ్రావెల్‌ తవ్వకాలు సాగిస్తున్న వ్యక్తి ఆగమేఘాలపై అక్కడికి చేరుకున్నాడు. వెంటనే రామభద్రపురం నుంచి రాయల్టీ వసూలు చేస్తున్న ప్రయివేటు సంస్థ ప్రతినిధి అక్కడికి వచ్చారు. గ్రావెల్‌ తరలిస్తున్న ట్రిప్పర్లకు కూపన్లు పంపిణీ చేయడం ప్రారంభించారు. అనుమతులపై సిపిఎం నాయకులు ప్రశ్నించగా, దురుసుగా సమాచారమిచ్చారు. అక్రమంగా మట్టి తవ్వి, తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం నాయకులు సురేష్‌ ఉన్నతాధికారులను కోరారు. రాయల్టీ ఛార్జీల పేరుతో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

➡️