భోగి మంటల్లో జిఒ 2 ప్రతులు దహనం

Jan 14,2024 19:55

ప్రజాశక్తి-శృంగవరపుకోట : అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన జిల్లాలో చేపట్టిన నిరవధిక సమ్మె ఆదివారం 34వ రోజూ కొనసాగింది. పండగ పూటా అంగన్వాడీలు నిరసనలు కొనసాగించారు. అంగన్వాడీల సమ్మెను అణచివేసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్మా జిఒ 2 ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు. శృంగవరపుకోట పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ఆదివారం భోగి సందర్భంగా భోగి మంటల్లో జిఒ 2 ప్రతులను వేశారు. అంగన్వాడీల ఆందోళనకు సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండగ పూటా అంగన్వాడీలు రోడ్డెక్కే పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్మా జిఒ 2ను వెంటనే రద్దు చేయాలన్నారు. అంగన్వాడీలపై వేధింపులు, బెదిరింపులు ఆపి, తక్షణమే వారి డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించి, అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే, వచ్చే ఎన్నికల్లో అక్కచెల్లెమ్మల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు డి.శ్యామల, డిజె లక్ష్మి, వి.మాణిక్యం, బి.సుశీల, తదితరులు పాల్గొన్నారు.జామి : మండల కేంద్రమైన జామిలో అంగన్వాడీలు భోగి మంటల్లో జిఒ 2 కాపీలను దహనం చేశారు. అంగన్వాడీ యూనియన్‌ మండల నాయకులు కనకమహాలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️