అంగన్వాడీల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుంది

Jan 5,2024 12:05 #Vizianagaram
anganwadi workers strike 25th day vzm
  • మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు

ప్రజాశక్తి-బొబ్బిలి : అంగన్వాడీల పోరాటానికి టీడీపీ అండగా ఉంటుందని మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు అన్నారు. అంగన్వాడీల పోరాటానికి శుక్రవారం మాజీమంత్రి, టీడీపీ నాయకులు మద్దతు ప్రకటించారు. అంగన్వాడీల నిరసన శిబిరాన్ని టీడీపీ నాయకులతో కలిసి మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు సందర్శించి మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో లబ్ది కోసం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. ఎన్నికల హామీను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై ఉందన్నారు. ఐదేళ్ల సమయంలో అంగన్వాడీలు సమస్యను పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు రాని సీఎం ఎన్నికల్లో బయటకు రావడం తప్పనిసరి పరిస్థితుల్లో అంగన్వాడీలు బయటకు వచ్చారన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు, జగనన్న కాలనీ పేరుతో ముఖ్యమంత్రి, మంత్రులు జేబులు నింపుకొంటున్నారని విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకదాని ఆరోపించారు. దోపిడీని ఆపితే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించవచ్చునన్నారు. ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, రైతుల్లో అసంతృప్తి వచ్చిందన్నారు. అంగన్వాడీలు, మున్సిపల్, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు సహకరించకుండా ఐదేళ్లు పాలన చేశారా అని ప్రశ్నించారు. అంగన్వాడీలను తొలగించే హక్కు ఎవరికి లేదన్నారు. అంగన్వాడీలకు టీడీపీ అండగా ఉంటుందని చెప్పారు. ఒక్కసారి మోస పోవడం సహజం, రెండోసారి మోసపోకుండా వైసీపీకు బుద్ది చెప్పాలని కోరారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి అంగన్వాడీల సమస్యలను టీడీపీ ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు.మూడు నెలల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీల సమస్యలను సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు వివరించారు.. ఆయనతో టీడీపీ సీనియర్ నాయకులు రౌతు రామమూర్తి, టీడీపీ పట్టణ, మండల అద్యక్షులు రాంబార్కి శరత్, వి.సత్యనారాయణ, కౌన్సిలర్లు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️