విజయనగరంలో తొలి ఐటి కంపెనీకి అభినందన

Mar 11,2024 16:20 #Vizianagaram

అభినందించిన డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలో ఏర్పాటైన తొలి ఐటి సాఫ్ట్ వేర్ కంపెనీ దిగ్విజయంగా కొనసాగుతుండడం ఎంతో ఆనందంగా ఉందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. 14వ డివిజన్ కొత్తపేట కుమ్మరి వీధి ప్రాంతంలో దృశ్య ఏఐ లాబ్స్ అనే పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కంపెనీ 2019లో ప్రారంభమైంది. ఈ ఐటీ కంపెనీకి సీఈఓగా శ్రావణ్ వ్యవహరిస్తున్నారు. నగరంలో ఐటీ కంపెనీ ఏర్పాటుతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్న ఆలోచనతో శ్రావణ్ సీఈఓగా ఐటి కంపెనీని ప్రారంభించారు. విజయనగరంలోనే విద్యాభ్యాసం చేసిన ఆయన ఉన్నత విద్యను అభ్యసించి తదుపరి సొంతంగా ఐటి కంపెనీ నెలకొల్పాలని యోచించడం అభినందనీయమన్నారు. 17 వ నెంబర్ సచివాలయం ఎదురుగా ఉన్న భవనంలో తొలత పదిమంది సిబ్బందితో ఐటీ కంపెనీని ప్రారంభించారు. ఇతర దేశాల నుండి ప్రోత్సాహం లభించడంతో దినదినం అభివృద్ధి చేస్తూ వచ్చారు. ప్రస్తుతం 60 మంది వరకు సిబ్బందితో ఐటీ కంపెనీని దిగ్విజయంగా నడుపుతుండటం మంచి పరిణామామాన్నారు. ఐటీ కంపెనీ విది విధానాలను, చేపడుతున్న కృషిని తెలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు. నగరంలో తొలి ఐటి కంపెనీ ఏర్పాటు కావడం అభినందనీయమని అన్నారు. నూతన ఆవిష్కరణలతో, ఉన్నత సంస్థలను ఏర్పాటు చేసే ఔత్సాహికులకు తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఎక్కడో సుదూర ప్రాంతాలకు వెళ్లి ఐటి కంపెనీలు ఏర్పాటు చేసుకునే బదులు సొంత ఊర్లోనే కంపెనీలను నెలకొల్పినట్లయితే స్థానికుల నుండి సహాయ సహకారాలు ఉంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శ్రావణ్ చేస్తున్న కృషి ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలవగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు కల్పించే ఎటువంటి సంస్థలు ఏర్పాటు చేసినా అందుకు తగిన ప్రోత్సాహం, సహాయ సహకారాలు తన వంతుగా అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కంపెనీ సీఈఓ శ్రావణ్ మాట్లాడుతూ తాను విజయనగరంలోనే చదువుకుని ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత బెంగళూరు, వైజాగ్, హైదరాబాద్ వంటి ప్రాంతాలలో ఐటీ కంపెనీ పెట్టేందుకు స్థలాన్ని చూస్తున్న సమయంలో కోలగట్ల వీరభద్ర స్వామి ప్రోత్సాహంతో నగరంలోనే కంపెనీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించానన్నారు. ఆనాటి నుండి నేటి వరకు సిబ్బందిని పెంచుతూ ఇతర సంస్థల ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్నానన్నారు. ప్రస్తుతం మూడు షిఫ్ట్ లలో 60 మంది సిబ్బందితో ఆసాజనకంగా కంపెనీ వ్యవహారాలు సాగుతున్నాయన్నారు. మరింత మంది ఔత్సాహికులు ఉన్న ఊరిలోనే కంపెనీలను ఏర్పాటు చేసుకున్నట్లయితే అటు సిబ్బందికి యాజమాన్యానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ వి వి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

➡️