బోర్ల నుంచి ఉప్పునీరు

May 25,2024 20:53

తాగునీటి బోర్లు ఉప్పునీటిగా మారిపోతున్నాయని, సముద్రం నుంచి ఉప్పునీరు వెనక్కి రాకుండా గోస్తనీ నదిలోని నది గర్భంలో డైక్‌ (రక్షణ గోడ) నిర్మించాలని గత కొన్నేళ్లుగా నదికి సమీపంలోని ప్రజలు అడుగుతున్నారు. కాని ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ప్రజల తాగునీటికి ఇబ్బందులు పడినా పర్వాలేదు కాని విమానాశ్రయానికి సరఫరా చేసే నీరు మాత్రం ఉప్పునీరుగా మారకూడదని చంపావతి నదిలో మాత్రం డైక్‌ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం విశేషం.

భోగాపురం: మండలంలోని గుడివాడ పంచాయతీ పరిధిలోని మజ్జిపేట, గుడివాడ, ఎరుసుపేట గ్రామాలతో పాటు వివిధ గ్రామాలకు తాగునీటి సరఫరా చేసే బోర్లు తగరపువలస సమీపంలోని గోస్తనీ నదిలో ఉన్నాయి. పై నుంచి వచ్చే వృథా నీరు గోస్తనీ నది ద్వారా సముద్రంలోకి కలుస్తుంది. అలాగే నాతవలస వద్దనున్న చంపావతి నది ద్వారా పై నుంచి వచ్చే వృథానీరు సముద్రంలోకి కలుస్తుంది. నదుల్లో నీరు ప్రవహించని సమయంలో నది భూగర్భంలో ఉన్న ఇసుక మేట్లు ద్వారా సముద్రం నుంచి ఉప్పునీరు వెనక్కి వచ్చేస్తుంది. అందుకు నదీ గర్భంలో సముద్రం నీరు ఇసుక మేట్లు ద్వారా వెనక్కి రాకుండా ఉండేందుకు అడ్డంగా రక్షన గోడ నిర్మించాలి. అది కూడా నది గర్భంలో ఇసుక మేట్లు దాటి మట్టి ఎక్కడ వస్తుందో అక్కడ నుంచి పైకి నిర్మించాల్సి ఉంటుంది. నదిలో ఈ డైక్‌ లేకపోవడంతో సమీప గ్రామాలకు చెందిన తాగునీరు బోర్లు ఉప్పునీరుగా మారిపోతున్నాయి. దీంతో గుడివాడ పంచాయతీకి చెందిన ప్రజలు గత 20 ఏళ్ళ నుంచి గుడివాడ సమీపంలో డైక్‌ నిర్మించాలని కోరుతున్నారు. కాని ఇప్పటికి ఏ ఒక్క ప్రభుత్వం స్పందించకపోవడం విశేషం. విమానాశ్రయానికి నీటి కోసం నిధులు విమానాశ్రయానికి తాగునీటి సరఫరా చేసేందుకు మాల నందిగాం వద్ద మొదటి విడత తాగునీటి సరఫరా కోసం రూ.28కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో డైక్‌ నిర్మాణానికి కూడా ఐదున్నర కోట్లు మంజూరు చేయడం విశేషం. ఆవాల నందిగాం సమీపంలో డైక్‌ను నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. కాని గుడివాడ ప్రాంత వాసులు ఎన్నో ఏళ్ళ నుంచి అడుగుతున్నాసరే పట్టించుకోక పోవడం విశేషం. చాలా బోర్లు కూడా ఉప్పు నీరుగా మారిపోతుండడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి హామీల్లో భాగంగా నిధులు మంజూరు చేయాలని వీరంతా కోరుతున్నారు. సిఎం హామీకి ఏడాది ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపనకు వచ్చినప్పుడు నాయకులు కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. ఇందులో గుడివాడ వద్ద డైక్‌ నిర్మాణం కూడా ఉంది. దీనికి నిధులు మంజూరు చేస్తానని సిఎం కూడా హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఐదున్నర కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఇది ప్రజలకు అత్యవసరమా కాదా అని మళ్లీ సిఎం కార్యాలయం నుంచి జిల్లాకు నివేదిక పంపించారు. ఈ మేరకు ఇక్కడ అధికారులు కూడా ఇది అవసరమేనని మళ్లీ నివేదిక ఇచ్చారు. ఇదంతా జరిగి ఇప్పటికి ఏడాది అవుతుంది కాని దీనికి సంబంధించి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు.

➡️