10న కోర్కెల దినాన్ని విజయవంతం చేయండి

Jun 28,2024 00:35 #ch narasingarao, #CITU
మాట్లాడుతున్న నర్సింగరావు

– సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు పిలుపు

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో

మూడోసారి అధికారంలోకి వచ్చిన కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేయడానికి పూనుకుంటోందని, ఆ విధానాలకు అడ్డుకట్ట వేసేందుకు జులై 10న దేశవ్యాప్తంగా తలపెట్టిన కోర్కెల దినాన్ని విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు పిలుపునిచ్చారు. జగదాంబ దరి సిఐటియు కార్యాలయంలో గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం లేబర్‌ కోడ్స్‌ అమలు చేసే ఉత్తర్వులను ఇవ్వడానికి సిద్ధపడుతోందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కార్మిక, ప్రజా వ్యతిరేక చట్టాలను అమలు చేయడానికి తగిన కార్యాచరణ రూపుదిద్దుకుంటోందని తెలిపారు. పిఎఫ్‌కు సంబంధించి యాజమాన్యం వాటా చెల్లించకపోతే ఫెనాల్టీతో చెల్లించాలన్న నిబంధన తొలగించారని తెలిపారు. ఇప్పుడు యాజమాన్యం కార్మికుల ఖాతాలో జమచేయవలసిన వాటాను ఎప్పుడైనా కట్టవచ్చునని అన్నారు. ఇప్పటి వరకూ ఫెనాల్టీ నిబంధనలు ఉన్నా చాలా కంపెనీలు ఇన్‌టైంలో పిఎఫ్‌ ఖాతాలో డబ్బులు జమచేయటం లేదని అన్నారు. అలాగే పూర్తి విచారణ జరిపి నాన్‌బెయిల్‌ వారెంట్‌ ఇవ్వడానికి వున్న అవకాశాన్ని కూడా తొలగించారన్నారు. దీని వల్ల పెన్షన్‌ భవిష్యత్తులో వస్తుందన్న గ్యారెంటీ లేకుండా పోతుందన్నారు. 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్స్‌గా మార్చడం వల్ల కార్మిక వర్గం తీవ్ర శ్రమదోపిడీకి గురవుతుందని తెలిపారు. తక్షణమే లేబర్‌ కోడ్స్‌ను రద్దు చేయాలని, ప్రైవేటీకరణను, నేషనల్‌ మోనిటైజేషన్‌ ఆఫ్‌ పైపులైన్‌లను ఆపాలని, కనీస వేతనం నెలకు రూ.26 వేలు చొప్పున నిర్ణయించి అమలు చేయాలని, కాంట్రాక్ట్‌ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టరును తొలగించినా కార్మికులను తొలగించరాదని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ను అమలు చేయాలని కోరారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించాలని, వారికి కనీస వేతనాలు చెల్లించాలని, ఇతర సౌకర్యాలు అమలు జరపాలని డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పూర్తి సామర్థ్యంతో నడపాలని, ప్లాంట్‌ రక్షణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. బిల్డింగు, ఆటో, ముఠా, తోపుడు బండ్లు కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని కోరారు. పై డిమాండ్లతో వచ్చే నెల 10న దేశవ్యాప్తంగా కోర్కెల దినం జరపాలని నిర్ణయించామని, కార్మిక వర్గం విజయవంతం చేసి, మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక పంపాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి పాల్గొన్నారు.

 

➡️