ఉపాధి రహిత కేంద్రంగా విజయనగరం

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విజయనగరం జిల్లా కేంద్రం చారిత్రిక పట్టణం.నేడు నగరంగా రూపాంతరం చెందింది.నగరమైతే అయ్యింది నగరంలో ఉండాల్సిన సౌకర్యాలు,వసతలకు నగర ప్రజలు నోచుకోవడం లేదు.1952 లో ఏర్పడిన విజయనగరం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగాయి.ఇంత వరకు 9 మంది ఎమ్మెల్యేలుగా చేశారు.వీరిలో 7 సార్లు,మూడు సార్లు,రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన వారు ఉన్నారు.అందులో రాష్ట్ర మంత్రులుగా చేసిన వారు ఉన్నారు. కానీ నగరంలో ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అభివఅద్ధిలో వెనుకబడి ఉంది.జిల్లా కేంద్రమైన విజయనగరం లో ప్రజలకు సౌకర్యాలు ఆ స్థాయిలో అందించడంలో పాలకులు విఫలమయ్యారు.
….
నగరంలో సమస్యల విషయానికొస్తే విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న 22 గ్రామ పంచాయతీలు ఉన్నవీ. సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాల్టీగా ఉన్న విజయనగరాన్ని 2016లో నగరపాలక సంస్థగా మార్పు చేశారు. అనంతరం 2017లో చుట్టుపక్కలున్న అయ్యాన్నపేట,జమ్మూ నారాయణ పురం, ధర్మపురి.గాజులురేగా,కే ఎల్‌ పురం, నగరంలో విలీనం చేశారు. అయితే విలీనం చేసిన గ్రామాల్లో అభివఅద్ధి పనులు చేపట్టకపోగా పన్నుల భారం పెరిగి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

విలీన గ్రామాల్లో సౌకర్యాలు నిల్‌
…..
విలీన గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదు. స్వచ్ఛమైన తాగునీరు లేక ఆయా గ్రామాల ప్రజలు రోజూ డబ్బు చెల్లించి టిన్నులు కొనుక్కోవాల్సి వస్తోంది. నీటి సరఫరా చేస్తామని చెప్పిన పాలకులు తాగునీటి నీ సరఫరా చేయడంలో విఫలమయ్యారు.పంచాయతీలుగా ఉన్నప్పుడు వేసిన బోర్లు నుంచి వచ్చిననీరు,నగరపాలక సంస్థ అప్పుడప్పుడు పంపించే వాటర్‌ ట్యాంక్‌ లే ఆధారంగా జీవిస్తున్నారు.
..


సమస్యలు తిష్ట
…..
నియోజకవర్గంలో ఎక్కువ భాగంగా ఉన్న నగరంలో అనేక సమస్యలు ఏళ్ల తరబడి తిష్ట వేశాయి. ముఖ్యంగా నగరంలోని ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించడంలో ఇటు పాలకులు, అటు అధికారులు విఫలమయ్యారు. ఇరుకైన రోడ్లు, అస్తవ్యస్తంగా ఉన్న డ్రెయినేజీ వ్యవస్థతోపాటు రోడ్లపై ఆక్రమణలు ట్రాఫిక్‌ సమస్యకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఫుట్పాత్లను ఆక్రమించి అనేకమంది వ్యాపారాలు చేస్తున్నా ఇటు అధికారులుగాని, అటు ట్రాఫిక్‌ పోలీసులుగాని స్పందించని పరిస్థితి. అలాగే ఇరుకైన రోడ్లు నగరంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయి. ముఖ్యంగా బయట ఊరి నుంచి విజయనగరంలోకి ప్రవేశించే ప్రధాన రొడ్లులో తప్ప నగరంలో కనీసం బస్సులు కూడా తిరగలేని పరిస్థితిలో రోడ్లు ఇరుకుగా ఉండటంతో నిత్యం అక్కడ ట్రాఫిక్‌ జామ్‌ కావడం పరిపాటిగా మారింది. కొద్దిపాటి వర్షం వస్తే నగరంలోని రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రైతుబజార్లు మొత్తం జలమయం కావడంతో నగర ప్రజలు ప్రతి వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నారు.

వర్షం వస్తే ముంపే..
….
ఇకపోతే నగరానికి వరద ముంపు సర్వసాధారణం అయిపోయింది. కారణం కాలువ వ్యవస్థ పురాతనమైనది కావడం, ఆక్రమణలే. నగరంలో ప్రధాన రహదారులు ఆక్రమణలకు గురై 80 మీటర్లు రోడ్డులునేడు 60 మీటర్లకుతగ్గిపోయాయి. గంటస్తంభం ప్రాంతంలో ,ఎంజీ రోడ్డులో ఉన్న ఆక్రమించిన వారికి వేరేచోట ప్రత్యామ్నాయ స్థలాలు చూపించి వెడల్పు చేసి ఆక్రమించిన వారికే అవకాశం కల్పించడంలో పాలకులు విఫలమయ్యారు. నగరంలో పెద్ద కాలువలు లేవు,100 ఏళ్ల క్రితం కాలువలే నేటికీ ఉండటం వల్ల వరదలు వచ్చిన ప్రతిసారీ కార్పొరేషన్‌ కార్యాలయం ప్రాంతంలో , మార్కెట్‌ ప్రాంతాలు జలమ యమవుతున్నాయి.
….
రోడ్డున పడ్డ జ్యూట్‌ మిల్లు కార్మికులు
……
నగరంలో వంద సంవత్సరాలు పైబడి ఉన్న జ్యూట్మిల్లు తప్ప మరో ఇండిస్టీ లేకపోవడంతో ఉపాధి కోసం ప్రజలు వలసలు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అయితే పదేళ్ల కిందట నగరంలో ఉన్న అరుణా, ఈస్టుకొస్తు జ్యూట్‌ పరిశ్రమలు మూతపడటంతో సుమారు 10 వేల మంది కార్మికులు, కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కార్మిక సంఘాల నాయకులు ఎంత పోరాడినా మిల్లు తెరవకపోవడంతో ఉపాధి కోసం కార్మికులు పెయింటర్లుగాను, తోపుడు బండ్లపై కూరగాయలు అమ్ముకుంటూ, తాపీ పనులు,షాపుల్లో, కూలి పనులకు వెళుతూ జీవనం సాగిస్తున్నారు. మొత్తం మీద అసెంబ్లీలో ప్రధాన ప్రాంతమైన నగరంలో ఏళ్ల తరబడి ఉన్న పరిశ్రమలు మూతపడటంతో ఉన్న ఉపాధి కాస్త పోయింది.
……
అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ ప్రతిపాదన పెపర్లేకే పరిమితం ?
…..
నగరంలో పురాతన కాలువ వ్యవస్థ ఉండటం వలన అందర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మిస్తామని చెప్పిన నేతలు ఇంతవరకూ దాన్ని ఆచరణలో పెట్టలేదు. అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణం సంగతెలా ఉన్నా ఉన్న డ్రెయినేజీలు సైతం
మురుగునీరు పారక దుర్గంధం వెదజల్లుతూ వర్షాకాలం వస్తే ప్రజలు వ్యాధులు బారిన పడుతున్నారు. మరోపక్క కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఉండడంతో నీటిని తోడేందుకు ఉద్యోగులను, మోటార్‌ పంపులను ఏర్పాటు చేసి నెలకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు తప్ప దానికి శాశ్వత పరిష్కారం చూపడం లేదు. 150 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ కాలువ వ్యవస్థ నిర్మాణం చేయాలని 15 ఏళ్ల కిందట ప్రతిపాదనలు చేయడం జరిగింది.నేటికీ అమలకు నోచుకోవడం లేదు.

ప్రభుత్వ విద్యాసంస్థల్లో వసతులేవీ..
….
నగరంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కనీస వసతులు లేకపోగా డిగ్రీ కాలేజీకి కనీసం సొంత భవనాలు లేకపోవడం సిగ్గుచేటు అని పలువురు విమర్శిస్తున్నారు. నగరంలో ఉన్న ఏకైక ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి సొంత భవనాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు, ఆందోళనలు చేసినా, వినతిపత్రాలిచ్చినా సమస్య నేటికీ పరిష్కారం కాలేదు. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ హై స్కూళ్లు ఏర్పాటు చెయ్యలేదు.ఉన్న నాలుగు హై స్కూల్లో పేద పిల్లలు చదువుకుంటున్నారు. నగరంలో ఒకే ఒక్క ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఉంది.మూడున్నర లక్షల జనాభా కలిగిన నగరంలో ఒకే ఒక్క జూనియర్‌ కళాశాల ఉండటం వలన మున్సిపల్‌ పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకుని బయటకొచ్చిన పేద విద్యార్థులు లక్షల రూపాయలు వెచ్చించి ప్రయివేటు కాలేజీలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.నగర ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు విస్తరించడం లో నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉంది. ఏకైక సర్వజన ఆసుపత్రి దిక్కు. నగరంలో అర్బన హెల్త్‌ కేంద్రాలు సుమారుగా 15 వరకు ఏర్పాటు చేయాల్సి ఉంది.ఇటీవల ఏడు మంజూరు కావడం జరిగింది,వాటిలో మూడు మాత్రమే ప్రారంభం అయ్యాయి తప్ప సేవలు అందడం లేదు. సిబ్బంది లేక వైద్య సౌకర్యాలు సక్రమంగా అందకపోవడం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రయివేటుఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కూరగాయలు,చేపల,కూరగాయలు మార్కెట్లు మార్కెట్ను ఆధునికీకరించి సరిపడా ప్రజలకు అందుబాటులో తేవాల్సి ఉంది. నియోజకవర్గంలో విద్యుత్‌ శ్మశానవాటిక ఏర్పాటు దిశగా పాలకులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.ప్రైవేటు స్మాశనావాటిక దిక్కు. నగరంలోని ఎర్ర చెరువు,చాకలి బంధ కామాక్షి నగర లో,తొటపాలెం, పుల్బాగ్‌ మంగళ వీధి చెరువు,వై ఎస్‌ ఆర్‌ నగర్‌ లో చెరువులు వంటివి చాలావరకు ఆక్రమణలకు గురయ్యాయి.
ఈ రకంగా నియోజకవర్గంలో అనేక సమస్యలు ఏళ్ల తరబడి ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారు. ఇప్పటికి 16 సార్లు ఎన్నికలు జరిగినా, పాలకులు మారినా నగర ప్రజల ఇబ్బందుల్లో ఏమాత్రమూ మార్పు లేదని చెప్పొచ్చు. మే 13వ తేదీన మరోసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రానున్న %దీన% పాలకులైనా ప్రజా సమస్యలపై దృష్టిపెట్టి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని పలువురు నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

➡️