అన్నిచోట్లా ఓట్ల మాటే

May 11,2024 23:44

చివరిరోజు ప్రదర్శనల్లో ప్రజలకు అభివాదం చేస్తున్న వైసిపి, టిడిపి అభ్యర్థులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
పోలింగ్‌కు ఒక్కరోజే ఉండడంతో ఎన్నికల వేడి తారాస్థాకికి చేరింది. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ. ఎవరికి ఓటేద్దాం.. ఎవర్ని గెలిపిద్దాం.. అని ముచ్చటించుకుంటున్నారు. ప్రధాన కూడళ్లు, టీ షానులు, హోటళ్లు, ఇతర దుకాణాలు, వాకింగ్‌ ట్రాక్‌ వద్ద అంతా ఎన్నికల వ్యవహారమే. ఆచితూచి ఓటేయాలని జనం ఆలోచిస్తుండగా ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రం ఓటర్లను ఆకర్షించేందుకు నానా పాట్లు పడుతున్నారు. మొన్నటి వరకూ ఎండను సైతం లెక్కచేయకుండా ప్రచారంలో చిన్నాపెద్ద తేడా లేకుండా అందరికీ దండాలు పెట్టి ఓట్లడిగారు. ఆత్మీయ సమావేశాలు పేరిట వివిధ సామాజిక తరగతులను సమీకరించి హామీలను గుప్పించారు. ప్రచారం చివరిరోజైన శనివారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో భారీగా జన సమీకరణతో బల ప్రదర్శనకు దిగారు. ఇలాంటి ప్రదర్శనలకు ఎంత ఖర్చయినా వెనకాడడం లేదు. గ్రామాల్లో ఉండే చోటామోటా నాయకులను తమవైపు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు. దీంతో గ్రామాల్లో ఉండే కింది స్థాయి లీడర్లకు సైతం డిమాండ్‌ పెరిగింది. వారు పెట్టే షరతులనుసైతం అభ్యర్థులు, నాయకులు ఓప్పేసుకుని ఓట్లు వేయిస్తామనే హామీ తీసుకుంటున్నారు. ఎన్‌డిఎ కూటమి తరుపున నరసరావుపేట టిడిపి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు శనివారం సత్తెనపల్లి – నరసరావుపేట వరకు భారీగా ట్రాక్టర్‌ ర్యాలీతో ముగింపు ర్యాలీ చేశారు. గత ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో నరసరావుపేట పార్లమెంట్‌ స్థానంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలను వైసిపి కైవసం చేసుకుంది. నరసరావుపేట ఎంపీగా 2019 ఎన్నికల్లో వైసిపి తరుపున గెలిచిన శ్రీకృష్ణదేవరాయలు ప్రస్తుతం టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన టిడిపిలో చేరిన దగ్గర నుండి పల్నాడు జిల్లాలో టిడిపి బలం పెరిగిందనే భావన ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, టిడిపి మేనిఫెస్టోపై ఆకర్షణ వెరసి తాను విజయం సాధిస్తానని అరవిందబాబు ఆశాభావంతో ఉన్నారు. వైసిపి ఎంపీ అభ్యర్థి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ సామాజిక సమీకరణలపై ఆశ పెట్టుకోగా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంక్షేమ పథకాల కారణంగా హ్యాట్రిక్‌ సాధిస్తాననే ధీమాతో ఉన్నారు. వీరిద్దరూ శనివారం నరసరావుపేటలోని పల్నాడు రోడ్డు అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద నుండి వినుకొండ రోడ్డులోని వైసిపి కార్యాలయం వరకు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

➡️