నీటివనరులు చెంతనున్నా.. తాగునీటికి కటకట

May 8,2024 21:30

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌: పట్టణానికి కూత వేటు దూరంలో తోటపల్లిలో రిజర్వాయర్‌లో జలవనరులు పుష్కలంగా ఉన్నా పట్టణ ప్రజలకు తాగు నీరు సరఫరా చేయడంలో పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తాగునీటి సమస్య పరిష్కరిస్తామని నమ్మబలికన పాలకులు ఆ తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకొనే పరిస్థితి లేదు. ప్రతి ఏటా వర్షాకాలంలో అధిక వర్షాలు కురిసిన సందర్భంలో తోటపల్లి జలాశయంలో అధికంగా నీరు చేరడంతో బ్యారేజ్‌ గేట్లు ఎత్తివేయడంతో ఇన్‌ ఫిల్ట రేషన్‌ బావుల్లో బురద నీరు చేరి మునిగిపోవడంతో కుళాయిల ద్వారా బురద నీరు సరఫరా జరుగుతుంది. దీంతో పట్టణ ప్రజలు గత్యంతరం లేక ఆ బురద నీటినే తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేసవిలో తోటపల్లి జలాశయంలో నీటి నిల్వలు తగ్గడంతో బ్యారేజ్‌ గేట్లను ఇరిగేషన్‌ అధికారులు మూసివేయడంతో ఇన్‌ ఫిల్టరేషన్‌ బావుల్లోకి నీరు చేరకపోవడంతో వాటిని నింపేందుకు అధికారులు నదీ ప్రవాహానికి అడ్డంగా ఇసుక బస్తాలు వేయడం, అదనపు మోటార్లతో నీరు తోడి బావుల వైపు మళ్లించడం వంటి పనులు చేపడుతూ పట్టణ ప్రజలకు అరకొరగా నీటినీ సరఫరా చేస్తున్నారు. ఈ నీరు కూడా రంగుమారి సరఫరా జరగడం విశేషం. క్లోరినేషన్‌ ప్రక్రియ కూడా సక్రమంగా జరగడం లేదని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇలా పట్టణానికి తాగునీటి సరఫరాపై అటు పాలకులకు, ఇటు అధికారులకు చిత్తశుద్ధిలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.పట్టణంలో జనాభా సుమారుగా 70 వేలమంది. ఉన్న కొళాయి కనెక్షన్లు 6,500, పైపులైన్ల విస్తీర్ణం 26 కిలోమీటర్లు, పట్టణ ప్రజలకు అవసరమైన నీరు 8 ఎంఎల్‌డి, ప్రస్తుతం సరఫరా జరుగుతున్నది 5ఎంఎల్‌డి లు.టిడిపి ప్రభుత్వ హయాంలో పట్టణంలో కుళాయిలు ద్వారా 24 గంటలు తాగునీరు సరఫరా చేసేందుకు పైలెట్‌ ప్రాజెక్టు పనులను రూ.62 కోట్లతో ఎఐఐబి సహకారంతో అప్పటి పాలకవర్గ కౌన్సిల్‌ సభ్యులు ఆమోదం తెలిపి హుటాహుటిన టెండర్లను కూడా పిలిచి పనులను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఎన్నికల కోడ్‌ రావడంతో అప్పటికి ఆ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం సమగ్ర రక్షిత మంచినీటి పథకం కింద రూ.63 కోట్లు ఎమ్మెల్యే అలజంగి జోగారావు మంజూరు చేయించారు. ఈ మేరకు గతేడాది సెప్టెంబర్‌ 14న ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు స్థానిక మున్సిపల్‌ కార్యాలయం వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అధికారులు టెండర్లను పిలిచి పట్టణంలో 26వ వార్డులో గల పండా వీధిలో పనులను ప్రారంభించి పైపులను వేశారు. అయితే సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు చెల్లించకపోవడంతో ఈ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. దీంతో ఈ ఏడాది వేసవిలో కూడా పట్టణ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్ప లేదు.పట్టణం ప్రజలకు తాగునీరు సరఫరా చేసేందుకు మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు ప్రతి ఏటా రూ.కోటీ 50లక్షలు విద్యుత్‌ ఛార్జీలు, క్లోరినేషన్‌, అదనపు పరికరాలు, పైపులైన్‌ మరమ్మతులు, లవణాలు, రసాయనాలకు, ఖర్చు చేస్తూన్నారు. అయినప్పటికీ పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరా ఇచ్చే దాఖలాల్లేవు. దశాబ్ద కాలంగా పట్టణ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదని చెప్పవచ్చు. పట్టణంలో కొత్తగా వెలసిన కాలనీలకు తాగునీటి పైపులైన్లు కూడా లేని పరిస్థితి ఆయా కాలనీలకు అపార్ట్మెంట్లకు రెండు రోజులకు ఒకసారి ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా జరుగుతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం పాలకవర్గ కౌన్సిల్‌ సభ్యులు ప్రతి నెలా జరిగే సాధారణ సమావేశంలో అధికారుల తో మాట్లాడుతున్నారే తప్ప తోటపల్లి వద్ద ఉన్న తాగునీటి సరఫరా జరిగే పంపు హౌస్‌ వద్దకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించే దాఖలాల్లేవు. క్షేత్రస్థాయిలో పరిశీలించిశుద్ధ జలాలు సరఫరాతాగునీటి సరఫరా అరకొరగా జరుగుతున్న మాట వాస్తవమే. వేసవిలో బ్యారేజ్‌ గేట్లను ఇరిగేషన్‌ అధికారులు వేయడం వల్ల ఇన్‌ఫిల్టరేషన్‌ బావుల వద్దకు నీరు చేరకపోవడంతో అదనపు మోటార్లతో నదీ జలాలను బావుల వైపు మళ్లిస్తున్నాం. బావుల చుట్టూ ఇసుక మేటలను తొలగించడం వల్ల చిన్న పాటి రంధ్రాల కారణంగా బావుల్లోకి నేరుగా నీరు చేరడం వల్ల వేసవిలో అప్పుడప్పుడు రంగు మారి నీరు సరఫరా జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియ జరిగిన వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి శుద్ధ జలాలను పట్టణ ప్రజలకు సరఫరా చేస్తాం. ఎఐఐబి ప్రాజెక్టు పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తాం.కిరణ్‌కుమార్‌,మున్సిపల్‌ డిఇ, పార్వతీపురం.

➡️