యుద్ధ ప్రాతిపదికన సాగు నీరందించండి : ఎమ్మెల్యే

Jun 29,2024 20:47

ప్రజాశక్తి – బలిజిపేట : ఖరీఫ్‌ సీజన్‌ ఆసన్నం కావడం తో పెద్ద అంకలం ఆనకట్టు ప్రధాన కాలువ ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బం దుల్లేకుండా మరమ్మ తులు పనులు చేసి సాగునీరు అందించాలని ఇరిగేషన్‌ అధికారులను స్థానిక ఎమ్మెల్యే బి.విజయ చంద్ర ఆదేశించారు. మండలంలో సువర్ణముఖి నదిపై ఉన్న పెదఅంకలాం ఆనకట్టు, కాలువ పరిస్థితిని శనివారం ఆయన పరిశీలించారు. ప్రధాన కాలువలో అనేక సమస్యలున్నాయని పణుకువలస, అరసాడ, బలిజిపేట, పలగరకు చెందిన రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆనకట్ట వద్ద ఉన్న పరిస్థితి, ప్రధానకాలువలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలపై ఇరిగేషన్‌ అధికారులతో ఆయన చర్చించారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభ సమయం కాబట్టి, అలాగే వరి నాట్లు వేసుకునే సమయం వల్ల యుద్ద ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి సాగునీరు అందించాలని ఆయన ఆదేశించారు. అలాగే మరమ్మతు పనులకు కావాల్సిన నిధులపై నివేదిక ఇవ్వాలని కోరారు. ప్రధాన కాలువ పరిధిలోని ఏడు కిలోమీటర్ల వరకు ఆయన కాలినడకన వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. గత ప్రభుత్వం ఇరిగేషన్‌పై నిర్లక్ష్యం చేయడం వల్లే కాలువలకు ఇటువంటి దుస్థితి నెలకొందన్నారు. ప్రధాన కాలువ పరిధిలో ఉన్న పరిస్థితిని చూస్తే చాలా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటికి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన అధికారులకు తెలిపారు. ఉన్నతాధికారులతో ఆనకట్టు ప్రధాన కాలువ దుస్థితిపై సమీక్ష చేసి పూర్తిస్థాయిలో మరమ్మతు పనులు చేపట్టేలా చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు పెంకి వేణుగోపాలనాయుడు, పార్టీ సీనియర్‌ నాయకులు సీతారాం, అరుకు పార్లమెంటరీ బీసీ సెల్‌ అధ్యక్షులు బి.రవికుమార్‌, క్లస్టర్‌ ఇన్చార్జి గుల్ల బాబ్జీ, ఆర్‌ వేణు, నీటి పారుదల శాఖ డిఇ త్రిమూర్తులు రావు, ఇరిగేషన్‌ అధికారి కవిత, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

➡️