ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం..

Jun 27,2024 20:49
ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం..

మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం..
ప్రజాశక్తి-నెల్లూరు :రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజాప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కార్యాచరణ మొదలుపెట్టిందని, ఇందులో భాగంగా జూలై 1వ తేదీ నుంచి రూ.వెయ్యి పెంచి రూ.4 వేలు ఎన్‌టిఆర్‌ భరోసా పింఛన్‌ మొత్తం అందించేందుకు అధికార యంత్రాంగం విస్తత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర దేవాదాయ, ధర్మదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. గురువారం నగరంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి విలేకర్ల సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో గతంలో ఇస్తున్న 3వేల ఫించన్‌కు రూ.వెయ్యి పెంచి జూలై ఒకటో తేదీ నుంచి రూ. 4 వేలు ఎన్‌టిఆర్‌ భరోసా పింఛన్‌ పంపిణీకి అధికారులు సమాయత్తమవుతున్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్‌ మొత్తం ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల బకాయిలతో కలిపి జూలై 1న రూ.7వేలు పింఛన్‌ అందించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 65 లక్షల మంది లబ్ధిదారులకు గత ప్రభుత్వం రూ. 2700 కోట్లు ఖర్చు చేయగా, తమ ప్రభుత్వం ఈ నెలలో రూ. 4400 కోట్లు రెట్టింపు మొత్తాన్ని పింఛన్లకు మంజూరు చేసిందన్నారు. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను వినియోగించడం లేదని, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీకి విస్తత ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. హామీల అమలుకు కార్యాచరణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీల్కెన మెగా డీఎస్సీ, ల్యాండ్‌ ట్కెటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, స్కిల్‌ డెవలప్మెంట్‌ శిక్షణ, తొలి విడతలో 183 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కార్యాచరణ ప్రారంభించినట్లు మంత్రి చెప్పారు. మెగా డీఎస్సీ 2024 ద్వారా భర్తీ చేయనున్న 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. బొల్లినేని గిరినాయుడు, కాటంరెడ్డి రవీంద్రరెడ్డి, ఆనం రంగమయూర్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️