అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత

May 9,2024 13:12 #Congress
  • నరసాపురం నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి కానూరి ఉదయభాస్కర్‌ కృష్ణప్రసాద్‌(బుజ్జి)
    ప్రజాశక్తి- నరసాపురం
    తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధే ధ్యేయంగా అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కృషిచేస్తానని ఇండియా బ్లాక్‌ బలపర్చిన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కానూరి ఉదయభాస్కర్‌ కృష్ణ ప్రసాద్‌(బుజ్జి) చెప్పారు. గత కొద్దిరోజులుగా ఆయన నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కానూరి ఉదయభాస్కర్‌ కృష్ణప్రసాద్‌(బుజ్జి) మాట్లాడుతూ గత కొంతకాలంగా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోవటం లేదన్నారు. ఇప్పటివరకూ పాలించిన వారు తమ స్వలాభమే చూసుకున్నారే తప్ప ప్రజల బాగోగుల గురించి పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే నరసాపురం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని వివరించారు. ముఖ్యంగా ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రాధాన్యత ఇస్తానన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, పౌరసేవలు, సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అర్హులకే అందేలా తన శక్తివంచన లేకుండా కృషిచేస్తానన్నారు. నాయకుడు అంటే భయభ్రాంతులకు గురి చేసేలా కాకుండా ఆపదలో అండగా ఉంటూ, కష్టంలో ధైర్యం చెప్పేలా ఉండాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేస్తానన్నారు. నియోజవర్గంలో మత్స్య సంపద ,లేసు అల్లికలు, కొబ్బరి ,మామిడి,ఆక్వా ,ఉప్పు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. వ్యవసాయ, దాని అనుబంధ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా కృషిచేస్తానన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు నాణ్యమైన, మెరుగైన మార్కెటింగ్‌ సదుపాయాలు అందుబాటులో ఉండేలా కృషిచేస్తానన్నారు. నరసాపురం నియోజకవర్గంలో తన ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందాయన్నారు. తిరిగి కాంగ్రెస్‌కు అధికారం కట్టబెడితే ప్రజల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, సేవే మార్గంగా తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. నిస్వార్ధంగా ప్రజా సేవ చేయటానికి తనను ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. విద్యావేత్తగా ఉండటం, స్థానిక వ్యక్తి కావటంతో ప్రతిఒక్కరూ తనను వ్యక్తిగతంగా ఆదరిస్తున్నారన్నారు. గత కొన్నేళ్లుగా తాను పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానన్నారు. తద్వారా ప్రజలందరితో మమేకమై ఉన్నాయన్నారు. ఆ పరిచయాలతో ప్రతిఒక్కరూ మంచి నాయకుడిగా గుర్తించి ఆదిరిస్తున్నారన్నారు. జాతీయ రహదారి 216 కోసం 2002లోనే తాను పోరాటం చేశానన్నారు. పట్టణంలో టెన్నిస్‌ క్రీడాకారులు కోసం టెన్నిస్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు కృషిచేశానన్నారు. కరోనా సమయంలో ఎంతోమంది పేదలకు సేవా కార్యక్రమాలు చేశానని గుర్తుచేశారు. తనకు అనేక రంగాల్లో ప్రముఖులు, విద్యావేత్తలు పరిచయాలు ఉన్నాయని వివరించారు. నియోజకవర్గంలో వైద్య, విద్య, పర్యాటక రంగాలలో అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. నరసాపురం ప్రాంతానికి పరిశ్రమలు రావటానికి కృషిచేస్తానన్నారు. మహిళల స్వయం ఉపాధి నిమిత్తం కుటీల పరిశ్రమల ఏర్పాటుకు కూడా ప్రాధాన్యత ఇస్తానన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానన్నారు. బిజెపి ప్రభుత్వంలో రైళ్లలో జనరల్‌ బోగీలు తీసేయడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే నరసాపురం నుండి హైదరాబాద్‌ వెళ్లే ట్రైన్లలో జనరల్‌ బోగీలు పెంచేలా రైల్వే బోర్డ్‌ అధికారులతో మాట్లాడతానన్నారు. నరసాపురం-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ను పునరుద్ధరించేందుకు కృషి చేస్తానన్నారు. తీర ప్రాంతంలో త్రాగునీరు, రోడ్ల సమస్యలను పరిష్కరిస్తానన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే నరసాపురం వశిష్ఠ వారధి నిర్మాణం అయ్యేలా చూస్తాన్నారు. కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చేనేత కార్మికులు అండగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటుందన్నారు .ఈనెల 13 జరిగే ఎన్నికల్లో అందరూ కాంగ్రెస్‌ పార్టీ గుర్తు హస్తంపై తమ ఓట్లు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజానీకానికి విజ్ఞప్తిచేశారు.
➡️