ఆశ.. నిరాశ..!

ఆశ.. నిరాశ.. ఈ రెండూ సగటు మానవుని జీవితంలో అంతర్భాగం. పాలకుల హామీలతో ప్రజలు ఎక్కువ కాలం ఆశలతో జీవించడం, అదే పాలకుల విధానాలతో నిరాశకు గురికావడం పరిపాటైంది. ఇదే పరిస్థితి ఉమ్మడి జిల్లాలో ఈ కాలంలో నెలకొంది. ‘ప్రతి సోమవారం.. పోలవరం’ అంటూ సిఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన సోమవారం చంద్రబాబు పోలవరంలో పర్యటించి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఆనక అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మొత్తం ప్రక్రియలో పోలవరం ప్రాజెక్టు పనులపైనే చంద్రబాబు కేంద్రీకరణ ఎక్కువ సాగింది. నిర్వాసితులకు సంబంధించి పరిమితమైన సమీక్ష జరిగింది. ఈ దశలో తాజాగా పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిలో పోలవరం డ్యామ్‌ పనులకు సంబంధించి తప్ప నిర్వాసితుల ఊసే లేదు. అంటే గతంలో వలే చంద్రబాబు డ్యామ్‌ పనులపై పెట్టిన దృష్టి నిర్వాసితులపై పెట్టడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో జిల్లాలోని పోలవరం నిర్వాసితుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. గతంలో జగన్‌ కూడా అనేక హామీలిచ్చి అధికారంలోకొచ్చాక వారి మాటే వినే ఆలోచనే చేయలేదు. పైగా ఏజెన్సీలో సిఎం పర్యటనకు ముందు కొంతమందికి పరిహారపు సొమ్ము జమ చేయడం, వారినే సిఎం సభకు అనుమతించి మిగిలిన గ్రామాలపై తీవ్ర నిర్బంధం విధించడం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో నిర్వాసితులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వంపై నిర్వాసితులు పెట్టుకున్న ఆశలు ఏ మాత్రం నెరవేరుతాయో వేచిచూడాలి. ప్రస్తుతానికి మాత్రం పోలవరంలో సిఎం చంద్రబాబు పర్యటన, పోలవరంపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా నిర్వాసితుల ప్రస్తావన కనీసంగా లేకపోవడం మాత్రం ముంపు బాధితులను తీవ్ర నిరాశకు గురి చేసిందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. దెందులూరు మండలం దోసపాడులో పెద్దల చెరలో ఉన్న అసైన్డ్‌ భూములను హక్కుదారులకే అప్పగించాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన చాలాకాలంగా పోరాటం జరుగుతోంది. కోర్టు తీర్పులను సైతం అధికారులు అమలు చేయని పరిస్థితి ఉంది. వాస్తవ హక్కుదారులను కనీసం భూముల వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుని కేసులు బనాయించడం, ఆక్రమణదారులకు రాచమార్గం కల్పించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. 2016లో లోకాయుక్త ఇచ్చిన తీర్పు అమలు చేయాలనేది పేదలు, దళితుల డిమాండ్‌. నాటి నుంచి ప్రభుత్వ నిర్బంధం, ఆక్రమణదారుల దాడులను ఎదుర్కొంటూనే వారంతా ఐక్యంగా తమ పోరాటం సాగించారు. ఎట్టకేలకు జాయింట్‌ కలెక్టర్‌ కోర్టు పేదలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ భూములు అసైన్డ్‌దారులకే చెందుతాయని స్పష్టం చేసి, అసైన్డ్‌ హక్కుదారులకు ఆ భూములు అప్పగించాలని ఆదేశించింది. ఇది అపూర్వ విజయం. అక్కడి పేదలు, దళితుల్లో ఆశలు చిగురించాయి. అయితే ఈ ఉత్తర్వులు అధికార యంత్రాంగం ఎప్పటికి అమలు చేస్తుందనే అనుమానమూ వాస్తవ హక్కుదారుల్లో నెలకొంది. వీలైనంత వరకూ జెసి కోర్టు తీర్పును అమలు చేయకుండా జాప్యం చేయడమే అధికారుల తీరులా కన్పిస్తుందనేది వారి వాదన. అదే జరిగితే తాము మరో పోరాటానికి సిద్ధమని పేదలు, దళితులు స్పష్టం చేస్తున్నారు. ఏదైనా పోరాటాల ద్వారానే తమ హక్కులు, ఆస్తులు రక్షించుకోవచ్చని దోసపాడు పేదలు, దళితులు మరోసారి నిరూపించారు. – విఎస్‌ఎస్‌వి.ప్రసాద్‌

➡️