అధికారుల నిర్లక్ష్యమే ప్రాణం తీసింది

కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి : కౌతు రైతు సంఘం

ప్రజాశక్తి – పెనుగొండ

కరెంటు తీగలు తొలగించాలని పలుసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదని, వారి నిర్లక్ష్యమే తన భర్త ప్రాణం తీసిందని కౌలురైతు భార్య తానేటి మరియమ్మ వాపోయారు. శనివారం వడలిలో విద్యుత్‌ షాక్‌తో మృతి చెందిన కౌలురైతు గంగయ్య కుటుంబాన్ని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కూసంపూడి సుబ్బరాజు పరామర్శించారు. ఈ సందర్భంగా మతుడు కుమారుడు సోమేశ్వరరావు మాట్లాడుతూ నాలుగేళ్లుగా ఉపయోగం లేని విద్యుత్‌ వైర్లను తొలగించాలని అధికారులకు పలుసార్లు విజ్ఞప్తి చేసినా పెడచెవిన పెట్టారని తెలిపారు. చేలల్లో వేలాడుతున్న విద్యుత్‌ తీగలు తన తండ్రి పట్ల యమపాశంగా మారాయన్నారు. సంఘం జిల్లా అధ్యక్షులు కూసంపూడి సుబ్బరాజు మాట్లాడుతూ మృతుని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు కట్టించి ఇవ్వాలని, నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బాధితులను పరామర్శించిన వారిలో నాయకులు ఎస్‌.వెంకటేశ్వరరావు, తొంటా సత్యనారాయణ, ఆవుల శ్రీనివాస్‌, రుద్ర రామాంజనేయులు పాల్గొన్నారు.

➡️