హోరాహోరీ పోరు..గెలిచేది ఎవరు?

May 8,2024 21:06

ప్రజాశక్తి -గజపతినగరం : నియోజకవర్గంలో మొత్తంగా 13 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వైసిపి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పోటీలో ఉండగా, టిడిపి అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా డోల శ్రీనివాస్‌ పోటీలో ఉన్నారు. మరో ఆరుగురు వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తుండగా, నలుగురు స్వతంత్రులు కూడా బరిలో నిలిచారు. గత కొద్దిరోజులుగా టిడిపి, వైసిపి అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అదే సందర్భంలో వైసిపి నుంచి టిడిపిలోకి, టిడిపి నుంచి వైసిపిలోకి రోజుకో పార్టీ మారుతున్న వారితో అయోమయం నెలకొంది. అప్పల నరసయ్యను గెలిపించుకునేందుకు తన కుమారుడు బొత్స సాయి గురునాయుడు సైతం ఈ సారి ప్రచారం చేస్తూ యువతలో నూతన ఉత్సాహం నింపుతున్నారు. టిడిపి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ రాజకీయాలకు కొత్త అనే భావన లేకుండా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిలా కొత్త ఓటర్లను పార్టీలోకి ఆహ్వానిస్తూ చేర్పులతో కొత్త ఉత్తేజాన్ని నింపుతున్నారు. గజపతినగరం మండలంలో పట్టున్న మాజీ జెడ్‌పిటిసి మక్కువ శ్రీధర్‌ వైసిపిని వీడి టిడిపిలో చేరడంతో ఆపార్టీలో జోష్‌ కనిపిస్తోంది. అంతేకాకుండా తనకు సీటు ఇవ్వలేదని కొన్ని రోజులు అలకబూనిన శ్రీనివాస్‌ బాబారు, మాజీఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు కూడా చంద్రబాబు నాయుడు పర్యటనలో శ్రీనివాస్‌తో చేతులు కలపడంతో టిడిపి శ్రేణులు ఉత్సాహంగా ముందుకు కదులుతున్నాయి. కానీ ప్రచారంలో మాత్రం ఆయన ఎక్కడా కనిపించడం లేదు. దీంతో ఆయన గ్రూపు వారంతా శ్రీనివాస్‌కు సహకరిస్తున్నట్లా? లేదా? అంటూ చర్చ జరుగుతోంది.సంక్షేమ పథకాలు,అభివృద్ధిపైనే వైసిపి ఆశలువైసిపి అభ్యర్థి అప్పలనర్సయ్యను భూకబ్జాలు,అవినీతి ఆరోపణలు వెంటాడుతున్నాయి. ఇటీవల దత్తిరాజేరు మండలం కె.కొత్తవలసలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. గూనాం గ్రామంలో కూడా భూములు కొనుగోలు చేసి బాధితులకు డబ్బులు చెల్లించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గజపతి నగరంలో ప్రధాన రహదారి విస్తరణ లాంటి అభివృద్ధి పనులు తన గెలుపునకు సహకరిస్తాయని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ బలమైన నాయకులు, కేడర్‌ ఉండడంతో గెలుపు నల్లేరుపై నడకేనని భావిస్తున్నారు. ఎమ్మెల్యేపై వ్యతిరేకతపైనే టిడిపి ఆశలు వైసిపి అభ్యర్థిపై ఉన్న అవినీతి ఆరోపణలు, భూ ఆక్రమణలు, ఇసుక మాఫియా, నియోజకవర్గ కేంద్రంలో రహదారి విస్తరణలో చిరు వ్యాపారులను తొలగించడం వంటివి తనకు గెలుపునకు సహకరిస్తాయని టిడిపి అభ్యర్థి శ్రీనివాస్‌ భావిస్తున్నారు. మాజీ జెడ్‌పిటిసి మక్కువ శ్రీధర్‌తోపాటు పలు గ్రామాల మాజీ, తాజా సర్పంచులు సైతం టిడిపిలో చేరడం తనకు లాభిస్తుందని చెబుతున్నారు. ఎన్నడూ లేని విధంగా వైసిపి నుంచి టిడిపిలోకి వలసలు పెరగడం కూడా ప్రభావం చూపుతాయంటున్నారు. మాజీ ఎమ్మెల్యే కెఎ నాయుడు, కరణం శివరామకృష్ణ సహకారం వల్ల తన గెలుపు ఖాయమని భావిస్తున్నారు. అలాగే బొండపల్లి మండలంలోని దేవుపల్లి, బొండపల్లి లాంటి అత్యధిక ఓటర్లున్న గ్రామాల్లో టిడిపి పట్టు సాధించినట్లు ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇండియా వేదికవైపు ప్రజల చూపుదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేస్తున్న బిజెపితో టిడిపి, జనసేన కూటమి చేతులు కలపడం, వైసిపి కూడా తొత్తుగా వ్యవహించడంతో ఓటర్లు ఇండియా వేదిక బలపరుస్తున్న కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌ భావిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలును అమలు చేయకపోవడం,జగన్‌ పరిపాలనపై ప్రజల్లో విశ్వాసం కోల్పోవడం వలన ఇండియా కూటమి తరఫునుంచి పోటీ చేస్తున్న తనకు ఓటింగ్‌ పెరుగుతుందని శ్రీనివాస్‌ భావిస్తున్నారు. అయితే ఈ ముక్కోణపు పోటీలో గెలుపెవరిదో వేచి చూడాల్సింది.

➡️