రక్త దాహం!

Mar 28,2024 04:46 #Editorial

తక్షణమే కాల్పుల విరమణ చేయాలంటూ భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని ఖాతరుచేయబోనంటూ ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు చేసిన ప్రకటన యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇజ్రాయిల్‌ చేస్తున్న దురాక్రమణ దాడుల్లో పాలస్తీనా ఇప్పటికే నెలల తరబడి నెత్తురోడుతోంది. అక్టోబర్‌ ఏడున ఈ అమానుష కాండ ప్రారంభమైనప్పటి నుండి ఈ నెల మొదటి వారానికి 30 వేల మందికి పైగా పాలస్తీనీయులు మృతి చెందారు. వీరిలో అత్యధికులు మహిళలు, చిన్నారులే! పదివేల మంది మైనర్లు మరణించినట్లు గాజా మంత్రివర్గం అధికారికంగా ప్రకటించింది. సొరంగాల సాకుతో ఆసుపత్రులపైన కూడా బాంబులు, తూటాల వర్షం కురిపించి మంచాలమీద కదలలేని స్థితిలో ఉన్న వందలాది రోగులను కూడా అత్యంత క్రూరంగా హత్యచేయించిన దుర్మార్గం ఇజ్రాయిల్‌ సొంతం! ఏకపక్ష యుద్ధ కాండలో ఇప్పటివరకు 1.10 లక్షల మంది గాయపడ్డారు. ఇది గాజా జనాభాలో సుమారు 5 శాతం! గాయపడ్డవారిలో 68.1 శాతం మంది సాధారణ పౌరులని లాన్‌సెట్‌ అంచనా వేసింది. వీరుగాక మరో పది వేల మంది ఆచూకీ గల్లంతైంది. వీరు బతికి, కళ్ల ముందు కనపడతారన్న ఆశలు ఎవరికీ లేవు. మృతదేహాలు దొరకలేదు కాబట్టి విగత జీవుల లెక్కల్లో వీరిని చేర్చలేదు అంతే! అక్కడ కనిపించే హృదయ విదారక దృశ్యాల గురించి ఎంత చెప్పినా తక్కువే!
ఇంత ఘోరం జరుగుతోంది కాబట్టే కాల్పుల విరమణ చేయాలంటూ ఆలస్యంగానైనా భద్రతామండలి తీర్మానాన్ని చేసింది. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం ఒకవైపు జరగుతుండగా, మరోవైపు ఇప్పటివరకు మీనమేషాలను లెక్కించిన భూగోళపు అత్యున్నత భద్రతా సంస్థ ఎట్టకేలకు శాంతి సందేశాన్ని వినిపించింది. గతంలో మూడు సార్లు వీటో చేసి ఈ తీర్మానాన్ని అడ్డుకున్న అమెరికా ఈ సారి ఓటింగ్‌కు గైర్హాజరుకావడం గమనార్హం. మండలిలో మిగిలిన 14 దేశాలూ తీర్మానానికి అనుకూలంగా ఓటువేశాయి. ఈ తీర్మానాన్ని భద్రతామండలి చర్చిస్తున్న సమయంలో కూడా గాజాలో నెత్తుటి ధారలను పారించి క్రూరత్వాన్ని చాటుకున్న ఇజ్రాయిల్‌, అమెరికా అనుసరించిన వైఖరిని తీవ్రంగా తప్పు పట్టింది. ఈ సారి కూడా వీటో ఎందుకు ఉపయోగించలేదని నిలదీసింది. దీనికి ప్రతిగా భూతల దాడులకు ప్రత్యామ్నాయాలను వెదికేందుకు తమ దౌత్య బృందం తలపెట్టిన వైట్‌హౌస్‌ సందర్శనను రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో తమ దాడులు కొనసాగుతాయని, భద్రతామండలి తీర్మానాన్ని ఖాతరు చేసేది లేదని నెతన్యాహు తేల్చిచెప్పారు. చెప్పినట్లుగానే భద్రతా మండలి తీర్మానం చేసిన 24 గంటల తరువాత కూడా గాజా వీధుల్లో సైనికుల పదఘట్టనలు, కాల్పుల శబ్దాలు, బాంబుల మోతలు వినిపిస్తున్నట్లు వార్తలు వస్తుండటం బాధాకరం! అదే సమయంలో అమెరికా ఇప్పుడు తీసుకున్న వైఖరికి కూడా కట్టుబడి ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశ అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికలే దీనికి కారణం కావచ్చు.
గాజాలో విస్తృతంగా పర్యటించిన ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి ఫ్రాన్సిస్‌ స్కా అల్బనీస్‌ ఇజాయ్రిల్‌ ఊచకోత (జినోసైడ్‌) కు పాల్పడుతోందని స్పష్టం చేశారు. ఈ మేరకు ‘ది అనాటమీ ఆఫ్‌ ఎ జినోసైడ్‌’ పేరుతో రూపొందించిన నివేదికను ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘానికి మంగళవారం అందచేశారు. ‘గాజాలో ఒక సమూహంగా పాలస్తీనీయన్లపై మారణహోమం జరుగుతోంది. దీనిని నిర్ధారించడానికి అవసరమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి. మానవత్వంపై జరుగుతున్న ఈ అమానుష హింసా కాండను నివేదించడం నా కర్తవ్యం. సభ్య దేశాలు తక్షణం స్పందించకుంటే మరింత ఘోరం జరుగుతుంది. ఇజ్రాయిల్‌పై తక్షణం ఆంక్షలు విధించాలి. ఆ దేశానికి ఆయుధాల అమ్మకాలను నిలిపివేయాలి. ఇటువంటి హింసాకాండ మళ్లీ జరగకుండా చూడాలి’ అంటూ అని ఆమె నివేదికలో పేర్కొన్న అంశాలు క్షేత్రస్థాయిలో నెలకొన్న భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో, గాజా ప్రజానీకం ప్రశాంతంగా ఊపిరి పీల్చడానికి అవసరమైన కార్యాచరణను చేపట్టాలి. రంజాన్‌ మాసం ముగియడానికి మరో రెండు వారాలు మాత్రమే సయయం ఉండటంతో ఆ లోగానే కాల్పుల విరమణను పాటించేలా ఇజ్రాయిల్‌ను కట్టడి చేయాలి. లేనిపక్షంలో పేరు గొప్ప ఊరు దిబ్బగా భద్రతా మండలి మిగిలిపోయే ప్రమాదం ఉంది.

➡️