కళ్ళు తెరిపించిన కల

May 9,2024 04:30 #editpage

ఇదేంటి? కళ్ళు మూతబడితేనే కదా కలలు వస్తాయి? అని మీకు డౌటు రావొచ్చు. తప్పు లేదు. అసలు డౌట్లు వస్తేనే గదా తెలుసుకోవాలన్న తాపత్రయం పెరుగుతుంది?
గెలిచేవాడికే ఓటు వెయ్యాలా? లేక మన ఓట్లు ఎక్కువ ఎవడికి వేస్తే వాడు గెలుస్తాడా? అన్న డౌటు వస్తేనే కదా మనకి మంచి అభ్యర్ధిని ఎంచుకుని ఓటు వెయ్యాలన్న ఇంగిత జ్ఞానం కలిగేది? అదీ సంగతి.
ఇంతకీ నా కల గురించి చెప్పాలని కదా మొదలుబెట్టేను? నిన్న మా మేనల్లుడు మా స్వగ్రామం నుండి ఫోను చేసి చెప్పిన శుభవార్త ఏంటంటే మా తాత ముత్తాతల నాటి నుండీ సాగు చేసుకుంటున్న భూమి మీద మాకు హక్కులున్నట్టు రుజువు చేసుకోవాల్ట. లేకపోతే ఆ భూమిని గవర్నమెంటు భూమిగా కలిపేసుకుంటార్ట. ఎప్పుడో మా తాతకి పట్టా ఇచ్చేరు. అతగాడికి తొమ్మిది మంది సంతానం. మా తాత ఏ రాతకోతలూ లేకుండానే పోయేడు. అతని బిడ్డలు అందరూ కూడబలుక్కుని ఆ భూమిని ఉమ్మడిగా సాగు చేస్తూ వచ్చేరు. ఇప్పటికీ ఆ భూమి పట్టా మా తాత పేరనే ఉంది. మా తండ్రులెవరూ ఇప్పుడు బతికి లేరు. ప్రస్తుతం మేమే తాతలం. మా తాత రాసిచ్చిన కాగితం ఏదీ లేదు. మేమే అతడి వారసులం అని చెప్పడానికి ఏ రికార్డూ లేదు. ఐనా ఇంతవరకూ ఇబ్బంది రాలేదు. కాని ఇప్పుడు అదేదో కొత్త చట్టం వచ్చిందట. దానిని ముందు మోడీ తెచ్చేడట. అలా తెచ్చినప్పుడు చంద్రబాబు శభాష్‌ అని మెచ్చుకున్నాట్ట కూడా. ఆ తర్వాత నేనేనా తక్కువ తిన్నది? అని జగన్‌ అదే చట్టాన్ని మన రాష్ట్రంలో తెచ్చేడట. ఈ గొడవలేవీ నాకు తెలీలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి మేమే మా తాతలకి మనవలం అని రుజువు చేయడం ఎలా? ఇన్నాళ్ళూ ఆ భూమాతనే నమ్ముకున్నాం. ఇప్పుడేది గతి? అని ఆలోచిస్తూంటే నిద్ర పట్టేసింది. నిద్రలో కల వచ్చింది. ఆ కలలోకి ఏకంగా భూమాత వచ్చింది.
ఎవరు తల్లీ మీరు? అని నేనడిగాను. ఒరే! నేను భూ మాతను రా ! అని చెప్పింది.
”నీ గురించే ఆలోచిస్తూంటే ఏకంగా నువ్వే వచ్చేశావా తల్లీ ! అని కూర్చోమన్నాను.
”ఒరే మూర్ఖా! నువ్వే నా మీద కూచున్నావురా. అది కూడా తెలీడం లేదా నీకు? అని కోప్పడింది. అప్పుడు నేను కూడా నిలబడక తప్పలేదు.
”ఇంతకూ నన్నెందుకు తలుచుకున్నావురా?” అనడిగింది.
అప్పుడు మా భూమి మాకు కాకుండా పోతోందన్న విషయాన్ని ఆ తల్లికి చెప్పేను.
అప్పుడు ఆమె ”మీ మానవుల్ని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో తెలీడం లేదురా అబ్బీ. ఈ భూమ్మీద పుట్టిన వారందరిదీ ఈ భూమి కాదా? ఆ మాటకొస్తే ఈ భూమ్మీద ఉన్న అన్ని జీవరాసులదీ కాదా? మరి ఈ భూమ్మీద మానవులకే, అందునా కొందరికే హక్కు ఉన్నట్టు మాట్లాడుతున్నారే ?” అంది.
”నిజమే తల్లీ, కాని మా మానవుల మధ్య భూములను కొనడం, అమ్మడం, ఆ లావాదేవీల మీద గవర్నమెంటు రిజిస్ట్రేషన్‌ చార్జీలు కూడా వసూలు చేయడం ఇదంతా ఏమిటంటావు?” అనడిగేను.
‘ఓరి అజ్ఞానీ!’ అన్నట్లు నన్ను చూసింది భూమాత ఒక్క క్షణం. ఎంతైనా తల్లి మనసు కదా. అందుకని వివరంగా చెప్పిందిలా: ”ఒరే! నేను 450 కోట్ల సంవత్సరాల క్రితం పుట్టేనని మీ మానవులే లెక్కలు చెప్తూంటారు. మరి మీ మానవులేమో కేవలం కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే నా మీదకి వచ్చేరు. చేతుల్లో కర్రో రాయో పట్టుకుని తిండి కోసం ప్రయత్నించడం, నిప్పు తయారీ వంటివి మీకు తెలిసింది 40 వేల సంవత్సరాల క్రితం. మాట్లాడడం తెలిసింది ఆ తర్వాత. అక్షరాలు రాయడం తెలిసింది మూడు వేల సంవత్సరాల క్రితం. సాగు చేసే భూమికి కొలతలు తీయడం తెలిసింది 1600 సంవత్సరాల క్రితం. అదీ చాలా కొద్దిమందికే తెలిసింది. రాజులు పాలించిన కాలంలో ఆ రాజ్యంలోని భూమి అంతా రాజు అజమాయిషీ కిందే ఉన్నట్టు లెక్క వేసేవారు. కొన్ని భూములను దేవాలయాలకో, పండితులకో రాజులు దానాలిచ్చేవారు. అది కూడా ఆ భూమిని వాడుకోడానికే. ఆ తర్వాత రకరకాలుగా భూమి వినియోగం చేతులు మారుతూ వచ్చింది. బ్రిటిష్‌ వాడొచ్చాకనే కదా స్టాంపు పేపర్ల మీద మన భూముల్ని మనకు రాసిచ్చి వాడేమో ఆ స్టాంపు పేపర్ల డబ్బంతా పట్టుకుపోయింది?”
”మన్నించు తల్లీ! నువ్వు చరిత్ర అంతా చెప్తున్నావు కాని ఇప్పుడు మా టౌన్‌లో గజం భూమి లక్ష రూపాయలు పలుకుతోంది తెలుసా?” అని అడ్డం పడ్డాను.
”నాకు తెలీకపోవడమేమిటి? చెప్పేది విను. ఏతా వాతా భూమి ని అనుభవించే హక్కు మాత్రమే చేతులు మారుతోంది తప్ప భూమి మీద సంపూర్ణమైన హక్కు అంటూ ఎవరికీ లేదు. ఇప్పుడు హిరణ్యాక్షుడి సంతతి వాళ్ళు కొందరు బయల్దేరారు. ఈ భూమినే స్వాహా చేసేద్దాం అనుకుంటున్నారు. అందుకే చట్టాలంటూ హడావుడి చేస్తున్నారు. ఇవేవీ చెల్లవు” అంది భూమాత.
”ఏమో తల్లీ! నువ్వేమో ఇలా చెప్తున్నావు కాని తెల్లారితే మళ్ళీ కనిపించవు. కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పవు. మరి నిన్నే నమ్ముకున్న మాకు దిక్కెవ్వరు తల్లీ?” అని వేడుకున్నాను.
”ఓరి వెర్రివాడా! ఇంత అమాయకుడివి నా కడుపున ఎలా పుట్టేవురా? ” అనడిగింది జాలిగా భూమాత.
”నేను ఉండబట్టలేక, ”తల్లిదండ్రుల పోలికలే కదా పిల్లలకి వస్తాయి?” అన్నాను.
ఒక్క మొట్టికాయ పెట్టింది. మళ్ళీ నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది.
అప్పుడు భూమాత ఇలా చెప్పింది: ”ఒరే! భూమిని వినియోగించే హక్కు మాత్రమే ఉండాలి. ఇదే కదా ఇంతవరకూ నడుస్తోంది. ఆ హక్కుని వాళ్ళు అమ్ముకుంటారో లేదో అది వాళ్ళ ఇష్టం. అది వేరే సంగతి. కాని ఇన్ని సంవత్సరాలూ ఆ భూమ్మీద మీ కుటుంబమే బతుకుతోందంటే ఆ భూమి మీదే కదా? మీరు ఎవడికో ఎందుకు సంజాయిషీ చెప్పుకోవాలి? అలా చెప్పుకోవాలని చేసే చట్టాల్ని మీరెందుకు ఒప్పుకోవాలి? అటువంటి దిక్కుమాలిన చట్టాల్ని తెచ్చినవాళ్ళని ఎందుకు ఊరికే వొదిలిపెట్టాలి? దున్నేవాడిదే భూమి. ప్రతీవాడికీ ఈ భూమ్మీద తల దాచుకోడానికి భూమి కలిగివుండే హక్కు ఉండాలి. సాగు చేసేవాళ్ళందరికీ భూమి మీద హక్కు ఉండాలి. అనాదిగా ఇదే ఉండేది. మధ్యలో బ్రిటిష్‌ వాడొచ్చిన దగ్గరి నుంచీ పాడైపోయింది. ఇప్పుడు మరీ దరిద్రంగా తయారు చేస్తున్నాయి మీ ప్రభుత్వాలు.” అంది.
”అవును తల్లీ! మేం కూడా చదువుకునేటప్పుడు దున్నేవాడికే భూమి అని ఎర్రజెండాలు పుచ్చుకుని తిరిగేం. ఆ తర్వాత ఆ జెండా వదిలేసి ఇదిగో, ఇలా అయోమయంలో పడ్డాం.” అన్నాను.
”మరింకేం? మళ్ళీ ఆ జెండా పుచ్చుకో, అదే దారి” అంది భూమాత.
నాకు ఉత్సాహం ఎక్కువై గట్టిగా ”దున్నేవాడికే భూమి! ఇల్లు కట్టుకోడానికి స్థలం! భూమాతా జిందాబాద్‌! అంటూ అరిచేను.
ఇంతలో నా భార్య గట్టిగా నన్ను కుదిపి ‘ఏవిటా అరుపులు!’ అనడంతో లేచాను.
ఇప్పుడు మీరే చెప్పండి. నాకు వచ్చిన కల నా కళ్ళు తెరిపించిందా? లేదా?

-సుబ్రమణ్యం

➡️