జిడిపిలో వ్యవసాయం ఎక్కడుంది?

article agriculture in gdp problems of farmers bjp failures

మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో బ్యాంకు రుణాలు చెల్లించలేని పది మంది రైతులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడారు. ”తీసుకున్న అప్పు చెల్లించలేకపోవడంతో బ్యాంకులు మాకు నోటీసు ఇచ్చాయి. తిరిగి కట్టడానికి మా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. కాబట్టి, అప్పు తీర్చడానికి మేం మా శరీర భాగాలను అమ్మడానికి సిద్ధంగా ఉన్నాం” (ఒక్కో అవయవం ధరను ఇలా ప్రకటించారు:లివర్‌-రూ.90,000, కిడ్నీ-రూ.70,000, కన్ను-రూ.25,000).బడా కార్పొరేట్లు పదేళ్లుగా బకాయిపడిన రూ.15 లక్షల కోట్ల మొండి బాకీలను బ్యాంకులు మాఫీ చేసిన దేశంలో పేద రైతులు తమ అవయవాలను అమ్ముకుని అప్పులు తీర్చుకోవడం తప్ప మరో మార్గం లేదని ప్రకటించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులు చేసిన ఈ ప్రకటన భారతీయ వ్యవసాయ-గ్రామీణ ఆర్థిక వ్యవస్థ విషాద చిత్రాన్ని వెల్లడిస్తుంది. ఇదిలా ఉండగా, దేశంలో వ్యవసాయ వృద్ధి ఎనిమిదేళ్లలో అత్యంత దారుణంగా క్షీణిస్తున్నదని నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఓ) గత వారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు తెలియచేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఓ ప్రాథమిక అంచనా ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) వ్యవసాయ రంగంలో వృద్ధి 1.8 శాతం మాత్రమే. దీనికి ముందు 2015-16లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అప్పుడు వృద్ధి 0.6 శాతం మాత్రమే. 2022-23లో 4 శాతం ఉన్న వృద్ధి ఇప్పుడు సగానికి తగ్గింది. నేషనల్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫీస్‌ రిపోర్ట్‌ (జనవరి 6) ప్రచురించిన మరుసటి రోజు వెలువడిన బిజినెస్‌ స్టాండర్డ్‌ కథనం, జనవరి 10 ‘హిందూ’ సంపాదకీయం వ్యవసాయంలో క్షీణత గురించి నొక్కిచెప్పాయి. జిడిపి లోనే, వాణిజ్యం, హోటల్‌, రవాణా, కమ్యూనికేషన్‌ కూడా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే క్షీణించాయి. వీటన్నింటిలో గత సంవత్సరం 14 శాతం వృద్ధి ఉంటే, ఈసారి అది 6.3 శాతానికి పడిపోయింది. ఉపాధి అందుబాటులో ఉన్న అన్ని రంగాల్లో వృద్ధి తక్కువగా ఉంది.దేశంలోని శ్రామిక శక్తిలో 47 శాతం వ్యవసాయ రంగంలో ఉన్నారు. దాదాపు 70 శాతం గ్రామీణ కుటుంబాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి. మరో అంచనా ప్రకారం జనాభాలో దాదాపు సగం మంది (70 కోట్లు) వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. కానీ ప్రస్తుతం రైతులు వ్యవసాయ కూలీలుగా, కాంట్రాక్టు కూలీలుగా మారుతున్నారు. దేశానికి వెన్నెముకగా ఉన్న వ్యవసాయ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మోడీ పాలన పూర్తిగా విస్మరించిందని పతనానికి సంబంధించిన గణాంకాలు తెలియజేస్తున్నాయి. వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు గాని, ఉత్పత్తి ఖర్చులకు తగిన మద్దతునిచ్చేందుకు గాని ఎలాంటి చర్యలూ లేవు. ఎం.ఎస్‌.స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సు ప్రకారం ఉత్పత్తి వ్యయంలో యాభై శాతం కలిపితే కనీస మద్దతు ధర. దీన్ని చట్టబద్ధంగా నిర్ధారించాలన్నది ఏడాది పాటు సాగిన రైతాంగ సమ్మె ప్రధాన డిమాండ్‌. అది ఇంకా అమలు కాలేదు.2023-24లో వివిధ రంగాలకు మొత్తం బడ్జెట్‌ కేటాయింపులు రూ.45 లక్షల కోట్లు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.1.25 లక్షల కోట్లు మాత్రమే. మొత్తం బడ్జెట్‌లో 2.8 శాతం మాత్రమే. వ్యవసాయానికి ఇంత తక్కువ కేటాయింపులు జరగడం చూస్తుంటే సామాన్య రైతులు వ్యవసాయాన్ని వదిలేయాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని స్పష్టమవుతోంది. ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనామిక్‌ కో-ఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (ఒఇసిడి) 54 దేశాలలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, వ్యవసాయానికి బడ్జెట్‌ మద్దతు లేని దేశం భారతదేశం. 1991 నుండి భారతదేశంలో అమలవుతున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాల తీవ్ర ప్రభావం వ్యవసాయంపైన ఉంది. వ్యవసాయ రంగంలో ఎక్కడ చూసినా రుణాలు అందక, తీసుకున్న అప్పులు తీర్చలేక, వడ్డీ వ్యాపారుల వలలో చిక్కుకుని, తమ ఉత్పత్తులకు తగిన ధర లభించక జీవనం సాగిస్తున్న దయనీయ పరిస్థితి మనకు కనిపిస్తుంది. మూడు దశాబ్దాల్లో మూడు లక్షల మంది రైతులు ప్రాణాలు తీసుకున్నారు. 1991 నుంచి 2011 మధ్య కాలంలో కోటిన్నర మంది రైతులు వ్యవసాయాన్ని వదులుకున్నారు. దాదాపు పదేళ్ల నరేంద్ర మోడీ పాలనలోనే 1,00,474 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు (నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో అంచనాలు). 2021లో 10,881 మంది, 2022లో 11,290 మంది ప్రాణాలు కోల్పోయారు.ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం ప్రయివేటు బీమా కంపెనీలకు కోట్లకు పడగలెత్తే మార్గంగా మారింది. 2019లో ప్రకటించిన పి.ఎం కిసాన్‌ సమ్మాన్‌ పథకం, రైతులకు సంవత్సరానికి రూ.6,000 అందజేస్తుంది. ఇది కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉంది. భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయం వాటా 1991లో 35 శాతం ఉండగా 2022-23 నాటికి 15 శాతానికి తగ్గిందని ప్రభుత్వమే ఇటీవల పార్లమెంటుకు తెలియజేసింది. దీన్నిబట్టి చూస్తే వ్యవసాయానికి తగిన ప్రాధాన్యం లేదని స్పష్టమవుతోంది. ఆర్థిక సర్వే 2016 ప్రకారం, 17 రాష్ట్రాల్లో వ్యవసాయ కుటుంబాల సగటు వార్షిక ఆదాయం రూ.20,000. అంటే నెలకు రూ.1700. రైతుల ఆదాయం వెనక్కు వెళ్లింది తప్ప ఏమాత్రం ముందుకు సాగలేదు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మోడీ ప్రకటించారు మరి!వ్యవసాయ రంగంలోని వాస్తవాలను దాచి పెడుతున్నారని, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిరోజూ ఊదరగొడుతున్నారు. దేశానికి తిండి పెట్టే అట్టడుగు వర్గాల రైతుల పట్ల వారికి దయ, ప్రేమ లేదు. వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు సాగిన రైతుల సమ్మెను అనివార్య పరిస్థితులలో ముగించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. మనందరికీ అన్నం పెట్టే రైతుపై మృత్యుపాశం విసిరేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నించింది. పోరాటమే రైతు ముందున్న ఏకైక మార్గం. గణతంత్ర దినోత్సవమైన జనవరి 26న జిల్లా స్థాయిలో దేశవ్యాప్తంగా చేయనున్న ట్రాక్టర్‌ ర్యాలీలు కొత్త పోరాటాలకు నాంది కానున్నాయి.

– మధు నీలకందన్‌ (‘దేశాభిమాని’ సౌజన్యంతో)

➡️