మళ్లీ నిరాశే..!

cop 28 neglect climate change impacts

ధనిక దేశాలను నియంత్రించడంలో ఐక్యరాజ్యసమితి విఫలమవుతున్న తీరుకు వాతావరణ సదస్సు-కాప్‌ 28 ముగిసిన తీరే తాజా నిదర్శనం. గత నెల 30వ తేదీన దుబారులో ప్రారంభమైన ఈ సదస్సు అధికారికంగా 12వ తేదీనే ముగియాల్సి ఉన్నప్పటికీ, బుధవారం నాడు కూడా కొనసాగింది. అయినా, వాతావరణ మార్పుల ప్రభావాన్నుండి భూగోళాన్ని, మానవాళిని కాపాడేందుకు తీసుకున్న చర్యలు నామమాత్రమే! ఆచరణాత్మక దిశలో అడుగు ముందుకు వేయడానికి బదులుగా ధనిక దేశాలు వాగాడంబరానికి, తమ ఎజెండాను పేద దేశాలపై రుద్దడానికే అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. ఈ కారణంగానే సదస్సు ముగిసిన తరువాత అనేక పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశాయి. ప్రతిష్టాత్మక లక్ష్యాలను సంకల్పించే ముందు క్షేత్ర స్థాయిలో వాటిని అమలు చేసే పరిస్థితులు ఉండాలని, ఈక్విటి, క్లైమేట్‌ జస్టిస్‌లపై ఆధారపడి ముందుకు సాగాలని భారత్‌ వ్యాఖ్యానించింది. అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలు వ్యక్తం చేసిన అనేక ఆందోళనలను కాప్‌ 28 పరిగణలోకి తీసుకోలేదని చైనా విమర్శించింది. పేద దేశాలకు సుద్దులు చెప్పే ముందు ఇతర దేశాల కన్నా ముందుగా ధనిక దేశాలు ప్యారిస్‌ ఒప్పంద లక్ష్యాలను సాధించేందుకు అడుగు ముందుకు వేయాలని కోరింది. నూతన వలస విధానానికి తాము మరోసారి బాధితులమవుతున్నామని బొలీవియా పేర్కొంది. ధనిక దేశాలు కార్బన్‌ వలస వాదాన్ని అమలు చేస్తున్నాయని, తమ వంటి దేశాలకు అభివృద్ధి చెందే హక్కును నిరాకరిస్తున్నాయని విమర్శించింది. దాదాపుగా అన్ని పేద దేశాలు ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం దేనికి ప్రతిబింబమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాతావరణ మార్పుల కారణంగా చోటుచేసుకునే నష్టాలను పూడ్చేందుకు నిధిని ఏర్పాటు చేయాలన్న గత సమావేశ ప్రతిపాదనను తొలిరోజే ఆమోదించడంతో వ్యక్తమైన సానుకూల సంకేతాలు ఆ తరువాత ఆవిరైనాయి. దాదాపు 700 మిలియన్‌ డాలర్లతో ఏర్పాటైన ఈ నిధితోనే గతంలో తాము చేసిన తప్పులన్నీ మాఫీ అయినట్లుగా అమెరికా నేతృత్వంలోని ధనిక దేశాల ప్రతినిధులు ఉపన్యాసాలు చేయడం, పేద దేశాలకు సుద్దులు చెప్పడానికి సిద్ధమైపోవడం దుర్మార్గం. ఈ క్రమంలోనే ప్యారిస్‌ ఒప్పంద పురోగతిలో భాగస్వామ్య (గ్లోబల్‌ స్టాక్‌టేక్‌) లక్ష్యాల్లో భాగంగా శిలాజ ఇంధనాల వినియోగాన్ని, ముఖ్యంగా బొగ్గు వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలంటూ ధనిక దేశాలు చేసిన ప్రతిపాదన సమావేశంలో గగ్గోలు రేపింది. బొగ్గుతో పాటు అన్ని రకాల శిలాజ ఇంధనాల వినియోగాన్ని 2050 నాటికి సున్నా స్థాయికి తీసుకురావాలన్న ఆ దేశాల ప్రతిపాదనను చైనా, భారత్‌లతో పాటు అన్ని అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలు (బేసిక్‌, ఎల్‌ఎండి దేశాలు) వ్యతిరేకించాయి. దీంతో ఈ ప్రతిపాదనలో వాడిన భాషను కొంత మేర సవరించక తప్పని స్థితి ఏర్పడింది. దీనికే ధనిక దేశాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అదే సమయంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వ్యవస్థకు మారడానికి తమకు సాంకేతిక సాయంతోపాటు, ప్రత్యేకంగా ఆర్థిక సాయాన్ని అందించాలంటూ పేద దేశాలు చేసిన విజ్ఞప్తిని తిరస్కరించడం రెండు నాల్కల ధోరణికి నిదర్శనం. అనేక ఇతర అంశాలపై కూడా ధనిక దేశాలు ఇదే విధంగా వ్యవహరించడంతో కాప్‌-28 వాతావరణ లక్ష్యాల సాధనకు దూరంగానే మిగిలిపోయింది. సమావేశాల ముగింపు కార్యక్రమంలో విడుదల చేసిన ప్రపంచ లక్ష్యాలు (గ్లోబల్‌ గోల్‌ ఆన్‌ ఆడాప్టేషన్‌-జిజిఎ)పైనా సంపన్న దేశాల పట్టే కనిపించింది. కొన్ని దశాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉన్న ‘సాధారణం కానీ విభిన్న బాధ్యతలు, సంబంధిత సామర్ధ్యాల సూత్రం ఈసారి కూడా జిజిఎలో చోటుచేసుకోలేదు. వాతావరణ ప్రమాద అంచనాలు రూపొందించడం, నివారణకు ప్రణాళికలు తయారు చేయడం, అమలు చేయడం వంటి అంశాలు ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నాయి. ఆర్థిక సాయం కోసం ధనిక దేశాల దయా దాక్షిణ్యాలపై ఆధారపడటం కాకుండా స్పష్టమైన విధానాన్ని రూపొందించాలన్న ఆఫ్రికన్‌ దేశాల విజ్ఞప్తినీ పరిగణలోకి తీసుకోలేదు. అయితే, ఆ సమావేశానికి కూత వేటు దూరంలో సమావేశమైన వేలాదిమంది ప్రజానీకం భూగోళానికి దాపురించిన ముప్పునకు ధనిక దేశాలదే బాధ్యతని, అమెరికాతో పాటు ఇతర అభివృద్ధి చెందిన దేశాలు దీనికి బాధ్యత వహించాలని పెద్ద ఎత్తున నినదించడం భవిష్యత్తు పట్ల ఆశలను పెంచుతోంది.

➡️