శ్రామికుల హెచ్చరిక

industrial strike against bjp govt policies vsp

సంయుక్త కిసాన్‌ మోర్చా, వివిధ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు శుక్రవారంనాడు కార్మిక కర్షక లోకం కేంద్ర ప్రభుత్వ దుర్విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు, అనేక రాష్ట్రాల్లో గ్రామీణ బంద్‌, వివిధ రంగాల్లో పారిశ్రామిక సమ్మె విజయవంతం కావడం హర్షణీయం. నాలుగు కార్మిక కోడ్‌ల రద్దు, మద్దతు ధరకు చట్టం చేయడం వంటి ప్రధాన డిమాండ్లతో దేశ రాజధాని ఢిల్లీలో, పంజాబ్‌, హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్‌, కేరళ, పశ్చిమ బెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో భారీ ర్యాలీలు, నిరసన ప్రదర్శనలూ చేపట్టారు. పంజాబ్‌ హర్యానాల్లో రైల్వే స్టేషన్లవద్ద ఆందోళనలతో పలు రైళ్లను దారి మళ్లించారు. సామాన్యుల నడ్డి విరగ్గొట్టి కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చడం కోసం విద్వేష సృష్టితో పాలన సాగిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి శ్రామికులు పూరించిన శంఖారావంగా భావించవచ్చు. సంపద సృష్టికి కారణమైన కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, వివిధ సేవలందించే ఉద్యోగులూ ఒక్కటై సర్కారు విధానాలను ప్రతిఘటించడం అభినందనీయం.

గడచిన నాలుగు రోజులుగా అన్నదాతల ‘ఢిల్లీ ఛలో’ను అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు విధించింది. పోలీసులు భాష్పవాయు గోళాలను, రబ్బర్‌ బులెట్లను ప్రయోగించడంతో పలువురు రైతులు గాయపడ్డారు. సిమెంట్‌ దిమ్మెలను రోడ్లకు అడ్డంగా వుంచడం, రోడ్లపై ఇనుప మేకులను అమర్చడంతోపాటు ఢిల్లీకి దారితీసే అన్ని దారులను మూసివేశారు. డ్రోన్లతో టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ ప్రయోగిస్తుంటే రైతులు గాలిపటాలు ఎగురవేసి డ్రోన్లను అడ్డుకోవడం, టియర్‌ గ్యాస్‌ ప్రభావాన్ని తగ్గించుకునేందుకు తాగునీటి బాటిళ్లతో దుస్తులు తడిగా ఉంచుకోవడం వంటివి వారి ప్రతిఘటనా స్ఫూర్తికి నిదర్శనం. కేంద్ర ప్రభుత్వ దాష్టీకాన్ని ఢిల్లీ హైకోర్టు సైతం తప్పుబట్టింది. రైతులకు రోడ్లపై తిరుగాడే హక్కు ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసి, రైతులు నిరసన తెలిపేందుకు స్థలాలను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులను నేరస్థులుగా పరిగణించలేమని, వారు దేశానికి అన్నం పెట్టే అన్నదాతలని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ కుమార్తె డాక్టర్‌ మధుర స్వామినాథన్‌ వ్యాఖ్యలు అక్షర సత్యాలు. రైతులపై డ్రోన్లను వినియోగించి మరీ భాష్పవాయు గోళాలు ప్రయోగించి అణిచివేత చర్యలకు పాల్పడటం దుర్మార్గమన్న పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు అణిచివేత చర్యలకు తక్షణమే ముగింపు పలకాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఎల్లెడలా ఆందోళనకారులకు సంఘీభావం, కేంద్రంపై ఆగ్రహం వ్యక్తమయ్యాయి.

ఢిల్లీలో ఒక సంవత్సరం పైగా 2020 నుండి 2021 వరకు ఎడతెగని ఉద్యమం సాగడంతో ఆనాడు మోడీ సర్కారు వెనక్కు తగ్గింది. మూడు వ్యవసాయ నల్ల చట్టాలను బిజెపి ప్రభుత్వం రద్దు చేయాల్సి వచ్చింది. పంటలకు కనీస ధర గ్యారెంటీ చేసే చట్టాన్ని తెస్తామని, 2021 విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకుంటామని రైతు ఉద్యమానికి ప్రభుత్వం హామీ ఇచ్చినా ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమేగాక విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు తప్పనిసరి చేయడం, దేశ సంపదను అదానీ ఆంబానీ వంటి కార్పొరేట్లకు ధారాదత్తం చేసే చర్యలను వేగవంతం చేయడంతో రైతులు, కార్మికులు మళ్లీ ఉద్యమించవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధరపై హడావిడిగా చట్టాన్ని చేయడం సాధ్యం కాదని కేంద్ర వ్యవసాయ మంత్రి ప్రకటించడం మోడీ సర్కారు అహంకారానికి నిదర్శనం. ఒకవైపు ఎంఎస్‌ స్వామినాథన్‌కు భారతరత్న ప్రకటించి, ఆయన చెప్పిన సి2 ప్లస్‌ 50 మద్దతు ధరగా చెల్లించాలన్న సిఫార్సును బుట్టదాఖలు చేయడం మోసపూరితం. కార్మిక కర్షకుల దేశ వ్యాప్త ఆందోళను హెచ్చరికగా భావించి మోడీ సర్కారు వెనక్కు తగ్గాలి. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేయడంతప్ప కార్మిక కర్షకులకు మరో మార్గం లేదు. ఆ ఉద్యమం మోడీ సర్కారును సాగనంపే వరకూ సాగించాలి.

➡️