పోస్టుకార్డు!

Jan 7,2024 07:35 #Editorial, #postal, #Service Sector
editorial on post card history

‘ఇక్కడ నేను క్షేమం-అక్కడ నువ్వు కూడా/ ముసలి అమ్మా, పాత మంచంకోడూ/మన చిన్నబ్బాయి, చెరువులో కొంగా’ అని మొదలవుతుంది ఒక ‘సైనికుడి ఉత్తరం’. ‘దూరాభారాన ఉన్న కుమారుని కోసం/ వగచే తల్లికి/ చేరువ చేరువౌవుతున్న నువ్వొక ఊరట/ దగ్గర దగ్గరౌతున్న మిత్రుని లేఖకోసం/ నిలిచిన తరుణికి నీ రాక ఒక బాసట/ వర్తకుడికి నర్తకుడికి ఖైదులో దొంగకి హంతకుడికి/ ఉద్యోగ శప్తుడైన నవీన యక్షునికి/ మనిషికి రాక్షసునికి/ నువ్వు/ దూరాల దారాల్ని విచిత్రంగా/ ఒకే నిమిషము/ అనే కండె చుట్టూ తిప్పగల నేర్పరివి- కూర్పరివి’ అంటాడు తిలక్‌. అనేక బంధాలను ముడివేసే దారం ఉత్తరం. ఉత్తరం అంటేనే మధురమైన జ్ఞాపకం. ఉత్తరం చూసినా, చదివినా ఎన్నో మధురమైన జ్ఞాపకాలు, ఆనందాలు, సంతోషాలు, చేదు నిజాలు, కష్టమైన సంఘటనలు ఎన్నో గుర్తొస్తాయి. అంతటి అనుబంధం ఒక్క ఉత్తరంలోనే వుంది. ఏ తీగకో గుచ్చి… ఓ మూలన వేలాడదీసిన ఉత్తరాలు…సంవత్సరాల తరబడి ఎన్నో జ్ఞాపకాలను తమలో దాచివుంచేవి. ఎప్పుడైనా వాటిని కదిలిస్తే… దోసిట్లో లంకె బిందెల్లా దొర్లిపడతాయి జ్ఞాపకాలు. పుట్టుక నుంచి చావు వరకు ప్రతి సందర్భంతోనూ ఎన్నెన్ని అనుబంధాలను పోగేసుకున్నాయో ఈ ఉత్తరాలు. పోస్టుకార్డుకు చాలా పెద్ద చరిత్ర వుంది. ఒకప్పుడు క్షేమ సమాచారం తెలుసుకోడానికి పోస్టుకార్డే ప్రధాన ఆధారం. సాంకేతికత పెద్దగా విస్తరించని కాలంలో ఉత్తరమే మనుషుల మధ్య వారధి, సమాచారాన్ని చేరవేసే సారథి. ఒకరి క్షేమ సమాచారాలను, లోలోపలి భావోద్వేగాలను మరో మనిషికి అందజేసే వాహికలు ఉత్తరాలు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనుమరుగైంది. ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఇ-మెయిల్స్‌ సదుపాయం పెరగడంతో ఉత్తరం పాత్ర రోజురోజుకూ తగ్గిపోయింది. అయితే, ఇప్పటికీ పోస్టుకార్డును వినియోగిస్తున్న మారు మూల ప్రాంతాలు లేకపోలేదు. ఇ-మెయిల్‌ నిమిషాల వ్యవధిలో ప్రపంచంలోని ఏ మూలకైనా సమాచారాన్ని పంపించగల వ్యవస్థ. కానీ సమాచార వ్యవస్థ ప్రారంభంలో రాసిన తాళపత్రాన్ని దూరప్రాంతాలకు గుర్రాలపై తీసుకెళ్లి, తిరిగి జాబు కూడా తీసుకొచ్చేవారు. అంత ప్రాచీన కాలంలో కూడా సమాచార వ్యవస్థకు వున్న ప్రాధాన్యత ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత కాలంలో ప్రింటింగ్‌ యంత్రాలు వచ్చి, రవాణా సౌకర్యాలు పెరిగి, ఆవిరి యంత్రం వంటివి అందుబాటులోకి వచ్చిన తర్వాత పోస్టుకార్డు వచ్చింది. పోస్టుకార్డును తొలిసారిగా 1861లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోనూ, మన దేశంలో 1879 జులై ఒకటిన ప్రవేశపెట్టారు. సుమారు పదిహేనేళ్ళ కిందటి వరకు పోస్టుకార్డుకు జనజీవనంతో విడదీయలేని సంబంధం ఉండేది. ఇంటర్నెట్‌, సెల్‌ఫోన్‌లు అందుబాటులోకి రావడంతో ఉత్తరాలు, పోస్టుకార్డులకు బ్రేక్‌ పడింది. ఒకప్పుడు దూరాలను కరిగించి, అనుబంధాలను దగ్గర చేసేవి. ఇప్పుడు మనుషులంతా దగ్గరైనట్లే వుంటారు గాని భౌతికంగా దూరమౌతున్నారు. మానసికంగా దగ్గరవుతున్నట్లు అనిపిస్తున్నా…అది ఎంతవరకూ అనేది అంతుచిక్కని విషయం. సాంకేతిక పెరుగుదల అవసరమే గానీ, మానవ స్పర్శ, స్పందన ఇ-మెయిల్‌తో లభించదు. పోస్టుకార్డు అందుకొని అందులోని విషయాన్ని చదువుకున్న అనుభూతి మాత్రం రాదు. ఉత్తరంలోని తనవారి దస్తూరిని చూసుకొని, ఆ అక్షరాలను చేత్తో తడుముకొని, గుండెలకు హత్తుకుంటే.. వారిని భౌతికంగా స్ప్రుశించిన అనుభూతి చాలామందికి అనుభవమే.సమాచార వ్యవస్థలో మానవత్వ స్పర్శ ఉత్తరం. ఈ కార్డు ముక్క…అప్పుడొక అవసరం. ఎప్పుడూ మధురమైన జ్ఞాపకం. అప్పుడప్పుడు ఉద్యమ రూపం. సాహిత్య ప్రక్రియగా కూడా ఉత్తరం యొక్క ప్రాశస్త్యం అనన్యమైంది. ప్రత్యేకించి మనసులోని మమతనంతా రంగరించి రాసిన చలం ‘ప్రేమ లేఖలు’, మార్క్స్‌-ఎంగెల్స్‌ మధ్య నడిచిన ఉత్తరాలు, నెహ్రూ తన కుమార్తె ఇందిరకు రాసిన లేఖలకు చాలా ప్రత్యేకత వుంది. ఆనాటి అమెరికా అధ్యక్షుడు థామస్‌ జఫర్సన్‌ తన జీవితకాలంలో దాదాపు ఇరవై వేల ఉత్తరాలు రాశారట. గాంధీజీ, ప్రేమ్‌చంద్‌ లేఖలు, చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ తెలుగులో రాసిన ఉత్తరాలూ ప్రత్యేకమే. శ్రీశ్రీ, ఆరుద్ర, గురజాడ, బోయి భీమన్న వంటి వారి ఉత్తరాల్లో తెలుగు సాహిత్యం ఉట్టి పడుతుంది. పాలకులకు ఉత్తరాలు రాయడం కూడా ఆనవాయితీగా వస్తోంది. అందుకే ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక నాయకులు తమ డిమాండ్లను ఉత్తరాల ద్వారా తెలుపుతున్నారు. పోస్టుకార్డు ఉద్యమ రూపానికి ఇప్పుడొక నిర్వచనం. మానవ హక్కుల ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు పోస్టుకార్డును ఉద్యమ రూపంగా వాడుతున్నాయి. నిరంకుశత్వం, నిర్లక్ష్యం వున్నంతకాలం నిరసనలు, ఉద్యమాలు వుంటాయి. మనిషి వున్నంతకాలం మానవ స్పర్శ వుంటుంది. స్పర్శ వున్నంతకాలం పోస్టుకార్టూ వుంటుంది. ఈ పోస్టుకార్డు కలకాలం బతకాలని ఆశిద్దాం.

➡️