కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ

May 13,2024 07:10 #cpm, #House Arrest, #JK Apni and others

– సభలు, సమావేశాలకు అడ్డంకులు
– ఎక్కడికక్కడ రాజకీయ కార్యకర్తల అరెస్టులు
-శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. భారత రాజ్యాంగ కల్పించిన హక్కులను కేంద్రంలోని బిజెపి, దాని కనుసన్నల్లో పనిచేసే జమ్ముకాశ్మీర్‌ అధికార యంత్రాంగం పట్టపగలే కాలరాస్తున్నాయి. ప్రతిపక్ష పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ, సిపిఎం, జెకె అప్నీ తదితర పక్షాల నాయకులను, కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారు. సభలు, సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలోనే సిపిఎం నేత మహ్మద్‌ యూసుఫ్‌ తరిగామిని ఎన్నికల ప్రచారంలో పాల్గనకుండా అక్కడి అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు పార్టీ కార్యకర్తలను కూడా అడ్డుకున్నారు. దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్‌లో రేబన్‌ జయీన్‌పొరాలో ఆదివారం ఎన్నికల ప్రచార సభ నిర్వహించాల్సివుండేది. అయితే శనివారం నుంచే ఆ ప్రాంతానికి సిపిఎం కార్యకర్తలను వెళ్లనీయకుండా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వైఖరిని తరిగామి తీవ్రంగా ఖండించారు. ఎన్నికల వేళ రాజకీయ కార్యకర్తలను అరెస్టు చేయడమంటే ఎన్నికల ప్రక్రియలో అక్రమాలకు పాల్పడటమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నిర్వహించాల్సిన సభకు హాజరుకానివ్వకుండా తనను పోలీసులు అడ్డుకోవడం, పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని ఆయన అన్నారు. ఎన్నికల్లో పాల్గనడం ప్రజల హక్కు అని, వాటిని రక్షించుకోవడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. భిన్నత్వంలో ఏకత్వమనే విశిష్ట లక్షణమున్న భారత్‌లో ప్రజల భిన్నాభిప్రాయాలను గౌరవించడం అందరి బాధ్యత అని, ఎన్నికల సంఘం తక్షణమే జోక్యం చేసుకొని సభ నిర్వహించుకునే రాజ్యాంగ హక్కును కాపాడాలని తరిగామి విన్నవించారు.
రిగ్గింగ్‌ జరక్కుండా చూడండి : మెహబూబా ముఫ్తీ
1987 తరహా రిగ్గింగ్‌ జరక్కుండా చూడాలని, ఓటర్ల అరెస్టులు ఆపాలని భారత ఎన్నికల సంఘానికి జమ్ముకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పిడిపి) అధ్యక్షులు మెహబూబా ముఫ్తీ కూడా లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న రాష్ట్ర అధికారులు ఓటర్లను, పిడిపి మద్దతుదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. పుల్వామా, షోపియాన్‌ జిల్లాల్లో భద్రతా దళాలు సోదాలు నిర్వహించి, పిడిపి కార్యకర్తలను వేధిస్తున్నారన్న కథనాలు తీవ్ర ఆందోళనకు గురైనట్లు లేఖలో ఆమె తెలిపారు. అనంతనాగ్‌-రాజౌరీ ఎన్నికను వాయిదా వేయడం వంటి చర్యలు ఇసి నిష్పాక్షికతపై ఆందోళనలు లేవనెత్తుతున్నాయిని, అదేవిధంగా బెదిరింపులు, దౌర్జన్యం ద్వారా ఎన్నికల ఫలితాలను మార్చడానికి ప్రయత్నించే వారికి ధైర్యం కలిగిస్తున్నాయని విమర్శించారు. మరోవైపు, శ్రీనగర్‌, బుద్గాం, పుల్వామా, షోఫియాన్‌ల్లోని వివిధ ప్రాంతాల్లో జెకె ఆప్నా పార్టీ కార్యర్తలను పోలీసులు పెద్ద సంఖ్యలో అరెస్టు చేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రఫీ అహ్మద్‌ మీర్‌ తెలిపారు. ‘ఎన్నికలకు కేవలం కొన్ని గంటల ముందు పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయడం ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఈ అన్యాయాన్ని మేం సహించం, ఎన్నికలను బహిష్కరిస్తాం’ అని మీర్‌ తెలిపారు.

➡️