హద్దుమీరిన మత విద్వేషజాఢ్యం

May 13,2024 07:11 #PM Modi, #speech

– ముస్లింలపై మళ్లీ మోడీ అక్కసు
– సిఎఎ అమల్జేసితీరుతామని వెల్లడి
– మోడీ బతికుండగా రద్దు చేయలేరంటూ సవాళ్లు
-మత రిజర్వేషన్లకు వ్యతిరేకమని పునరుద్ఘాటన
– ఫక్తు మతతత్వవాదిగా ప్రధాని ప్రచారం
కొల్‌కతా : మత విద్వేషజాఢ్యం హద్దులు మీరింది. సార్వత్రిక ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ముస్లింలను లక్ష్యంగా చేసుకొని విద్వేష ఆజ్యం పోస్తున్న బిజెపి అధినేతలు నాలుగో దశ పోలింగ్‌ ముందు రోజు మరింత విషం వెళ్లగక్కారు. పశ్చిమ బెంగాల్‌లోని బర్రక్‌పుర్‌, హూగ్లీ ప్రాంతాల్లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగాలు ఫక్తు మతతత్వవాదిని తలపించాయి. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)ని అమల్జేసితీరుతామని ఆయన పునరుద్ఘాటించారు. మోడీ బతికుండగా సిఎఎని ఎవ్వరూ రద్దు చేయలేరంటూ సవాళ్లు విసిరారు. దళితులు, ఆదివాసీలకంటే కొన్ని ప్రాంతాల్లో ముస్లింలే వెనుకబడివున్నారంటూ నివేదికలు ఘోషిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేస్తున్నాయి. శషభిషలకు తావులేకుండా బిజెపి వ్యతిరేకిస్తోంది. ఇదే విషయాన్ని మోడీ మరోమారు పునరుద్ఘాటించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు తాము పూర్తి వ్యతిరేకమని ఆయన తేల్చిచెప్పారు. ఇటు ముస్లింలపై అక్కసు వెళ్లగక్కుతూనే మరోవైపు హిందూ ఓటర్ల సమీకరణ కోసం బెంగాల్‌ పర్యటనలోనూ మోడీ రామజపం చేశారు. ‘మత ప్రాతిపదికన ఎవ్వరూ రిజర్వేషన్లు ఇవ్వలేరు. ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి రిజర్వేషన్ల జోలికి ఎవ్వరూ రాలేరు. శ్రీరామనవని జరుపుకోవడాన్ని ఎవ్వరూ ఆపలేరు. రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా రద్దు కాబోదు. సిఎఎ అమలును ఎవ్వరూ ఆపలేరు’ అని మోడీ ప్రసంగం అసాంతం మత ప్రాతిపదికన ప్రజలను చీల్చేలా సాగింది. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా పౌరసత్వానికి మతం రంగు పులిమి తీసుకొచ్చిన సిఎఎను రద్దు చేయాల్సిన అవసరాన్ని ప్రతిపక్షాల ఐక్య వేదికలోని పలు పార్టీలు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. సిఎఎను అమల్జేయబోమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ ఇప్పటికే ప్రకటించారు కూడా. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా బెంగాల్‌లో సిఎఎని అమల్జేయబోమని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని సిఎఎ అమలును ఎవ్వరూ ఆపలేరని ప్రకటించడం గమనార్హం.
నేరస్థులకు తృణమూల్‌ అండదండలు
సందేశ్‌ఖాలిలో మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసిన గూండాలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మమత బెనర్జీ రక్షిస్తున్నారని ఆయన విమర్శించారు. తృణమూల్‌ నేతలపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళలను అధికార పార్టీ బెదిరింపులకు గురి చేస్తోందని, ఫిర్యాదులను వెనక్కి తీసుకునేలా ఒత్తిళ్ల పాల్పడుతోందని ఆయన పేర్కొన్నారు. తృణమూల్‌ పాలనలో బెంగాల్‌లోని హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా మారిపోయారని ఆయన మత ప్రేరేపిత వ్యాఖ్యలు చేశారు. ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ‘యువరాజు’ రాహుల్‌ గాంధీ వయస్సు (53) కంటే తక్కువ సీట్లు వస్తాయని మోడీ జోస్యం చెప్పారు.

➡️