హర్యానా నాటకం!

Mar 15,2024 06:12 #bjp Candidates, #cm, #Haryana

కమ్ముకొస్తున్న ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ఉపశమనం పొందటానికి హర్యానాలో ముఖ్యమంత్రి మార్పు నాటకాన్ని బిజెపి పూర్తి చేసింది. దాదాపు పదేళ్ల పాటు పీఠం మీద ఉన్న మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ని దించి, ఆ స్థానే ఐదు నెలల క్రితం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడైన ఎంపీ నయాబ్‌ సింగ్‌ సైనీని కొత్త ముఖ్యముంత్రిగా కూర్చోబెట్టింది. 90 స్థానాలున్న శాసనసభలో బిజెపి బలం 41కీ, మరో ఏడుగురు స్వతంత్రులు మద్దతు ఇవ్వడంతో సైనీ పట్టాభిషేకం పూర్తయింది. ఖట్టర్‌ని మార్చటానికి మిత్రపక్షమైన జెజెపితో అతడికి పొసగకపోవటమే ప్రధాన కారణమన్నట్టుగా పైకి ప్రచారం జరుగుతున్నా- బిజెపి అసలు వ్యూహం వేరే ఉంది. ఏ రాష్ట్రం బాగోగులైనా ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ అనుసరించే విధానాలపై ఆధారపడి ఉంటాయి. ఆ ప్రభుత్వం ప్రజల అవసరాలనూ, ఆకాంక్షలనూ నెరవేర్చటంతో ముడిపడి ఉంటాయి. ఆ కొలమానాలతో హర్యానా బిజెపి ప్రభుత్వపు పనితీరును కొలిచినప్పుడు – అదెంత నాసిరకంగా ఉందో అవగతమవుతుంది. ఈ తరహా అంచనా కమలనాధులకు కూడా ఉండడం వల్లే ‘మార్పు’ రాజకీయం ముందుకొచ్చింది!
బిజెపి 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హర్యానాలో అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. 2016లో జాట్‌ రిజర్వేషన్ల ఆందోళనలో 30 మంది చనిపోయారు. గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ అరెస్టు తర్వాత అతడి అనుచరుల హింసాత్మక చర్యల్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది రూపాయల ఆస్తినష్టం సంభవించింది. మైనార్టీల మీద నిరంతర దాడులు, దళితులపై దౌర్జన్యాలూ వంటి దుశ్చర్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానస్థితికి చేరాయి. పడక్బందీగా నిర్వహించాల్సిన పరీక్షల విషయంలో కూడా ప్రభుత్వం అప్రతిష్ట పాలైంది! సీబీఎస్‌ఈ సహా వివిధ పరీక్షల ప్రశ్నపత్రాలు 34 సార్లు లీకయ్యాయంటే- విద్యార్థుల భవిష్యత్తు పట్ల ప్రభుత్వ పెద్దల బాధ్యతారాహిత్యం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవొచ్చు! యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించటంలో బిజెపి విఫలమైంది. సైన్యంలో చేరటం ఒక సాంప్రదాయక వరవడిగా ఉన్న ఈ రాష్ట్రంలో అగ్నివీర్‌ పథకం సృష్టించిన అసంతృప్తి ఎక్కువగానే ఉంది. నల్లచట్టాల మీద రైతులు వీరోచితంగా పోరాడుతుంటే అణచివేయటానికి ఖట్టర్‌ ప్రభుత్వం అనేక విధాలుగా తీవ్ర నిర్బంధం ప్రయోగించింది. రెజ్లర్‌ పోరాటం మీదా నిందలూ, నియంత్రణలూ అడ్డూ అదుపూ లేకుండా సాగించింది. వీటన్నింటి కారణంగా బిజెపి ఏలుబడిపై రైతుల్లో, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత గూడుకట్టుకొని ఉంది. ఈ నేపథ్యంలోనే ఖట్టర్‌ని మార్చటం ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించుకోవాలని, ప్రజల దృష్టిని మళ్లించాలని బిజెపి ఎత్తు వేసింది. తమ ప్రభుత్వాలు ప్రజాభిమానాన్ని కోల్పోతున్న దశలో ఈ తరహా ముఖ్యమంత్రి మార్పు మంత్రాంగాన్ని 2021 నుంచి బిజెపి అనుసరిస్తోంది. ఎన్నికలకు కొద్ది కాలం ముందు ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, త్రిపుర, కర్నాటకలలో ఇలాంటి ప్రహసనమే సాగించింది. కర్నాటకలో 2023 ఎన్నికలకు ముందు యడ్యూరప్పను మార్చి బొమ్మరుని ముందుకు తెచ్చింది. అయితే, అప్పటికే తీవ్రంగా అభాసుపాలైన బిజెపికి, శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పలేదు! హర్యానాలో మాత్రం శాసనసభలో 30 స్థానాలు ఉన్న కాంగ్రెస్‌ పార్టీ … బిజెపి వైఫల్యాలను ప్రజలకు వివరించి, వారి ఆమోదం పొందటానికి బదులు అంతర్గత విభేదాలతో సతమతం అవుతోంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో హర్యానాలో 10కి 10 లోక్‌సభ స్థానాలనూ బిజెపి కైవసం చేసుకొంది. ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డి) నుంచి ఒకప్పటి ఉప ప్రధాని దేవీలాల్‌ మనవడు దుష్యంత్‌ చీలిపోయి, జెపిపిని ఏర్పాటు చేయడం కమలనాధులకు కలిసొచ్చింది. వచ్చే ఎన్నికల్లో బిజెపి ఓట్లు తగ్గటం తప్ప పెరిగే పరిస్థితి లేదు. సీట్లు కొన్ని కోల్పోతామేమోనన్న భయం కూడా ఆ పార్టీని వెన్నాడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 27 శాతంగా ఉన్న జాట్ల ఓట్లను, ప్రజల అంతృప్తిని చీల్చటం ద్వారా ప్రతిపక్షానికి మేలు జరక్కుండా చూడటానికి జెపిపిని ‘వ్యూహాత్మకం’గా విడివడేలా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దానిలో నిజానిజాలు ఎలా ఉన్నా- పాలనలో ప్రజాసంక్షేమం, అభివృద్ధి, యువతకు ఉద్యోగ కల్పన వంటివి లేకుండా- కేవలం ముఖ్యమంత్రి మార్పుతో ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు.

➡️