AP Elections 2024 – మొరాయిస్తున్న ఈవిఎంలు – అసహనంతో ఓటర్లు

May 13,2024 08:07 #ap elections, #EVM, #Trouble

అమరావతి : సార్వత్రిక ఎన్నికల వేళ … నేడు ఎపిలో పోలింగ్‌ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద క్యూలు కట్టారు. అయితే పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఎన్నికల సంఘం అధికారులు అప్రమత్తమై వెంటనే వాటిలోని సమస్యను పరిష్కరించేందుకు టెక్నిషన్స్‌ ను రంగంలోకి దించారు.

ప్రకాశం జిల్లాలోని కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 138, 140వ పోలింగ్‌ బూత్‌ లలో ఈవిఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్‌ నిలిచిపోయింది. దీంతో పాటు చీమకుర్తి 23వ పోలింగ్‌ కేంద్రంలో లోక్‌ సభ ఈవిఎం పనిచేయకపోవడంతో పోలింగ్‌ ప్రక్రియ ఆగింది. నెల్లూరు జిల్లాలోని కందుకూరు మండలం కంచరగుంటలో 160 పోలింగ్‌ బూత్‌ లోను ఈవిఎం మోరాయించింది. వరదయ్యపాలెం మండల కేంద్రంలో బూత్‌ నెంబర్‌ 64, బూత్‌ నెంబర్‌ 65, జడ్పీ హైస్కూల్లోని 89వ పోలింగ్‌ కేంద్రంలో కూడా ఈవిఎంలో సాంకేతిక లోపంతో ఇప్పటివరకు పోలిగ్‌ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈవిఎంలను ఎన్నికల అధికారులు సరి చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి పట్టణంలోని 102 పోలింగ్‌ కేంద్రంలో లోక్‌ సభ స్థానానికి సంబంధించిన ఈవిఎం పని చేయడం లేదు. ఇక, గన్నవరం, పెనమలూరు, జగ్గయ్యపేటలో ఈవీఎంలలో సమస్యలు తలెత్తాయి. ఈవిఎంలలో ఇబ్బందితో గన్నవరం, పెనమలూరులో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్దులు యార్లగడ్డ వెంకట్రావ్‌, బోడే ప్రసాద్‌ లు ఓటు వేయటానికి వచ్చి నిరీక్షిస్తున్నారు. జగ్గయ్యపేటలోనూ ఈవీఎంలలో సాంకేతిక లోపంతో ఇప్పటి వరకు పోలింగ్‌ ప్రారంభంకాలేదు. దీంతో పాటు నగరి నియోజక వర్గంలోని సీతారామపుర బూత్‌ లో ఈవీఎం మొరాయించింది. రంగంలోకి దిగిన ఎన్నికల కమిషన్‌ అధికారులు సరి చేస్తున్నారు. అయితే, అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని 112 బూత్‌ లో ఈవీఎం మొరాంచడంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు. తాడిపత్రి పట్టణంలోని 251 పోలింగ్‌ కేంద్రంలో ఎంపీకి సంబంధించిన ఈవిఎం సైతం పని చేయడం లేదు. యల్లనూరు మండలం వెన్నపూస పల్లి గ్రామంలోనూ ఈవిఎంలు మొరాయిస్తున్నాయి. నంద్యాల జిల్లాలోని అవుకు మండలం రామవరంలో ఈవిఎం మొరాయించింది. ఉదయాన్నే ఓటు వేసేందుకు వచ్చినప్పటికీ ఈవిఎంలు సరిగ్గా పనిచేయకపోవడంతో క్యూలో నిలుచున్న ఓటర్లు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

➡️