సంక్షోభంలో కూరుకుపోతున్న భారతీయ వైద్యరంగం

Dec 28,2023 06:59 #Articles, #COVID-19, #crisis, #Health Sector
indian medical sector in crisis

మనదేశంలో మూడు, నాలుగు దశాబ్దాల క్రితం, వైద్య రంగంలో సంక్షోభం అంటే… తగిన సంఖ్యలో వైద్యులు – అనుబంధ సిబ్బంది లేకపోవడం మూలాన రకరకాల జబ్బులు విజంభించడం… మౌలిక వసతులు లేక వైద్యరంగం పూర్తిస్థాయిలో పనిచేయలేక పోవడంగానే అందరికీ తెలుసు. అయితే ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు గాను కావలసిన హాస్పిటల్‌ పడకల సంఖ్యను తగ్గించడంతో పాటు, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన నిబంధనలు సడలించడంతో ఇబ్బడిముబ్బడిగా ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీలు పుట్టుకొని వచ్చాయి. ఇంకా కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చెయ్యాలి అనే విధానపరమైన నిర్ణయంతో మరిన్ని మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఎంబీబీఎస్‌ సీట్లతో పాటు, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, సూపర్‌ స్పెషాలిటీ మెడికల్‌ సీట్లు కూడా చాలా ఎక్కువగా పెరిగాయి. 2021 నవంబర్‌ నాటికి మనదేశంలో 13 లక్షల మంది డాక్టర్లు భారత మెడికల్‌ కౌన్సిల్‌ తో రిజిస్టర్‌ అయి ఉన్నారు. ప్రస్తుతం మనదేశంలో పదివేల మంది ప్రజలకు 13 మంది వైద్యులు (వెయ్యికి 1.3 డాక్టర్స్‌ ) అందుబాటులోకి వచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించే వెయ్యి జనాభాకు ఒక డాక్టరు కంటే ఇప్పటికే ఇక్కడ ఎక్కువగా డాక్టర్లు ఉన్నారు. 2009 సంవత్సరంలో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఎంబిబిఎస్‌ సీట్ల సంఖ్య 35,000 కాగా, 2023 నాటికి అది 1 లక్షా 8,500 సీట్లకు చేరుకొంది. వీటిలో దాదాపు సగం ప్రైవేటు కాలేజీలవి. సగం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలవి. అనగా 13,000 మంది ప్రజలకు ఒక ఎంబీబీఎస్‌ సీటు చొప్పున అందుబాటులోకి వచ్చింది. ఇంత పెద్ద సంఖ్యలో వైద్యులు ఉన్నప్పటికీ, మన దేశంలోనే అత్యధికంగా ఉండే అనేక సాంక్రమిక వ్యాధుల విషయంతో సహా ఏ జబ్బుకీ… ప్రపంచం అంతా అనుసరించగల ఏ వైద్య చికిత్స మార్గదర్శకాలనూ… మన వైద్యులు రూపొందించకపోవడం అవమానకరమైన విషయం. దీనితోనే మన వైద్యుల, చదువుల నాసితనాన్ని తెలుసుకోవచ్చు.

2025 – 26 నుండి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్‌ సీట్లు చొప్పున అందుబాటులోకి తేవాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ నిర్ణయించింది. అంటే పదివేల మంది ప్రజలకు ఒక ఎంబీబీఎస్‌ సీటు… రెండవ బ్యాచ్‌ బయటికి వచ్చే సరికల్లా 5000 మంది జనానికి ఒక ఎంబిబిఎస్‌ సీట్‌ అవుతుంది… మరో బ్యాచ్‌ బయటకు వస్తే 2500 మందికి ఒక వైద్యుడు అవుతాడు. అలా రాను రాను తక్కువ మంది ప్రజలకి ఎక్కువ మంది డాక్టర్లు కానున్నారు. వీరంతా ఇప్పటికే ఉన్న డాక్టర్లకు అదనం. రానున్న సంవత్సరాలలో డాక్టర్లకు తగినంత మంది పేషెంట్లు వచ్చే అవకాశాలు తక్కువ. గతంలో మన రాష్ట్రంలో ఇదేవిధంగా ఇబ్బడి ముబ్బడిగా వచ్చిన బిఈడి కాలేజీలు, లా కాలేజీలు, ఇంజినీరింగ్‌, బిజినెస్‌ మేనేజ్మెంట్‌ కాలేజీలతో అనేకమంది ఆయా పట్టాలను పొందారు. అయితే వారిలో అనేకమంది నిర్దేశితమైన వత్తిలో కాకుండా… నిరుద్యోగులు గానూ, గుమస్తాలు – సూపర్వైజర్లు వంటి చిరు ఉద్యోగులుగానూ ఉండిపోవడం మనందరికీ తెలిసిందే. నిజానికి, సమాజం యొక్క అవసరాలకి మించిన సంఖ్యలో వత్తిదారులను – నిపుణులను తయారు చేసుకోవడం అనేది ప్రభుత్వ / సమాజ వనరులను దుర్వినియోగపరచటమే, వధా చేయడమే.

తక్కువ వైద్యశాల పడకలు – పేషెంట్లు మాత్రమే ఎక్కువ మంది విద్యార్థులు వైద్య విద్యను నేర్చుకోవడానికి లభ్యం కావడం ఇబ్బందికరమైన పరిణామం. అందుమూలంగానే, మన వైద్య విద్యార్థులలో ప్రమాణాలు రాను రాను తీసికట్టుగా ఉంటున్నాయి. పరీక్షలలో మంచి మార్కులు పొంది వైద్యులైన వారు కూడా, తమ విద్యార్థి కాలంలో చూడని జబ్బు ఎదురైనప్పుడు దానిని గుర్తించే పరిస్థితి అరుదు. తక్కువ మంది ఎంబిబిఎస్‌ స్టూడెంట్స్‌ కి ఎక్కువ మంది పేషెంట్లను తమ విద్యార్థి దశలోనే పరీక్షించే అవకాశం ఉండి తీరాలి. అప్పుడు మాత్రమే తమ ప్రాంతంలోనూ, దేశంలోనూ తలెత్తే అనేక రకాల జబ్బులను చూసే అవకాశం ఉంటుంది. తదుపరి వత్తిలో రాణించి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించగల అవకాశాలు ఉంటాయి.

వైద్య వత్తి అనేది ప్రధానంగా పేషెంట్లను చూసి, పరీక్షించి తెలుసుకొనేది, పుస్తకాలలో చదివి నేర్చుకొనేది కాదు. పేషెంట్‌ యొక్క లక్షణాలను తెలుసుకొని, చిహ్నాలను గుర్తించి, తప్పనిసరి అయిన కొన్ని రక్త – ఇతర పరీక్షలను చేసి వ్యాధి నిర్ధారణ చేసే ‘క్లినికల్‌ డయాగ్నోసిస్‌’ అనేది ఇప్పటి తరం డాక్టర్లకు దాదాపుగా తెలియదు. కేవలం పైపైన ప్రశ్నలతో, అరకొర శరీర పరీక్షతో తమ పని ముగిసింది అనుకుంటున్నారు. లెక్కకు మిక్కిలిగా పరీక్షలను సూచించి, పేషంటు పైన మోయలేని ఆర్థిక బరువుని మోపుతున్నారు. వైద్యరంగంతో సమాంతరంగానో, అంతకంటే ఎక్కువగానో వ్యాధి నిర్ధారణ (డయాగ్నొస్టిక్‌) రంగం పెద్ద పరిశ్రమగా వర్ధిల్లుతున్నది.

తక్కువ మంది పేషెంట్ల నుండే తమకు సరిపడా ఆదాయం సంపాదించడం కోసం, కొన్ని పెద్ద హాస్పిటల్స్‌ పెడధోరణులను అవలంబిస్తున్నాయని ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కొన్ని అధ్యయనాలలో వెల్లడైన అంశాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ‘బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌ గ్లోబల్‌ హెల్త్‌’ లో 2020 లో ప్రచురితమైన అధ్యయనం మేరకు… 55% మేరకు గుండె ఆపరేషన్లు, వందకు 48 గర్భసంచి ఆపరేషన్లు, 47 శాతం క్యాన్సర్‌ కు సంబంధించిన ఆపరేషన్లు, 48 శాతం మోకాలి చిప్ప మార్పిడి, నూటికి నలభై ఐదు సిజేరియన్‌ ఆపరేషన్లు అవసరం / సూచనలు లేకుండానే చేస్తున్నారని వెల్లడైనది. ఇక అనవసరంగా చేసే ఖరీదైన పరీక్షలు ఏ మేరకు వుంటాయో ఊహించుకొంటేనే భీతి కలుగుగుతుంది. మహారాష్ట్రలో నిర్వహించిన ఈ అధ్యయనంలో తేలిన అంశాలు దేశంలోని దాదాపు అన్ని పెద్ద హాస్పిటల్స్‌ కీ వర్తిస్తాయి. ఈ పరిణామాలు వైద్య వత్తి పట్ల దారుణమైన అభిప్రాయాలను కలుగచేస్తున్నాయి. వైద్య సేవల కార్పొరేటీకరణ అనేది ఈ పరిణామాలకు మూలంగా చెప్పుకున్నప్పటికీ, వీలైనంత పెద్ద స్థాయిలో ఆధునిక వైద్య పరికరాలు తెచ్చుకొని, ఎక్కువ బ్యాంకు లోనులతో, మరింత ఎక్కువ ఆర్ధిక భారంతో… పేషంట్స్‌ నుండి ఎక్కువ ఆదాయాన్ని ఆశించే చాలా హాస్పిటల్స్‌ లో కూడా ఇవే పరిణామాలు వుండే అవకాశాలు వున్నాయి.

రానున్న కాలంలో పెద్ద సంఖ్యలో వచ్చే వైద్యులకు తగిన సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవు. కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ లో ఉద్యోగాలు అంతకంటే ఉండవు. ఇప్పటికే ఎంబీబీఎస్‌ గ్రాడ్యుయేట్లు కొన్ని హాస్పిటల్స్‌ లో డ్యూటీ డాక్టర్లుగా 20 – 30 వేల రూపాయల కనీస జీతానికి పనిచేస్తున్నారు.

ధనిక దేశాలలో వైద్య రంగంలో వచ్చిన సాంకేతికతను మన దగ్గర అందుబాటులోకి తీసుకుని వచ్చి… మన పేషంట్లపై రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. నిజానికి ఆయా ధనిక దేశాల ఆదాయాలకు, వారికుండే ఆరోగ్య వ్యవస్థలకు కూడా ఈ అత్యాధునిక పరికరాలు, పరీక్షలు, వైద్యమూ ఆర్థికంగా భారమైనవి. అటువంటిది, వద్ధిలో ఉన్న భారతదేశం వంటి చోట్ల ఈ ఆధునిక సాంకేతికత వల్ల ఖర్చు మరింతగా మోయలేని భారం అవుతున్నది. అయితే ఆరోగ్యం, మానవ ప్రాణం అనేవి భావోద్వేగాలతో ముడిపడి వున్న అంశాలు కావడంతో నిషఉ్టరంగానో – కష్టంగానో ప్రజలు భరిస్తున్నారు. అనేక సందర్భాలలో, ప్రభుత్వ సహకారం లేని వ్యవస్థలలో పెద్ద అనారోగ్య సమస్య బారిన పడిన వారి కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితులలో, వైద్యులు తమ వత్తి నైపుణ్యాలను పెంచుకొని, ప్రజల ఆదాయాలకు తగ్గట్టుగా వారి వైద్య ఆరోగ్య ఖర్చులు ఉండేటట్టుగా కృషి చేయాలి.

కోవిడ్‌ సమయంలో వైద్యరంగంపై ప్రజల్లో దారుణమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఆ సంక్షోభాన్ని డబ్బుగా మార్చుకునే ప్రయత్నాలు చేశారని బాధ్యతగల పౌరులు డాక్టర్లను విమర్శించారు. కోవిడ్‌ ముగిసిన తర్వాత కూడా ఆనాటి స్థాయిలోనే ఆదాయాలను డాక్టర్స్‌ ఆశిస్తున్నారని చాలామంది సామాన్యులు నమ్ముతున్నారు. ఎంత చిన్న సమస్యతో డాక్టర్ని కలిసినా కొన్ని వేల రూపాయలు కేవలం పరీక్షల పేరిట ఖర్చు అవుతుంది అనే అపవాదును వైద్యులు పోగొట్టుకోవాలి. ప్రతి వైద్య విద్యార్థి తప్పనిసరిగా తమ యొక్క విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. జబ్బులను లోతుగా అధ్యయనం చేయాలి. వీలైనంత తక్కువ, తప్పనిసరైన పరీక్షలతో క్లినికల్‌ డయాగ్నోసిస్‌ చేసే నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడు మాత్రమే డాక్టర్లను తమకు మేలు చేసేవారిగా ప్రజలు భావిస్తారు. లేకపోతే డాక్టర్లు, హాస్పిటల్స్‌ సమాజానికి గుదిబండలు అని ప్రజలు నిశ్చయించు కొంటారు.

ఇటీవల వైద్య విద్యలో, గతంలో ఉన్న 50 శాతం మార్కుల స్థానంలో 40% మార్కులకే ఉత్తీర్ణులను చేసే మార్పు తీసుకు రాబోయారు. తర్జనభర్జనల తర్వాత ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. ఇతర దేశాలలో మెడిసిన్‌ డిగ్రీ చేసిన వారికి, ఇక్కడ ఎంబిబిఎస్‌ చేసిన వారికన్నా ఒక సంవత్సర కాలం అదనంగా ఇంటర్న్‌ షిప్‌ చేయిస్తున్నారు. దానివల్ల మన దేశంలో వుండే వ్యాధులను ఎక్కువగా చూడగల అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ప్రస్తుతం ఉన్న 300 కంటే ఎక్కువ పడకలు… కనీసం 1000 పడకలు గల హాస్పిటల్‌ ఉండాలని నియమం చేయాలి. మన ప్రజల అనారోగ్యాలు, ఆర్థిక స్థితుల మేరకు ప్రతి వైద్యుడు క్లినికల్‌ డయాగ్నోసిస్‌ లో తగిన మెళుకువలు నేర్చుకోవాలి. వీలైనంత తక్కువ పరీక్షలను ఉపయోగించి వైద్యం చేసే పరిస్థితి రావాలి. అప్పుడు మాత్రమే భారతీయ వైద్యరంగం సంక్షోభం నుండి బయటపడుతుంది.

indian medical sector in crisis article yanamandala muralikrishna

  • వ్యాసకర్త : డా|| యనమదల మురళీకష్ణ, ఎండి, సాంక్రమిక వ్యాధుల నిపుణులు, కాకినాడ (peopleagainstaids@yahoo.co.in )
➡️