రైతున్నాడా..?!

Apr 20,2024 05:01

కరిగిపోతున్న కాలం వెంట
పరుగులు పెడుతున్నాడు
గిట్టుబాటు లేని గింజల మధ్య
బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు
చేయూత లేక విధి వెక్కిరిస్తే
సాగిలపడి మొక్కుతున్నాడు
అసలు రైతున్నాడా..!!
వెలసిపోయిన ఆకాశం వైపు
మసకబారిన బ్రతుకు వైపు
కళ్ళు తేలేస్తూ చూస్తున్నాడు
పుచ్చిపోయిన కంకి మొదళ్ళు నుంచి
రాలిపడుతున్న పిందెలా
ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు
చినుకు రాని చింత తలపైనెత్తుకుని
కునుకు లేని రాత్రుల్ని గడుపుతున్నాడు
పచ్చగుండాల్సిన సెలకల్లో
గులక రాళ్ళు శబ్దం చేస్తుంటే
చెవులు మూసిపట్టి కూర్చున్నాడు
ఇంతకూ రైతున్నాడా..!!
విరిగిన నాగళ్ళు చెంత కూర్చుని
మొద్దుబారిన కొడవళ్ళతో
ఎండమావుల్ని నరుకుతున్నాడు
ఆపన్నహస్తం మడుచుకున్నాక
హస్తవాసి కొండెక్కిన దీపమైనాక
ఏ దారీ లేని ఒంటరి గమ్యంలో
ఒక్కడే తరలిపోతున్నాడు
ఇంతకూ రైతున్నాడా..!!
రైతుంటే ఆచూకీ తెలపండని
నేలకొరిగిన కంకి
పదే పదే అడుగుతోంది
చెదిరిపోయిన ధాన్యరాశి
అన్ని దిక్కులా వెతుకుతోంది
పంట మొహం ఎరుగని భూమి
కన్నీటి పర్యంతమైంది
ఇంతకూ రైతున్నాడా..!!
– నరెద్దుల రాజారెడ్డి,
సెల్‌ : 9666016636

➡️