విలువైనది జీవితం

Apr 28,2024 05:30 #editpage

ప్రతి మనిషి జీవితంలో చాలా చేయాలనుకుంటాడు. చివరకు ఏవో కొన్ని మాత్రమే చేయగలుగుతాడు. అది కూడా సంపూర్ణంగా చేయలేకపోవచ్చును కూడా. అందరూ అష్టావధానం చేయలేరు. అలాగని చేయలేనంత మాత్రాన వారు అసమర్ధులు కారు. పట్టుదల, కృషి వుంటే సామాన్యులు కూడా అద్భుతాలు చేయగలుగుతారు. గొప్పగొప్ప శాస్త్రవేత్తలుగా ప్రపంచ ఖ్యాతి పొందినవారిలో కొందరు బాల్యంలో చదువులో అంతగా రాణించనివారే. ‘మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ/ పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ’ అంటాడో సినీకవి. ఐన్‌స్టీన్‌కు మొదట్లో మాట్లాడటం కష్టంగా వుండేది. చదువులోనూ అంతగా రాణించలేకపోయేవాడు. తన 16 ఏళ్ల వయసులో స్విస్‌ ఫెడరల్‌ పాలిటెక్నిక్‌ స్కూల్లో జరిగిన ప్రవేశ పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యాడు. ఆ తర్వాత అదే ఐన్‌స్టీన్‌ భౌతికశాస్త్రంలో చేసిన కృషికి గాను నోబెల్‌ బహుమతి అందుకున్నాడు. యాపిల్‌ కంప్యూటర్‌ సృష్టికర్త స్టీవ్‌జాబ్స్‌ కూడా కళాశాలలో అట్టడుగు విద్యార్థే. అంతెందుకు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ దేవుడు అంటూ నీరాజనాలు అందుకున్న సచిన్‌ టెండుల్కర్‌ చదివింది కేవలం 12వ తరగతి వరకే. తనకు ఇష్టమైన క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుని అందులో ఎదిగాడు. ‘చదువు ప్రతిభను రాణింపజేసే ఒక సాధనమే కానీ, దానికి కారణమూకాదు, ఫలితమున్నూకాదు’ అంటారు శ్రీపాద. చదువు ఆ వ్యక్తిలోని సృజనాత్మకతను, నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా వుండాలి.
మన దేశంలో చాలామంది తమ పిల్లలు ఇంజనీరింగ్‌ లేదా మెడికల్‌ కోర్సులో సీటు సంపాదించడం ప్రతిష్టగా భావిస్తారు. ఎలాగైనాసరే… ర్యాంకులు కొట్టాలన్న పోటీ వాతావరణంలో నవతరం ఒత్తిడికి లోనవుతోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, శిక్షణా సంస్థల ఒత్తిళ్లు, ఆశల భారాన్ని తట్టుకోలేని విద్యాకుసుమాలు అర్థాంతరంగా నేలరాలుతున్నాయి. గత పదేళ్లుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. దేశంలో ప్రతి 42 నిమిషాలకు ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీనికి ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌లే కారణం. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆరుగురు విద్యార్థులు ఇంటర్మీడియెట్‌ ఫెయిల్‌ కావడంతో మనస్తాపం చెంది బలవంతాన ప్రాణాలు తీసుకున్నారు. ధనార్జనే లక్ష్యంగా గల కార్పొరేట్‌ విద్యాసంస్థలు సృష్టించే కృత్రిమ పోటీ- ర్యాంకుల వెంట పరుగు తీయించడం వంటివి అనర్థదాయకం. ఇలాంటి ధోరణులను ప్రభుత్వాలు అనుమతించరాదు. కాని పాలకులకు అటువంటి చిత్తశుద్ధి కరువవుతోంది.
భారతదేశం యువ విజ్ఞాన నిధి. అత్యధిక యువ సంపద కలిగిన దేశం మనది. ‘2040 నాటికి మన దేశ జనాభాలో 59శాతం మంది యువతే వుంటారని’ ఇండియా ఎంప్లాయిమెంట్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. 2012 నుండి, భారతదేశంలో ప్రతి సంవత్సరం విద్యార్థుల ఆత్మహత్యల కేసులు 2.3శాతం పెరుగుతున్నాయి, మనం ఎవరిని నిందించాలి? తల్లిదండ్రులనా? ప్రభుత్వాలనా? గ్లోబలైజేషన్‌ ఊబిలో కూరుకుపోయిన విద్యావ్యవస్థలోని కార్పొరేట్‌ పోటీనా? గొంతులు కోసుకునే అసలు దోషి ప్రభుత్వం అదుపులేని కార్పొరేట్‌ విద్యావ్యవస్థేనన్నది నిస్సందేహం. తప్పు ఎవరిదైనా బలిపోతున్నది మాత్రం యువశక్తి. ఈ యువశక్తిని కాపాడుకొని, దేశాభివృద్ధిలో పాలుపంచుకునేలా చేసే బాధ్యత ప్రభుత్వాలది. మార్కులు, ర్యాంకులే సర్వస్వం కాదు. అంతకంటే విలువైనది జీవితం. చదువు విజ్ఞానాన్ని పెంచుకోవడానికి మానసిక వికాసాన్ని పెంపొందించుకోడానికి దోహదపడాలి. ‘విద్యార్థులలో నేర్చుకోవాలన్న ధ్యాస రేకెత్తించకుండా ఉపాధ్యాయుడు బోధించడానికి ప్రయత్నించడం… చల్లని ఇనుముపై సమ్మెట వేయటం వంటిది’ అంటారు హౌరెస్‌మాన్‌. ఇతరులు సాధించిన విజయాన్ని చూసి అసూయ చెందడం, న్యూనతా భావానికి గురవడం కాక, ఆ విజయం నుంచి స్ఫూర్తి పొందేలా పిల్లలను తీర్చిదిద్దాలి. ఆత్మవిశ్వాసమనే ఆయుధాన్ని అందించాలి. చదువులో వెనకపడ్డామని ఏ విద్యార్థీ చింతించాల్సిన పనిలేదు. వారు చేసే కృషిలో వెనకపడకుండా వుంటే చాలు. విజయాలు వాటంతటవే స్వాగతిస్తాయి.

➡️