‘పీపుల్స్‌ విజన్‌’ కావాలి

ఎన్నికల ముంగిట ‘విజన్‌ విశాఖ’ పేర రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌ రెడ్డి 28 పేజీల డాక్యుమెంట్‌ను విశాఖలో ఆవిష్కరించారు. ఈ విజన్‌ ద్వారా రాబోయే పదేళ్ళలో హైదరాబాద్‌, బెంగుళూరు, చెన్నైలకు ధీటుగా విశాఖ ఎదుగుతుందని, రాష్ట్రానికే విశాఖ గ్రోత్‌ ఇంజన్‌గా మారుతుందని ప్రకటించారు. రాష్ట్రం ఆర్థికంగా సమగ్రాభివృద్ధి జరగాలంటే విశాఖ పరిపాలనా రాజధాని కావాల్సిన అవసరం ఎంతో ఉందని, ఈ ఎన్నికల్లో గెలిచి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు.

విజన్‌ డాక్యుమెంట్లు రాష్ట్రానికి, విశాఖకు కొత్తేమీ కాదు. గతంలో చంద్రబాబు నాయుడు విజన్‌ 2020, సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ల పేర విజన్‌ డాక్యుమెంట్లు విడుదల చేశారు. ఇవి ప్రపంచబ్యాంకు అభివృద్ధి నమూనా డాక్యుమెంట్లు. పెట్టుబడిదారుల పరిశ్రమలు, పెట్టుబడులు వ్యాపార, వాణిజ్యాలు అభివృద్ధి కోసం చేపట్టినవి. ఇవేవీ గడిచిన రెండు దశాబ్దాల్లో రాష్ట్ర ప్రజల భవిష్యత్తును మార్చలేకపోయాయి.

విజన్‌ విశాఖ పత్రంలో అభివృద్ధిని పరిశీలిస్తే ఎంత గొప్పగా విశాఖ అభివృద్ధి అవుతుందో తెలుసుకోవచ్చు. ఎవరికి ఉపయోగపడే అభివృద్ధో కూడా సులభంగా అర్థంచేసుకోవచ్చు. మొత్తం ఐదేళ్ళ ప్రణాళిక. ముందుగా విశాఖ నగర అభివృద్ధి సూచిక గురించి కొన్ని విచిత్రమైన విషయాలు పేర్కొన్నారు. జనాభా 23 లక్షలని, 689 చ|| కిలో మీటర్ల వైశాల్యంతో 44 బిలియన్‌ డాలర్ల విలువ గల స్థూల ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు. అలాగే 2023 స్వచ్ఛ సర్వేక్షణలో 4వ ర్యాంకు, 2020 స్మార్ట్‌ సిటీ ఎక్స్‌పోలో 3వ ర్యాంకు, 2024 పేజల్‌ సర్వేక్షణ్‌లో మొదటి ర్యాంకు, అచ్యుతాపురంలో అరుదైన భూ ఖనిజాలు ఉన్నాయని, దేశంలోనే మొదటి నేవల్‌ బేస్‌ను విశాఖలో ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. విశాఖపట్నం గురించి విజన్‌ విశాఖ పత్రం అవగాహన ఎలా ఉందో దీనిని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు.

వచ్చే ఐదేళ్ళలో రూ.లక్ష కోట్ల పెట్టుబడి గల ప్రాజెక్టులు వస్తాయని పత్రంలో తెలిపారు. దీనిలో జాతీయ రహదారి, విమాన, సముద్ర తీర ప్రాంత కనెక్టివిటీ అభివృద్ధికి 61 శాతం పెట్టుబడులు కల్పించబడతాయి. బీచ్‌ కారిడార్‌కు రూ. 6287 కోట్లు, విశాఖ మెట్రో రైలు రూ.14309 కోట్లు, భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూ.4724 కోట్లు పెట్టుబడులు రానున్నాయని పేర్కొన్నారు. ఇందులో భోగాపురం ఎయిర్‌పోర్టు గత పదేళ్ళ బిజెపి, టిడిపి, వైసిపి పాలకుల లాబీ అనంతరం జిఎంఆర్‌ సంస్థకి ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో తెలుగుదేశం నాయకులు, ఇప్పుడు వైసిపి నాయకులు ఎయిర్‌పోర్టు పేరుతో వేలకోట్లు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నడిపారు. రైతుల భూములను గుంజుకున్నారు.

విశాఖ మెట్రో రైలు విభజన చట్టం హామీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్మించి ఉండాలి. కాని దీనిని అమలు చేయకుండా బిజెపి ఎగనామం పెట్టింది. వైసిపి, తెలుగుదేశం పార్టీలు నరేంద్ర మోడీ ప్రభుత్వంపై పొరాడి ప్రాజెక్టును సాధించుకోవాల్సింది పోయి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం గాలికొదిలేశారు. ఇప్పుడు జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ-ప్రైవేట్‌- భాగస్వామ్యంలో నిర్మిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. విశాఖ బీచ్‌ కారిడార్‌ ఎన్నో ఏళ్ళుగా ఎన్నికల మాటలుగానే మిగిలిపోయింది. దీనివల్ల భోగాపురం ఎయిర్‌ పోర్టుకి విశాఖ నుండి గంటసేపులో చేరుకోవచ్చని ప్రకటనలు గుప్పిస్త్తున్నారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 20శాతం చొప్పున, మిగిలింది అప్పు ద్వారా సమకూర్చుకొని టోల్‌ గేట్‌ ద్వారా కారిడార్‌ను లాభసాటిగా మార్చొచ్చని ప్రతిపాదిస్తున్నారు.

ఫార్మా, పెట్రో, కెమికెల్‌ (30 పరిశ్రమలు), మధ్యతరహా పరిశ్రమల నుండి రూ.33 వేల కోట్లు పెట్టుబడులు వస్తాయని హైలెట్‌ చేశారు. ప్రధాని ఇటీవల ప్రకటించిన ఎన్‌టిపిసి హైడ్రోజన్‌ పార్క్‌తో రూ.20,225 కోట్లు వస్తాయని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను మినహాయిస్తే ప్రైవేట్‌ పెట్టుబడుల బండారం తెలిసిందే. గత దశాబ్దంలో నాలుగు అంతర్జాతీయ పెట్టుబడుల సమ్మిట్‌లు విశాఖ లోనే నిర్వహించారు. ప్రపంచ, దేశ కార్పొరేట్‌ దిగ్గజాలను తీసుకొచ్చారు. ఏం జరిగింది? ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి? చంద్రబాబు పరిపాలనా కాలంలోనే దాదాపు రూ.30 లక్షల కోట్ల విలువగల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. గతేడాది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులతో 340 ఒప్పందాలు చేసింది. ఇవన్నీ ఏమయ్యాయి? ఎందుకు కార్యరూపం దాల్చలేదు? ఇప్పుడు విజన్‌ పత్రం కూడా ఈ మూలకే చేరుతుంది.

విశాఖలో చేపట్టబోయే మౌలిక సదుపాయాల గురించి కూడా విజన్‌లో పేర్కొన్నారు. ముఖ్యంగా విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జివిఎంసి) చాలా ఏళ్ళ నుండి నిధులు లేక సతమతమౌతున్న సమస్యల గురించి చెప్పారు. వాటిల్లో ముఖ్యమైనవి విలీన ప్రాంతాలైన భీమిలి, మధురవాడ, పెందుర్తి, గాజువాక, అనకాపల్లి ప్రాంతాల్లో మంచినీటి సరఫరా, భూ గర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, రోడ్లు, కాలువల నిర్మాణానికి జివిఎంసి రూ. 4500 కోట్లు ఖర్చు చేస్తుందని చూపారు. ఇప్పటికే జివిఎంసి రూ.400 కోట్లు అప్పులు పాలైయ్యింది. నిధులు లేక భూగర్భ డ్రైనేజి పనులు గత రెండేళ్ళ నుండి అర్థంతరంగా నిలిపివేసింది. అప్పుల కోసం ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, భూములు తాకట్టు పెట్టింది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం గత 5 ఏళ్ళల్లో ఒక రూపాయి కూడా జివిఎంసికి నిధులు ఇవ్వలేదు. పైపెచ్చు రాష్ట్రం ప్రభుత్వం ఆదేశించిన వందల కోట్ల పనులకు నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేయించింది. పైపెచ్చు సిఎఫ్‌ఎంఎస్‌ పేర జివిఎంసి నిధులను తన ఖజానాకు తరలించుకుపోతూ తన అవసరాలు తీర్చుకుంటున్నది. జివిఎంసి అభివృద్ధిని దెబ్బ తీస్తున్నది. ఇప్పుడు మౌలిక సదుపాయాల కోసం జివిఎంసి ఆస్తులు తాకట్టు పెట్టటం, పౌర సదుపాయలు ప్రైవేట్‌ సంస్థల పరం చేసే చర్యలకు ఈ విజన్‌ ద్వారా ఒడిగడతారనడంలో ఎలాంటి సందేహం లేదు.

బీచ్‌ పొడవునా స్టార్‌ హోటళ్లు, రిసార్టులు, కాటేజ్‌లు, ఫుడ్‌కోర్టులు, పార్క్‌లు, కన్వెన్షన్‌ సెంటర్లు, ఇండోర్‌ స్టేడియమ్‌లు… ఇలా సుమారు రూ.3500 కోట్ల పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే జివిఎంసి, విఎంఆర్‌డి ఆధీనంలో ఉన్న పార్కులు, స్టేడియంలు, క్రీడా మైదానాలు, ఇండోర్‌ స్టేడియంలు, ఖాళీ భూములన్నీ ఆధునీకరణ, భూముల అభివృద్ధి పేర పిపిపి కింద ప్రైవేట్‌ సంస్థలకు ధారాదత్తం చేసే వ్యూహం విజన్‌లో ఉంది. దీంతో ఇవన్నీ పూర్తిగా వ్యాపార, వాణిజ్య కేంద్రాలుగా మారిపోతాయి. ఇప్పటికే రూ.2 వేల కోట్ల విలువల గల విశాఖ పోర్టు క్వార్టర్స్‌ స్థలాలు, స్టేడియంను ఇనార్బిటిక్‌ సంస్థ షాపింగ్‌ మాల్స్‌కు పిపిపి పేర బదిలీ చేశారు. ఇటీవల జివిఎంసి 250 ఎకరాల భూములను వైసిపి బడా నాయకుడి వ్యాపార వాణిజ్యాల కోసం సమర్పించడానికి తీర్మానం చేశారు. 50 ఎకరాల్లో ఉన్నా ముడిసరిలోవ పార్కుని సైతం కట్టబెట్టబోతున్నారు. ఇక 40 కిలో మీటర్ల పొడవు బీచ్‌ తీరప్రాంతం మొత్తం బడా కార్పొరేట్లు, రాష్ట్రంలోని రాజకీయ పెట్టుబడిదారుల హస్తగతం అయ్యేలా విజన్‌ రూపొందించారు. ఇప్పటికే ఒబెరారు వంటి అనేక సంస్థలకు హోటళ్లు, రిసార్టుల కోసం వందల ఎకరాలు కేటాయించారు. కొండలు కొండలనే వీరికి సమర్పించారు. ఆఖరికి ముఖ్యమంత్రి విజన్‌ విశాఖ పత్రం విడుదల చేసిన బ్లూ రాడిసన్‌ హోటల్‌ 11 ఎకరాల భూమి ప్రభుత్వానిది. 50 ఏళ్ళ లీజు పేర మొదట తెలుగుదేశం నాయకులు ఇప్పుడు వైసిపి ప్రధాన నాయకుడి ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఇలాంటివి ఎన్నో ఇప్పటికే పాలక పార్టీలు దోచుకున్నాయి.

విశాఖ అభివృద్ధికి ప్రభుత్వ రంగ సంస్థలే పునాది. సామాజిక మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెట్టుబడులే కీలకం. పారిశ్రామిక, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, సేవా, గృహ…ఇలా అన్ని రంగాల్లో ఈ దృక్పధం విశాఖలో కనిపిస్తుంది. ఇవన్నీ నేడు కేంద్ర బిజెపి ప్రైవేటీకరణ దాడిని, తీవ్ర వివక్షతను ఎదుర్కొంటున్నాయి. ఈ వాస్తవికతను కుట్రపూరితంగా ముఖ్యమంత్రి విస్మరించారు. ఎప్పటిలాగే ప్రైవేట్‌ పెట్టుబడుల జపం చేశారు. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ రాజధాని చుట్టూ తిప్పారు. విశాఖ ఎగ్జిక్యూటివ్‌ రాజధాని అయితే, ముఖ్యమంత్రి విశాఖ నుండి పరిపాలన చేస్తే విశాఖ రూపురేఖలన్నీ మారిపోతాయని పదేపదే వక్కాణించారు.

ఏడాదికి రూ.25 వేల కోట్ల టర్నోవర్‌ కలిగిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ గురించి కనీసం నోరు మెదపలేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలో కొనసాగితేనే విశాఖ అన్ని రకాలుగా అభివృద్ధి అవుతుందనే నగసత్యాన్ని ఉద్దేశ్య పూర్వకంగానే దాచిపెట్టారు. అందుకే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మకం నుండి కాపాడుకుంటామని ప్రకటన చేయలేదు. ఫలితంగా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అమ్మేయాలనే బిజెపి కుట్రలకు బహిరంగంగా మద్దతు ఇచ్చినట్లయింది.

విశాఖలో అతి పెద్ద సమస్య మురికివాడలు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 793 ఉన్నాయి. వీటిలో 6.62 లక్షల మంది జీవనం సాగిస్తున్నారు. వీరంతా విశాఖ ఉత్పత్తిలో, సేవలలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. మంచినీరు, రోడ్లు, కాలువలు, పారిశుధ్యం వంటి కనీస మౌలిక సదుపాయాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. గృహ హక్కులు ఇప్పటికీ అత్యధిక మందికి కల్పించలేదు. ఇక విద్య, వైద్యం, పార్కులు, గ్రంథాలయాలు, క్రీడాస్థలాలు, ఉమ్మడి సంక్షేమ భవనాలు, చిన్న పిల్లల క్రెచ్‌లు వంటివి మచ్చుకు కూడా కనిపించవు. ఈ మురికి కూపాల్లో అత్యంత పేదరికంతో జీవనం సాగిస్తున్నారు. వీరి అభివృద్ధికి, హక్కుల కల్పనకు ఈ విజన్‌ పత్రంలో స్థానమేలేదు.

జగన్‌ విజన్‌లో శ్రామిక జనావళే లేరు. అన్నీ ప్రైవేట్‌ పెట్టుబడులే. ఇవి పెరిగితే నగర స్థూల ఉత్పత్తి పెరిగి విశాఖ నగరం హైదరాబాదు, బెంగుళూరు, చెన్నైలకు ధీటుగా ఎదుగుతుందని అన్నారు. కాని ఉత్పత్తికి కారకులైన కార్మికుల జీవన స్థితిగతులు, వేతనాలు, ఉద్యోగ, సామాజిక భద్రత, విద్య, వైద్యం వంటి వాటిపై ఒక్క పథకం కూడా లేదు. నేటి విజన్‌ విశాఖ నమూనా విశాఖ కార్మిక వర్గానికి ఇంకా పెను ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నది. అనేక సదుపాయాలు కోల్పోయి అదనపు భారాలు మోయాల్సి వస్తుంది. ఏ హక్కులు లేకుండా యజమానులకు వెట్టిచాకిరి చేయాల్సి వస్తుంది. తీవ్ర శ్రమ దోపిడికి గురికావాల్సి వస్తుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే ‘విజన్‌ విశాఖ’ దోపిడీని ఇంకా తీవ్రతరం చేస్తుంది. ప్రజల ఉమ్మడి ఆస్తులు, సహజ వనరులు, భూములు, ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజల సదుపాయాలను కొల్లగొడుతుంది. సముద్రం తీరం మొత్తం కార్పొరేట్‌ గుప్పెట్లోకి వెళ్తుంది. సంపద మరింత కేంద్రీకృతమవుతుంది. అసమానతలు ఇంకా పెరుగుతాయి. అందుకే ఈ కార్పొరేట్‌ అనుకూల విజన్‌ను తిప్పికొట్టాలి. విశాఖను కాపాడుకోవాలి.

  •  వ్యాసకర్త : డా|| బి.గంగారావు, సెల్‌ : 9490098792 /
➡️