ఘనంగా మణిపూర్‌ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు

Apr 29,2024 18:55 #Awards, #movies

అస్సాం రాష్ట్రం ఇంఫాల్‌ తూర్పు జిల్లాలోని మణిపూర్‌ స్టేట్‌ ఫిల్మ్‌ డెవలప్మెంట్‌ సొసైటీ (ఎంఎస్‌ఎఫ్డీఎస్‌) ప్యాలెస్‌ ఆడిటోరియంలో 15వ మణిపూర్‌ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను మణిపూర్‌ గవర్నర్‌ అనుసుయా ఉయికే అందజేశారు. ఎంఎస్‌ఎఫ్డీఎస్‌ లైఫ్టైమ్‌ అచీవ్మెంట్‌ అవార్డు 2023ను ప్రముఖ సినీ నటుడు మొయిరంగ్తేమ్‌ నీలమణి సింగ్‌కు అందజేశారు. కేంద్ర సాహిత్య అకాడమీకి మణిపూర్‌ రాష్ట్ర చలన చిత్ర పురస్కారం లభించింది. సుప్రసిద్ధ మణిపూరి రచయిత ప్రకాష్‌సింగ్‌ జీవిత సాహిత్యాలపై అకాడమీ రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రానికి ఉత్తమ జీవిత చరిత్ర, కళా సాంస్కృతిక చిత్రాల విభాగంలో పురస్కారం వరించింది. ఆదివారం ఇంఫాల్‌లో జరిగిన మణిపూర్‌ చలన చిత్ర పురస్కారాల మహోత్సవంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ అనుసూయా ఉయికే కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్‌ కృత్తివెంటి శ్రీనివాసరావునకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. అవార్డు లభించిన సాహిత్య అకాడమీ డాక్యుమెంటరీ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రముఖ రచయిత ఆరిబమ్‌ శర్మకు ఉత్తమ డైరెక్టర్‌, చోంగ్‌తమ్‌ కమలాకు ఉత్తమ వాయిస్‌ ఓవర్‌ పురస్కారాలు దక్కాయి. వివిధ భారతీయ భాషలకు చెందిన సాహితీ ప్రముఖల జీవన ప్రస్థానంపై ఇప్పటివరకు సాహిత్య అకాడమీ 172 డాక్యుమెంటరీ చిత్రాలను రూపొందించింది. కేంద్ర సాహిత్య అకాడమీకి ఒక రాష్ట్ర ప్రభుత్వ చలన చిత్ర పురస్కారం లభించడం ఇదే తొలిసారి కావటం విశేషం.

➡️