రికార్డుల కోసం మేము కల్కి సినిమా తీయలేదు : స్వప్న దత్‌

Jun 28,2024 15:59 #kalki movie, #producer, #swpnadat

ఇంటర్నెట్‌డెస్క్‌ : హీరో ప్రభాస్‌ నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం. ఎట్టకలకు ఈ చిత్రం థియేటర్లలో జూన్‌ 27వ తేదీన విడుదలైంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం హిట్‌ టాక్‌ అందుకుని భారీ వసూళ్లను రాబడుతుంది. ఒక్కరోజులోనే ఈ సినిమా రూ. 180 కోట్లకు పైగా రాబట్టిందని సినీ వర్గాల సమాచారం. అయితే తాము కలెక్షన్ల కోసం సినిమాను నిర్మించలేదు అని ఈ చిత్ర నిర్మాత స్వప్నదత్‌ అన్నారు. ఈ మేరకు ఆమె సోషల్‌మీడియాలో పోస్టు కూడా చేశారు. ‘నాకు ఆశ్చర్యంగా ఉంది. చాలామంది నాకు కాల్‌ చేసి రికార్డులను క్రాస్‌ చేశామా అని అడుగుతున్నారు. నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఆ రికార్డులు సృష్టించిన వాళ్లెవరూ ఆ రికార్డుల కోసం సినిమాలు తీయరు. ప్రేక్షకుల కోసం, సినిమా మీద ప్రేమతో సినిమాలు తీస్తారు. మేము కూడా అలాగే తీశాం.’ అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
కాగా, ప్రముఖ హీరో కమల్‌హాసన్‌, బాలీవుడ్‌ నటుడు అమితాబచ్చన్‌, నటి దీపికా పదుకొనె, బ్రహ్మానందం, రాజమౌళి, విజరు దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, అన్నాబెన్‌ వంటి నటీనటులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించారు. ఈ చిత్రం వైజయంతి మూవీ బ్యానరల్లో తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌, ఆయన ఇద్దరు కుమార్తెలు ప్రియాంకదత్‌, స్వప్నదత్‌ నిర్మించారు.

➡️