రంగస్థలమే ఊపిరిగా …

Mar 24,2024 05:30 #Jeevana Stories

ఆహార్యంలో నిండుదనం… సంభాషణల్లో స్పష్టత వెరసి రంగస్థలంపై ఆయన శైలి వినూత్నం. 71 ఏళ్ళ వయస్సులో సైతం కళారంగం కోసం అలుపెరుగక కృషి చేస్తున్న అవిశ్రాంత కళాకారుడు. ఆయనే గత 49 సంవత్సరాలుగా నాటకరంగమే ఊపిరిగా ముందడుగు వేస్తున్న కళామతల్లి ముద్దుబిడ్డ నాయుడు గోపి. సామాజిక అంశాలే ఇతివృత్తంగా, జనజాగృతే లక్ష్యంగా ఆయన ప్రదర్శించిన ఎన్నో నాటికలు, నాటకాలూ ఎంతో ప్రాచుర్యం పొందాయి. 1990లో గ్రామీణ కళాకారులతో ‘గంగోత్రి’ నాటక సమాజాన్ని స్థాపించిన నాటి నుంచి నేటి వరకూ ప్రజల్లో సామాజిక చైతన్యం కోసం కృషిచేస్తున్నారు. ఎందరో యువ కళాకారులను ప్రోత్సహించారు. రచయితగా, నటుడుగా, ప్రయోక్తగా, దర్శకుడిగా అనేక రూపాల్లో రంగస్థలానికి విస్తారమైన సేవలు అందించారు. ఈనెల 27 రంగస్థల దినోత్సవం సందర్భంగా ఆయనతో ‘జీవన’ ముచ్చటించింది.

గుంటూరు జిల్లా అమరావతి మండలం యండ్రాయి గ్రామంలో 1953 మార్చి 17న నాయుడు ప్రకాశరావు, కమలమ్మ దంపతులకు నాయుడు గోపి జన్మించారు. చిన్నప్పుడే నటనపై ఉన్న ఆసక్తితో ‘సన్యాసం’ అనే నాటకంలో నటించారు. 1981లో ఇసుకపల్లి మోహనరావు రచించిన ‘డియర్‌ ఆడియన్స్‌ అండ్‌ సిన్సియర్‌ లీవర్‌’ అనే రంగస్థల ప్రదర్శనతో ఆయన తొలిసారిగా నటుడిగా పరిచయమయ్యారు. గుంటూరు శాస్త్రి దగ్గర శిష్యరికం చేశారు. పడమటి గాలి, తర్జన, దహతి మానసం వంటి నాటకాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ‘తర్జన’లో నిరుద్యోగ యువకుడి పాత్రలో చదువుకున్న యువతకు ఉద్యోగాలలేమిని పట్టి చూపినందుకుగాను ఆయన నటనకు 1984లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్నారు. ‘గంగోత్రి’ రంగస్థల సంస్థ ద్వారా నిషిద్ధాక్షరి, మానస సరోవరం వంటి అనేక నాటకాల్లో నటించారు. ప్రజాతీర్పు, యూనియన్‌ లీడర్‌, లీడర్‌, దమ్ము, దృశ్యం, ఖైదీనం.150, శేషాద్రి నాయుడు, మహాత్మా, నేనున్నాను వంటి 22 సినిమాల్లో నటించారు. నేనున్నానులో శ్రేయకు పక్షవాతం వచ్చిన తండ్రిగా, మహాత్మలో లాయర్‌గా, యాత్రలో రైతు పాత్రను పోషించారు.

కళామతల్లి ముద్దుబిడ్డగా …
సామాజిక మార్పులకు కళలు ఎంతో దోహదపడతాయని భావించి ఆ రంగంలో కృషి చేస్తున్నారు నాయుడు గోపి. ప్రపంచీకరణ ప్రమాదాన్ని ఎత్తిచూపి భాషలు, కళలు, సంస్క ృతి, సంప్రదాయాల పరిరక్షణపై దృష్టి కేంద్రీకరించి పలు కళారూపాల ప్రదర్శనలకు ప్రాధాన్యత ఇచ్చారు. నిరక్షరాస్యత, నిరుద్యోగం, అంటరానితనం, ఎయిడ్స్‌, పర్యావరణం తదితర అంశాలను ప్రజలకు వివరించి వాటికి పరిష్కార మార్గాలు కళారూపాల ద్వారా చూపించారు. సాంఘిక దురాచారాలు పోవాలనీ, మనిషిని సమానత్వంగా గుర్తించాలని తన నాటకాల ద్వారా ఆకాంక్షిస్తారు గోపి. తాను రాసిన నాటికలను పిల్లలతో, యువతతో ప్రదర్శింపచేసి వారిలో కూడా కళల పట్ల వారు అభిమానం పెంచుకునేలా చేస్తున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటుగా బరంపురం, ఖరగ్‌పూర్‌, భిలారు, చెన్నై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. గంగోత్రి సమాజం, నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా రీసోర్స్‌ సెంటరు-బెంగుళూరు వారి సౌజన్యంతో థియేటర్‌ టెక్నికల్‌ వర్కుషాపు నిర్వహించి ఔత్సాహిక కళాకారులకు శిక్షణ ఇప్పించారు.

బంగారు నందులకు కేరాఫ్‌గా …
ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత కెఎస్‌టి సాయి దగ్గర నటనలో ఓనమాలు దిద్దారు నాయుడు గోపి. ఆ తర్వాత 1980లో ‘శాస్త్రీయం-గుంటూరు’, ‘స్పందన- ఒంగోలు’, ‘వేమన ఆర్ట్స్‌- గుంటూరు’ మొదలైన నాటక సమాజాల్లో ఎన్నో వేషాలు వేస్తూ నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కారు. దర్శకుడిగా ఎదుగుదలకు జిఎస్‌ఆర్‌కె శాస్త్రి కారణమైతే, నటుడిగా గుర్తింపు రావటానికి తోడ్పడిన వ్యక్తి వేముల మోహనరావు. 1989 వరకు రంగస్థలంపై నిరాటంకంగా నటిస్తున్న సమయంలో తను నటిస్తున్న సమాజాల్లోని నటులు సినిమాల్లో అవకాశాల కోసం వెళ్లిపోతున్నారు. అప్పట్లో నాటక ప్రదర్శనలు కుంటుపడ్డాయి. దాదాపు ఏడాదిపాటు ఏకాకిగా ఉండిపోయారు.

‘గంగోత్రి’తో ఎన్నో ప్రయోగాలు
1990 జనవరిలో మిత్రుడు ఆనంద్‌ సలహా మేరకు ‘గంగోత్రి’ పేరుతో నాటక సమాజాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేటి వరకూ నాటక ప్రదర్శనలను కొనసాగిస్తూనే ఉన్నారు. సిహెచ్‌ రజితమూర్తి, పెండెంట కోటేశ్వరరావు, బి.బాబూరావు, పి.సాంబిరెడ్డి, పి.నాగిరెడ్డి, డి.నాగేశ్వరరావు, ఎస్‌.లక్ష్మిల సూచనలతో ముందుకు సాగారు.
‘మానస సరోవరం’ నాటకంతో ఆయన దర్శకుడిగా మారారు. వెనిగండ్ల గ్రామంలో గంగోత్రి ద్వారా తొలి ప్రదర్శన 1990 ఏప్రిల్‌ 9న ఇవ్వగా, అప్పటివరకూ జరుగుతున్న మేనరికపు పెళ్లిళ్లకు చాలాచోట్ల ఫుల్‌స్టాఫ్‌ పడింది. ఆనందరావు రాసిన ‘కాదు సుమా కల’, ‘నీతిచంద్రిక’ నాటకాలు కూడా నాయుడు గోపికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి.

నాటిక ప్రదర్శనల్లోనూ మేటిగా…
ఆనందరావు రాసిన నాటిక ‘దర్పణం’, మడభూషి దివాకర్‌బాబు రచించిన ‘దహతి మమ మానసం’ నాటిక ప్రదర్శనలు కూడా ప్రేక్షకుల మన్ననలు పొందాయి. హైదరాబాద్‌కు చెందిన వంశీ నిరంజన్‌ కళాకేంద్రం ‘నవ్వండి విషాదం’ రచయిత సత్యనాథం అంగీకారంతో దాదాపు 50 ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత యద్భవిష్యం, శ్వేతపత్రం, లజ్జ, శ్రీముఖ వ్యాఘ్రం, శ్రీ చక్రం, హింసధ్వని, భూమిపుత్రుడు, పడమటి గాలి, వానప్రస్థం, ఎడారికోయిల, ఓనమాలు, భారతరత్న, ఆంబోతు వంటి సాంఘిక నాటికలు, నాటకాలే కాకుండా పల్నాటి భారతం, హంసగీతం, శ్రీ వేమన వంటి పద్యనాటకాలకు కూడా దర్శకత్వం వహించారు. విద్యాధర్‌ మునిపల్లి రచించిన ‘గమనం’ నాటిక, శ్రీ గురు రాఘవేంద్ర చరితం’ పద్య నాటకాన్ని అనేక చోట్ల ప్రదర్శించారు. దాని ద్వారా కాంస్య నందిని అందుకున్నారు.

– యడవల్లి శ్రీనివాసరావు

2000కుపైగా నాటక ప్రదర్శనలు
1975లో నట జీవితాన్ని ప్రారంభించాను. 1990 నుంచి ఆలిండియా రేడియో ఆర్టిస్ట్‌గా పనిచేశాను. 2000లకు పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చాం. ఉత్తమ నటుడిగా 600 వరకు, ఉత్తమ దర్శకుడిగా 400 బహుమతులు అందుకున్నా. వందలాది కళాసంస్థలు అవార్డులతో సత్కారాలు, వేలాది సన్మానాలను అందుకున్నాను. పలు సంస్థల్లో అనేక పదవులను నిర్వహిస్తున్నాను. సెంట్రల్‌ సెన్సార్‌బోర్డు సభ్యుడిగా పనిచేశాను. 2022లో రాష్ట్ర ప్రభుత్వ వైఎస్సార్‌ లైఫ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు, 2023లో నాటక నంది అవార్డులను అందుకున్నా.

-నాయుడు గోపి, సినీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌,
ప్రముఖ రంగస్థల నాటకరంగ ప్రముఖులు, పెదకాకాని, గుంటూరు జిల్లా.

➡️