ఒకే ఒక్క చేతితో లక్షన్నర పుస్తకాలు !

Nov 14,2023 09:24 #Jeevana Stories, #Library

తరతరాల విజ్ఞాన సంపాదన వివరించేవి గ్రంథాలయాలే. అలాంటిది లక్షా 50 వేలకు పైగా పుస్తకాలను సేకరించిన వ్యక్తి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరంటే ఒక్కరు ఉన్నారు. ఆయన పేరు లంకా సూర్యనారాయణ. గుంటూరుకు చెందిన ఆయన వద్ద శతాబ్దాల క్రితం నాటి తాళపత్ర గ్రంథాల నుంచి నేటి ఆధునిక టెక్నాలజీకి సంబంధించిన వివిధ సబ్జెక్టులు, కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, ఆరోగ్యం, సినిమా వంటి రంగాలకు చెందిన వేలాది పుస్తకాలూ ఉన్నాయి. సమాజం, ప్రకృతి, పర్యావరణం, ప్రపంచ విజ్ఞానాన్ని అన్ని కోణాల్లో వీక్షించగల సత్తా కలిగిన పుస్తకాలెన్నో ఆయన వద్ద ఉన్నాయి. ఆయన ఇల్లు కూడా పుస్తకాలతో నిండిన సువిశాల భవనం. నాటి నుంచి నేటి వరకూ 88 ఏళ్లప్రాయంలో కూడా అదే స్ఫూర్తితో పుస్తకాల సేకరణ ప్రవృత్తిని కొనసాగిస్తున్నారు. ఎపి లైబ్రరీ మ్యాన్‌గా పిలువబడు తున్నారు. తను సేకరించిన గ్రంథాలను కొన్ని ఉచితంగా చదువుకోవటానికి ఇవ్వటంతోపాటు ఆన్‌లైన్‌లో పీడిఎఫ్‌ పేజీలు పంపించటానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు.

గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెదగొట్టిపాడుకు చెందిన లంకా పెద లక్ష్మీనారాయణ, శ్రీ రంగనాయకమ్మ దంపతులకు సూర్యనారాయణ ఆగస్టు 23, 1936లో జన్మించారు. 1956లో కస్టమ్స్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ డిపార్డుమెంట్‌లో ఉద్యోగంలో చేరారు. 1992లో సూపరింటెండెంట్‌గా ఉద్యోగ విరమణ పొందారు.

చిన్నప్పటి నుంచీ పుస్తకాల సేకరణ

చిన్నప్పటి నుంచే పుస్తకాల సేకరణను వ్యాపకంగా మార్చుకున్నారు సూర్యనారాయణ. సంపాదనలో కొంత భాగాన్ని పుస్తకాల కొనుగోలుకు వెచ్చించేవారు. పదుల సంఖ్య నుంచి లక్షకుపైగా పుస్తకాలు చేరటంతో ఇంటినే గ్రంథాలయంగా మార్చారు. నేటికీ ప్రతిరోజూ ఎక్కువ సమయాన్ని ఈ గ్రంథాలయంలోనే గడుపుతారు. గ్రంథాలయ అధికారి సుభాషిణి నలజాల, మరో సహాయకుడు పాఠకులకు సేవలందిస్తున్నారు.

వేల పుస్తకాల భాండాగారం

ఓ వ్యక్తి జీవితకాల కృషికి నిలువెత్తు నిదర్శనమైన ఈ పుస్తక భాండాగారాన్ని అనునిత్యం వందలాది మంది సందర్శించి వెళ్తుంటారు. మంచి పుస్తకమైనా, వ్యాసమైనా చదివితే దానిని సేకరించటానికి ఖర్చుకు సైతం వెనుకాడని నైజం సూర్యనారాయణది. ఈ తపనతోనే వేలాది పుస్తకాలు సేకరించగలిగానని ఆయన గర్వంగా చెబుతారు.

అన్నమయ్య గ్రంథాలయంలోకి మార్పు

సూర్యనారాయణ సేకరించిన పుస్తక సంపద అంతా 2008లో గుంటూరులోని బృందావన్‌ గార్డెన్స్‌లోని కంచి కామకోటి పీఠ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయానికి సమర్పించారు. 2011లో నూతనంగా నిర్మించిన ధార్మిక విజ్ఞాన ప్రాంగణంలోని నూతన భవనంలోకి మార్చారు. ఈ పుస్తక సంపదను చూసిన టిటిడి ప్రతినిధులు ఆర్థిక సహకారం అందించారు. అయితే నాటి నుంచి ప్రభుత్వాల సహకారం సరిగ్గా లేకపోవటంతో గ్రంథాలయ నిర్వహణలో ఆర్థిక సమస్యలు తలెత్తుతున్నాయి.

అపురూపమైన పుస్తక సంపద

అన్నమయ్య గ్రంథాలయం పుస్తకాల్లో తెలుగులో భగవద్గీత, రామాయణం, భాగవతం, ఉపనిషత్తులు, వేదాలు, అనేక కవితా సంకలనాలు, నాటకాలు, సంగీతం, చిత్రకళ, నిఘంటువులు, జీవిత చరిత్రలు, ట్రావెల్‌, చరిత్ర, హాస్యం, సూక్తులు, దేశభక్తి, నవలలు, స్టాంపులు, కాఫీటేబుల్‌ బుక్స్‌, గ్రంథాలయ సమాచార శాస్త్ర గ్రంథాలయాలు, జర్నలిజం మొదలైన 161 సబ్జెక్టులలోనూ, ఇంగ్లీషులో మరొక 100 సబ్జెక్టు పుస్తకాలు గ్రంథాలయం మూడు అంతస్తుల్లో అమరి ఉన్నాయి. మొత్తం 1,40,346 పుస్తకాలున్నాయి. అందులో 97,510 తెలుగు; 41,688 ఇంగ్లీషు, 1148 హిందీ, సంస్కృతం, తమిళం, కన్నడ పుస్తకాలు ఉన్నాయి. ఇవేకాకుండా తెలుగు పత్రికలు 1091, ఇంగ్లీషు 1155, హిందీ, సంస్కృతం పత్రికలు 25 మొత్తం 2271 తెలుగు, ఇంగ్లీష్‌ పత్రికల టైటిళ్లు, 500 బౌండ్లు (పత్రికల కత్తిరింపులు-ఒక్కొక్క పుస్తకం సుమారుగా 400 పేజీలు), మరెన్నో దినపత్రికల కత్తిరింపులు (4 లక్షలకుపైగా) అందరికీ అందుబాటులో ఉంచటం సరికొత్త రికార్డే. వీటిలో పాఠకులు ఏ పుస్తకం అడిగినా మూడు నిముషాల్లో వారి ముందుంచేలా ఒక క్రమపద్ధతిలో వాటిని అమర్చటం విశేషం. సాంకేతిక పరిజ్ఞానాన్ని, వినియోగించి గ్రంథాలయంలోని పుస్తకాలను డిజిటలైజ్‌ చేసే పక్రియ కొనసాగుతోంది. ఆ వివరాల క్యాటలాగ్‌ అంతర్జాలంలో ‘అన్నమయ్య గ్రంథాలయం-వికీపీడియా’పేజీలో ఉంది. ఇక్కడ పుస్తక ప్రియులు కోరిన పుస్తకాన్ని స్కాన్‌ చేసి పెన్‌డ్రైవ్‌లో ఇస్తారు. స్థానికేతరులు ఫోన్‌ ద్వారా (0863-2246365) సంప్రదిస్తే కావాల్సిన పుస్తకం సాఫ్ట్‌ కాపీని ఈ మెయిల్‌ ద్వారా అందుకునే వీలుంది. ఎవరైనా పుస్తకం తీసి చదివినా తిరిగి ఎక్కడ తీసింది అక్కడ పెట్టడానికి వీల్లేదు. కింద పెట్టాల్సిందే. సిబ్బందే వాటి నమూనా సంఖ్య ఆధారంగా తిరిగి సర్దేయటం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. తద్వారా పాఠకులు తిరిగి ఆయా పుస్తకాలు సులభంగా పొందే ఏర్పాట్లు చేశారు.

పరిశోధకులకు డాక్టరేట్లు

తెలుగు, ఇంగ్లీషు డిక్షనరీలు, ఆటో బయోగ్రఫీలు, బయోగైడ్స్‌, కాపీ టేబుల్‌ బుక్స్‌, నాటకాలు, సినిమాలు, రామాయణానికి సంబంధించి సుమారు గ్రంథాలు, భాగవంతం, భారతం, శ్రీమద్భగద్గీత తెలుగు ఇంగ్లీషు మీడియంలలో కూడా లభిస్తున్నాయి. ఇవి అనేకమంది సాహిత్య పరిశోధకులకు తులనాత్మక పరిశీలన చేసే అవకాశం కల్పిస్తున్నాయి. అరుదైన కొన్ని పుస్తకాలను ఇక్కడి నుంచి తీసుకుని పునర్ముద్రణ జరిపిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. సుమారు 60 ఏళ్ల నుంచి వెలువడిన వివిధ దినపత్రిలకు వీరు భద్రపర్చారు. గ్రంథాలయాన్ని ఉపయోగించుకుని 30 మంది డాక్టరేట్లు పొందారు. మరికొందరు పరిశోధనలను ఇక్కడే కొనసాగిస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు లావు నాగేశ్వరరావు, జాస్తి చలమేశ్వరరావు తదితరులు గ్రంథాలయాన్ని సందర్శించి సూర్యనారాయణ కృషిని ప్రత్యేకంగా అభినందించారు. సూర్యనారాయణ కృషికి గుర్తింపుగా 2015లో రాష్ట్రప్రభుత్వం ఉగాదికి కళారత్న (హంస), 2017లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తిపురస్కారం బహూకరించాయి. పలు సంస్థలు, ట్రస్టులు పలు సన్మానాలు, అవార్డులు ప్రదానం చేశాయి.

– యడవల్లి శ్రీనివాసరావు

➡️