రకరకాల ‘మామిళ్ల’ తోట …

May 9,2024 05:15 #Jeevana Stories

మామిడితోటను పెంచటం, మామిడిపండ్లను పండించి, అమ్మడం మనవాళ్లకు ఎప్పటినుంచో తెలిసిందే! ఆ తోటను రకరకాల మామిళ్లతో తీర్చిదిద్దటం, దాన్నొక సందర్శనాక్షేత్రంగా మార్చటం ఆ కుటుంబం చేసిన పని. ఇప్పుడు అదొక సరికొత్త వ్యాపారంగా అవతరించింది. కుటుంబం మొత్తానికి ఏడాదంతా ఇష్టమైన వ్యాపకాన్ని, మంచి ఆదాయాన్ని సమకూరుస్తోంది. ఈ అనుభవం తెలుసుకోవటానికి గిర్‌ అడవుల సమీపంలోని బాల్చేల్‌ అనే ఊరిని సందర్శించాలి మనం.

1985 నాటి సంగతి. నూర్‌ ఆలీ వీర ఝరియా అనే పెద్దాయన తన సంగోద్రలో ఉన్న ఆరెకరాల భూమిని అమ్మేసి, ఆ పక్క ఊరు బాల్చేల్‌లో పదెకరాలు కొన్నాడు. రాళ్లూ రప్పలతో ఉన్న ఆ భూమిని సాగుకు అనుకూలంగా మార్చాడు. మామిడి మొక్కలు నాటాడు. తొలుత కేసరి రకం మామిడిని ఎక్కువగా సాగుచేశాడు. తోటలో రకరకాల మామిళ్లు ఉండాలనేది అతడి ఆలోచన. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో దొరికే రకాలన్నిటినీ తెచ్చి నాటాడు. కొన్నేళ్లకు దిగుబడి మొదలైంది. అందరిలా ఎవరో ఒకరికి తోటను ఏకమొత్తంగా అమ్మేసే పద్ధతిని అవలంబించలేదు. మామిళ్లు కావాల్సిన వారు తోటకు నేరుగా వచ్చేలాగ, తమకు ఇష్టమైన మామిడి రకాలను వారే స్వయంగా ఎంచుకునేలాగ ప్రచారం చేశాడు. ఇది చాలా మందికి నచ్చింది. ఎక్కడెక్కడి జనం తోటకు రావడం, తోటంతా తిరిగి కావాల్సిన కాయలను కోయించుకోవడం ఒక అలవాటుగా మారింది. అదే ఇప్పుడు ఒక ‘లాభదాయక వ్యాపారం’గా అవతరించింది. 1996 నాటికి ఆ తోటలో 14 రకాల మామిళ్లు ఉండేవి. కొంతమంది ఆ రకాల మొక్కలు తమకూ కావాలీ అంటే- ఒక మామిడి నర్సరీని కూడా మొదలు పెట్టాడు.
నూర్‌ ఆలీ ఝరియా కొడుకు సంసుద్దీన్‌ తండ్రి బాటలోనే నడిచి, తోటను మరింతగా విస్తృతపరిచాడు. మరిన్ని రకాల కోసం అనేక రాష్ట్రాలు తిరిగాడు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు వెళ్లాడు. రైతులతో, శాస్త్రవేత్తలతో మాట్లాడి, మరిన్ని రకాల సేకరించాడు. తెచ్చిన మొక్కలను జాగ్రత్తగా పెంచి, దానితో వివిధ రకాల మామిళ్లకు అంటుకట్టి, ప్రయోగాలు చేసేవాడు. అది సరైన ఫలాలను ఇస్తుందో లేదో తెలియటానికి కనీసం నాలుగేళ్లు పట్టేది. అప్పటివరకూ జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ, సాకేవారు. ఆ తరువాత తోటలో ఉత్పత్తికి, నర్సరీలో అమ్మకానికీ మొక్కలను పెంచేవారు. ఇప్పటికీ అదే పద్ధతి కొనసాగుతోంది.
ఝరియా మనవళ్లు అనిల్‌, సుమిత్‌ ఎదిగొచ్చాక ఒకపక్క తోట, మరోపక్క వారి వ్యాపారం మరింతగా విస్తరించాయి. ఆ అన్నాతమ్ముళ్లు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, సమాచార వ్యవస్థలను ఉపయోగిస్తున్నారు. అమెరికా, థారుల్యాండ్‌, ఆస్ట్రేలియా, ఇజ్రాయేల్‌ తదితర దేశాల నుంచి కొత్త రకాల మామిడి మొక్కలను రప్పించి, సాగు చేస్తున్నారు. తండ్రి హయాంలో 80 రకాల మామిళ్లు ఉంటే- వారు ఇప్పుడు 230 రకాలను పెంచుతున్నారు. నర్సరీలోనూ అమ్ముతున్నారు. ”అనిల్‌ మ్యాంగో అగ్రో ఫామ్స్‌’ పేరిట విక్రయ సంస్థను ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే వెళ్లే సందర్శకులు అక్కడ బస చేయటానికి, ఆ తోటల మధ్య కొన్ని రోజులు గడపటానికి కూడా ఏర్పాట్లు కాటేజీ నిర్మించారు. ఆ తోటల సందర్శన అతిథులకు గొప్ప ఆనందాన్నిస్తుందని చెబుతున్నాడు సుమిత్‌.
”మా తోటలో, నర్సరీలో మామిడి రకాలను మేం స్వయంగా తయారు చేస్తున్నామని కొంతమంది అనుకుంటారు. మేము చేస్తున్న పని వివిధ ప్రాంతాల నుంచి అప్పటికే సాగు చేస్తున్న రైతుల నుంచి సేకరించటమే! వాటిని మరిన్ని మొక్కలుగా ఇక్కడ అభివృద్ధి చేస్తాం, అంతే!” అని చెప్పాడు సుమిత్‌.

”మా తోటలో చాలా విశేషాలున్నాయి. ఒక మామిడి చెట్టు 80 రకాల మామిళ్లు కాస్తుంది. అంటే దాని కొమ్మలకు 80 రకాల అంట్లు కట్టారన్నమాట. కొన్ని చెట్లు ఏడాది మొత్తం కాస్తూనే ఉంటాయి. కొన్ని మామిళ్లు రకరకాల రంగుల్లో ఉంటాయి. కొన్ని కాయలుగా ఉన్నప్పుడు అత్యంత మధురంగా ఉంటాయి. టెంకలు లేని విదేశీ మామిళ్లు ఈ తోటలో ఉన్నాయి. కొన్ని 100 గ్రాములు దాటని మామిళ్లయితే, కొన్ని ఏడెనిమిది కేజీల దాకా ఉంటాయి. ఇలా రకరకాల వైవిధ్యభరితమైన మామిడితోట మాది. అందుకనే కొనటానికే కాదు; స్వయంగా వచ్చి చూట్టానికి కూడా కొనుగోలుదారులు ఇష్టపడారు.” అని వివరించాడు.
ఇప్పుడు ఈ నర్సరీ ద్వారా ఏడాదికి 2 లక్షల మామిడి మొక్కలు అమ్ముడవుతున్నాయి. పక్వానికొచ్చిన మామిడి కాయలు చెట్ల మీదనే అమ్ముడైపోతున్నాయి. ఇలా ఈ పదెరకాల తోట, నర్సరీ ద్వారా ఏడాది రూ.కోటి వరకూ ఆ ఝరియా కుటుంబం వ్యాపారం చేస్తోంది. సాంప్రదాయ సాగుకు కొత్త ఆలోచనలు జోడించటం తమ అభివృద్ధికి మూలం అని చెబుతున్నారు అనిల్‌, సుమిత్‌. ”ఇది వొట్టి మామిడితోట కాదు; వందల రకాలుగా కనిపించే సజీవ మామిడి మ్యూజియం..” అంటున్నారు, నవ్వుతూ.

➡️