సున్నప్పిడత

Mar 29,2024 05:30 #jeevana

వంట పూర్తి చేసి అప్పడాలు, గుమ్మడి వడియాలు వేయించి పళ్ళెంలో పెట్టింది సౌమ్య. భోజనాలకు సిద్ధం చేయడానికి వరండాలోకి వెళ్ళింది. ఈలోపు రుద్ర, గరిట పట్టుకుని నెమ్మదిగా గదిలోకి వెళ్ళి వేయించిన అప్పడాల మీద ఒక్క మొట్టు మొట్టాడు. అంతే అప్పడాలన్నీ ముక్కలుముక్కలు అయిపోయాయి. అది చూసిన సౌమ్యకి కోపం చిర్రెత్తుకొచ్చింది. ‘నూరు అప్పడాలకు ఒకటే సొడ్డు’ అన్నట్లు ఉదయం నుంచి అన్నీ పాడు పనులే చేస్తున్నావ్‌’ అని రుద్ర చెవిని గట్టిగా నులిమింది. దాంతో ఆరున్నొక్క రాగం తీస్తూ వసారాలో ఉన్న ముని మామ్మ లక్ష్మీ నరసమ్మ దగ్గరికి వెళ్లాడు రుద్ర.
‘అయ్యో ఏమైంది బంగారం. అమ్మెందుకు కొట్టింది. నువ్వు బుద్ధి కదా!’ అంది మునిమామ్మ. ‘అలాగే వెనకేసుకు రండి. అందుకే వాడికి కొమ్ములస్తున్నాయి. సున్నప్పిడత గాడు. అప్పడాలు పిండి చేశాడు, తోమిన సామాన్లు అన్నీ కింద పరిచేసాడు. ఆరిన బట్టలు తడిపేసాడు’ అని తిట్టింది సౌమ్య.
‘వాడికేం తెలుస్తుంది చిన్నవాడు. ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో మనం చెప్పాలి’ అంది ముని మామ్మ. అమ్మ అటు వెళ్లగానే ‘మామ్మ గారూ… సున్నప్పిడత అంటే ఏమిటి?’ అని ఏడుపు ఆపి అమాయకంగా అడిగాడు రుద్ర.
‘పూర్వం అందరూ భోజనం చేసిన తరువాత తాంబూలం వేసుకునేవారు. దానికోసం అందరి ఇళ్లల్లో చిన్న కుండ పిడతల్లో సున్నం ఉంచుకునేవారు. దానిని సున్నపు పిడత అనేవారు. ఓసారి సీతాపతి పంతులు గారి ఇంట్లో ఉన్న నీలాంటి అల్లరోడు ఆ సున్నప్పిడతని పగులగొట్టాడు. ఇల్లూ వాకిలి సున్నం అయ్యింది. వాళ్ళమ్మ ఎన్ని సార్లు కడిగి శుభ్రం చేసినా తెల్లగా మరక ఉండిపోయింది. ‘ఒక పనికి రెండు పనులంటే ఇవే’ సున్నప్పిడత వెధవ అని తిట్టింది. అప్పటి నుంచి పాడు పనులు చేసే అల్లరి పిల్లల్ని ‘సున్నప్పిడత’ అని పిలవడం వాడుకలోకి వచ్చింది. అందుకే మీ అమ్మ నిన్ను అలా అంది’ అని వివరంగా చెప్పింది మునిమామ్మ.
‘సరే మామ్మ, ఇక నుండి అల్లరి చేయకుండా బుద్ధిగా ఉంటాను’ అంటూ ముని మామ్మ గారి మంచి నీళ్ళ చెంబును తన్నుకుంటూ వెళ్ళాడు రుద్ర. ‘హారీ సున్నప్పిడతా!’ అంటూ ముని మామ్మ నోరెళ్ళబెట్టారు.

– కాశీ విశ్వనాథం పట్రాయుడు,
94945 24445.

➡️