కారు చీకటి బతుకుల ‘క్రాంతి’పథం!

Apr 20,2024 10:54 #Jeevana Stories

గౌరవం, అవకాశాలకు ఎవరు అర్హులు? అంటే.. ప్రతి ఒక్కరూ అని మాత్రం సమాధానం చెప్పలేం. పేద, ధనిక తారతమ్యం పక్కనబెడితే.. కులం, మతం, లింగం ఆధారంగా ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు అర్హులు కాకుండా పోతున్నారు. తమ పుట్టుకే ఒక అవమానకర పరిస్థితుల్లో జరిగిన వారికైతే ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అలా రెడ్‌ లైట్‌ ఏరియాలో పుట్టిన ఆడపిల్లలకు అందరిలా జీవించాలన్నా వారికి గౌరవం, అవకాశాలు దొరకవు. ప్రతి చోటా అవమానాలే ఎదురౌతాయి. సెక్స్‌ వర్కర్‌ పిల్లలుగా ఆ ఆడపిల్లలు ఎక్కడికి వెళ్లినా ఛీత్కారాలే ఎదురవుతాయి. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలనే ‘క్రాంతి’ అనే స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోంది. కనీసం బడి ముఖం కూడా చూడని పిల్లలు, ఇప్పుడు ఆ సంస్థ నీడలో విదేశీ యూనివర్శిటీల్లో చదువుతున్నారు.

‘క్రాంతి’లో థియేటర్‌ టీచర్‌ తన విద్యార్థులను ఉద్దేశించి, ఓ క్లాస్‌ నిర్వహిస్తున్నారు. ‘పిల్లలూ, మీరంతా గట్టిగా కళ్లు మూసుకొని, ఏ పరిస్థితుల్లోనైనా మీరు ‘నో(వద్దు)’ అని చెప్పారా? గుర్తు చేసుకోండి’ అని అడిగారు. ‘ఆ తరువాతి సెషన్‌లో ప్రతి విద్యార్థి ఆ సందర్భాన్ని చెప్పాలి’ అని కూడా అన్నారు. అందరి పరిస్థితి ఏమో గాని, ఆ బృందంలో ఉన్న సంధ్యకి మాత్రం ‘తన వంతు వస్తే ఎలా?’ అని లోలోపల తెగ మదనపడిపోతోంది. రెండక్షరాల ఆ పదాన్ని పలకడం తనకెంత కష్టమైందో గుర్తు చేసుకుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా తాను ఎంతలా ఓడిపోయిందో జ్ఞాపకం వచ్చి దు:ఖం కట్టలు తెంచుకుంది.
తనని తాను ద్వేషించుకుంది
ఈ చిన్న పదం పలకడానికి ఆ అమ్మాయికి ఎందుకంత కష్టమైంది? తను ముంబయి ‘కామాటిపుర’ ప్రాంతానికి చెందిన సెక్స్‌్‌వర్కర్‌ కూతురు. కూతురుని స్కూలుకు పంపించాలని ఆ తల్లి ఎంతో ఆశపడింది. కానీ సంధ్యకు స్కూల్లో అడ్మిషన్‌ దొరకలేదు. ఎంతో బతిమాలితే సీటు వచ్చినా, తన వృత్తాంతం తెలిసి, టీచర్లు, స్నేహితులు తనని దూరం పెట్టారు. అసహ్యించుకున్నారు. ఆ పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవంటే.. తనకీ పరిస్థితి తీసుకొచ్చిన తన తల్లిని, ఆమె కూతురిగా పుట్టినందుకు తనని తాను విపరీతంగా ద్వేషించుకునేంతగా!
‘నో’ అని అనేక సార్లు చెప్పాను
టీచర్‌ క్లాసులో అడిగిన ప్రశ్నతో సంధ్యకు గతం తాలూకు చేదు జ్ఞాపకాలు ఒక్కసారిగా కళ్లముందు కదలాడాయి. వాటినుంచి తేరుకుని టీచర్‌ రాగానే ‘నో’ అని గట్టిగా అరిచి మరీ చెప్పింది. ఆ శబ్ధానికి తరగతి గదిలోని పిల్లలందరూ ఆశ్చర్యపోయారు. ‘నేను ‘నో’ ఒక్కసారి కాదు.. అనేకసార్లు చెప్పాను. నాపై అత్యాచారం జరిగిన ప్రతిసారీ ‘నో’ అని చెబుతూనే ఉన్నాను’ అంటూ సంధ్య బిగ్గరగా ఏడుస్తూ చెప్పింది.
ఆ రోజు తరువాత సంధ్య మళ్లీ ఎప్పుడూ గతాన్ని తల్చుకుని ఏడ్వలేదు. ‘క్రాంతి’లో ఇదొక భాగం. ఆశ్రయం పొందిన పిల్లలందరూ సెక్స్‌ వర్కర్ల కుటుంబాలకు చెందినవాళ్లే. బాల్యం నుంచి వారు ఆత్మన్యూనతా భావంతో పెరిగి ఉంటారు. ఆ భయాన్ని పోగొట్టేలా ‘క్రాంతి’ నిర్వాహకులు థియేటర్‌ కార్యక్రమాలు, థెరపీ సెషన్లు నిర్వహిస్తూ వారిలో నెలకొన్న ఆత్మన్యూనతా భావాన్ని పోగొడతారు.
తన చుట్టూ ఏర్పడిన భయానక వాతావరణంతో స్కూలు విద్యనే ద్వేషించిన సంధ్య ఇప్పుడు విదేశాల్లో ఎంఎ చదువుతోంది. సంధ్య లాంటి ఎంతోమంది క్రాంతి ద్వారా ఇతర దేశాల్లో ఉన్నత విద్య చదువుతున్నారు.
కమోడ్‌లో తలపెట్టారు …

‘అమ్మ నన్ను స్కూల్లో చేర్పించేందుకు అబద్ధమాడింది. సెక్స్‌ వర్కర్‌ కూతురుని అని చెబితే అవమానిస్తారని ఇళ్లల్లో పనిచేసుకుంటానని చెప్పింది. అయితే ఎన్నో రోజులు ఆ విషయం దాగలేదు. మొదట్లో నా ఒంటి ఛాయను బట్టి ‘నల్ల కాకి’ అని పిలిచేవారు. అమ్మ గురించి తెలిశాక ఈ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఒకరోజు నా స్నేహితులు బాత్రూమ్‌ కమోడ్‌లో నా తలపెట్టి గట్టిగా అదిమారు. ‘నువ్వు ఇక్కడి నుంచే వచ్చావు. ఇదే నీ స్థలం’ అంటూ నిందించారు.
‘నేను అర్హురాలిని’ అనేవాడు
పది, పదహారు సంవత్సరాల మధ్య నేను అనేకసార్లు అత్యాచారానికి గురయ్యాను. ఈ విషయం ఎవరికి చెప్పినా నమ్మేవారు కాదు. నాపై దాడి చేసిన వ్యక్తి ‘నువ్వు దీనికి అర్హురాలివి’ అనేవాడు. నా గతం నన్ను ఎంతో దిగజార్చింది. అందుకే నేను మా అమ్మని, నా గతాన్ని ఎంతో ద్వేేషించేదాన్ని’ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్న సంధ్య, తండ్రిని తీసుకుని అమ్మ నుంచి దూరంగా వెళ్లిపోయింది. అనారోగ్యంతో ఉన్న నాన్నకు వైద్యం చేయించేందుకు చెత్త ఎత్తే పనులు కూడా చేసింది. మొదట కాస్త గౌరవంగా చూసిన యజమాని, తన గతం తెలుసుకుని ఒకసారి అనుచితంగా ప్రవర్తించాడు. ‘నా గతం, నన్ను ఎవరైనా సొంతం చేసుకోవచ్చని చెబుతుంది. అందుకే క్రాంతికి వచ్చాక నాలో బలంగా నాటుకుపోయిన ఒక్క ప్రశ్నకు సమాధానం వెతికాను. ‘ఎవరు దేనికి అర్హులు’ అనే అంశంపై పనిచేయడం ప్రారంభించాను.
‘క్రాంతి’లో విద్యాభ్యాసంతో పాటు సాంస్కృతిక కళల్లో కూడా శిక్షణ ఇస్తున్నారు. ‘అనాథ పిల్లల కోసం స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తామని చెప్పినప్పుడు చాలామంది గృహయజమానులు సంతోషంతో ఒప్పుకున్నారు. అయిత,ే ఆ పిల్లలు వేశ్యాగృహాల నుంచి వచ్చిన వారని తెలిసిన వెంటనే ఇల్లు ఖాళీ చేయమని చెప్పేవారు. ఈ పరిస్థితి మాకు ఎన్నోసార్లు వచ్చింది. సమాజంలో అనాథ పిల్లలకు దొరికే సానుభూతి కూడా ఈ పిల్లలకు లభించదు. ఇప్పుడు ఆ పిల్లలే ఉన్నత విద్య చదువుతుంటే గర్వంగా ఉంటుంది’ అని క్రాంతి నిర్వాహకులు ఆనందంతో చెబుతున్నారు. ‘క్రాంతిలో చేరిన పిల్లలు శారీరకంగా, మానసికంగా శక్తి వంతులుగా తయారు చేయడమే మా లక్ష్యమని’ ఆ మిత్రద్వయం ముక్తకంఠంతో చెబుతోంది.

2011 నుంచి ‘క్రాంతి’ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రాబిన్‌ చౌరాసియా, బానీ వేర్వేరు స్వచ్ఛంద సంస్థలను నిర్వహించేవారు. వారి ఉమ్మడి ఆలోచనల ఫలితంగానే ‘క్రాంతి’ ఏర్పడింది. దాని ద్వారా నిరాదరణకు, నిరాశ్రయానికి గురయ్యే వేశ్యాగృహాల ఆడపిల్లల జీవితాలు బాగు చేయాలని కంకణం కట్టుకున్నారు. ఎన్నో ప్రయత్నాల తరువాత సెక్స్‌ వర్క్‌ కుటుంబాల్లో చైతన్యం తీసుకొచ్చారు. అలా క్రాంతి ద్వారా మొదట లబ్ధి పొందింది శ్వేత. స్కూలు విద్య కూడా నోచుకోని ఆ అమ్మాయి విదేశాల్లో చదివి, ఇప్పుడు క్రాంతిలోనే వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తోంది. శ్వేత విజయకథ తెలుసుకున్న సంధ్య కూడా ఇప్పుడు ఆ మార్గంలోనే ప్రయాణిస్తోంది. సెక్స్‌ వర్కర్ల విషాద జీవితాన్ని ప్రపంచమంతా తెలియజేసే లక్ష్యంతో ఈ పిల్లలు నిర్వహించే ‘లాల్‌ బట్టీ ఎక్స్‌ప్రెస్‌’ కళారూపం దేశవిదేశాల్లో విశేష ఆదరణ పొందింది. సమాజంలో సంధ్య, శ్వేత లాంటి ఆడపిల్లలు ఎంతోమంది. ప్రోత్సాహం ఇస్తే ఏ పరిస్థితుల నుంచైనా బయటపడతారు.

➡️