కొడుకుగా సాకి .. కూతురుగానూ ఆదరించి …

May 12,2024 08:30 #Jeevana Stories

ఆడబిడ్డైనా, మగబిడ్డైనా, చూడలేకపోయినా, మాట్లాడలేకపోయినా, ఆ బిడ్డ పట్ల అమ్మ ప్రేమలో ఏ లోపమూ ఉండదు. బిడ్డల రంగును బట్టి, గుణాన్ని బట్టి అమ్మ తన ప్రేమను తగ్గించుకోదు. బిడ్డ ఉన్నతికై అహర్నిశలు పాటు పడుతుంది. ఏ చిన్న కష్టమొచ్చినా తల్లడిల్లిపోతుంది. అయితే ఆ బిడ్డే తన అస్తిత్వం కోసం పోరాడుతుంటే మాత్రం చాలా సందర్భాల్లో ఆ కన్న హృదయం కఠినమైపోతుంది. బిడ్డకు ఇంత కష్టమొచ్చిందని, దు:ఖపడుతుందేకానీ, ఆ బిడ్డకు అండగా ఉండాలని మాత్రం అనుకోదు. అయితే అలాంటి అమ్మలందరూ ఒక్కసారి ఈ అమ్మ గురించి తెలుసుకోవాలి. బిడ్డకు జన్మనివ్వడంతోనే బాధ్యత తీరిపోదని, ఆ బిడ్డను తనను తానుగా గుర్తించి ప్రేమించి, ఆదరించాలని, కొండంత ధైర్యమివ్వాలని, నిలువెత్తు అండగా నిలవాలని చాటిచెబుతున్నారు హైద్రాబాద్‌కి చెందిన ముకుంద మాల.

భార్యాభర్త, గారాల కొడుకుతో చీకూచింతా లేని కుటుంబం ఆమెది. అల్లారుముద్దుగా పెరుగుతున్న కొడుకు చదువులో రాణిస్తుంటే ఎంతో మురిసిపోయింది. మెడిసిన్‌ చదువుతున్న కొడుకుపైనే అన్ని ఆశలు పెట్టుకుని బతికింది. పెళ్లి చేసి, ఓ ఇంటివాడిని చేయాలని కలలు కన్నది. విశ్రాంత జీవనమంతా మనవళ్లు, మనవరాళ్లతో హాయిగా ఆడుకోవాలని ఆశపడ్డది. కానీ ఆమె కోరికలన్నీ తలకిందులయ్యే రోజు ఒకటి వచ్చింది. ‘ఎవరైనా అమ్మాయిని ఇష్టపడితే చెప్పు. ఏ అభ్యంతరం లేకుండా పెళ్లి చేస్తామ’ని కొడుకుతో చెప్పినప్పుడు పిడుగు లాంటి వార్త ఒకటి విన్నది.
‘అమ్మా నేను ఏ అమ్మాయినీ పెళ్లి చేసుకోను. నాకు ఆ ఉద్దేశం లేదు. నేను ‘గే’ని’ అని నా కొడుకు చెప్పినప్పుడు అసలు వాడు ఏం చెబుతున్నాడో నాకు అర్థం కాలేదు. నేను ఆ పదం వినడం అదే మొదటిసారి. దానర్థం తెలిసినప్పుడు కాళ్ల కింద భూమి కదిలినట్లు అనిపించింది. కానీ వెంటనే తేరుకున్నాను. ‘నువ్వు ఎవరైనా నాకనవసరం. నువ్వు నా బిడ్డవి’ అని వాడికి ధైర్యం చెప్పాను. కానీ తల్లి మనసు కదా! నా తృప్తి కోసం పిల్లవాడ్ని తీసుకుని వైద్యులను కలిశాను. వాళ్లు నాకే కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపారు.
ట్రాన్స్‌జెండర్‌, గే, లెస్సిబియన్‌, బైసెక్సువల్‌ వంటివి నేనెప్పుడూ వినని పదాలు. తెలియని అంశాలు. నా కొడుకు గురించి తెలిసిన తరువాతే వాళ్ల గురించి అధ్యయనం చేశాను. ‘ఇప్పటి వరకు నా బిడ్డను అందరు తల్లుల్లాగే ప్రేమించాను. ప్రోత్సహించాను. కానీ ఇప్పుడు నా బిడ్డ సమాజం నుంచి తీవ్ర వివక్షను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు. తన అస్తిత్వం కోసం పోరాడుతున్నాడు. ఈ సమయంలోనే అమ్మలా నా బాధ్యత మరింత పెరగాలి. ఈ విషయం నా భర్తతో చెప్పినప్పుడు తను కూడా ఎంతో హుందాగా వ్యవహరించారు. ‘వాడిని ఏమీ అనకు. నువ్వేమీ దిగులు పడకు. ఇప్పుడే మనం వాడికి అండగా నిలబడాలి’ అని చెప్పారు.
తను ‘గే’ అని చెప్పే సమయానికి వాడు ఎంబిబిఎస్‌ చదువుతున్నాడు. చదువులో మొదటి నుంచి ఎంతో చురుకుగా ఉండేవాడు. వాడి ప్రతిభకు ఉన్నత విద్యలో ఫ్రీ సీట్లు వచ్చాయి. గొప్ప తెలివితేటలతో రాణిస్తున్న కొడుకుని లైంగికతను బట్టి ఎలా దూరం చేసుకోగలను? వాడి కెరియర్‌ ఏమైపోతుంది? అందుకే వాడికి అండగా నిలబడ్డాను’ అంటున్న ముకుంద లాంటి తల్లులు మనకు చాలా అరుదుగా కనిపిస్తారు.
‘ఇక్కడైతే సమాజం నుంచి చాలా వివక్ష ఎదుర్కొంటాడని చాలా జాగ్రత్తగా ఉండమన్నాను. చదువు పూర్తయ్యేవరకు బయట పడకని నచ్చచెప్పాను. వైద్య విద్య పూర్తి చేశాక విదేశాలకు వెళ్లమని ప్రోత్సహించాను. వాడూ అలాగే కష్టపడ్డాడు. యూరప్‌ యూనివర్శిటీలో మాస్టర్స్‌కి ఫ్రీ సీటు సాధించాడు. అక్కడే ఎంఎస్‌ జెరంటాలజీ పూర్తి చేశాడు. నిమ్స్‌లో జీరియాట్రిక్‌ మెడిసిన్‌పై పీజీ డిప్లమా చదివాడు. ఆ తరువాత జెరంటాలజీలో ఎల్జీబీటిక్యూ వ్యక్తుల ఏజింగ్‌ మీద పిహెచ్‌డీ చేశాడు. అది సాధించడం కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. పట్టా సాధించే చివరి మెట్టులో వాడి అస్తిత్వం అక్కడివారికి తెలిసిపోయింది. అంతే వాడి పిహెచ్‌డీ అర్థంతరంగా ఆగిపోయింది. ఆ రోజు నా బిడ్డ ఏడ్చుకుంటూ ఫోన్‌ చేశాడు. ఆ క్షణం నా తల్లి హృదయం ఎంత తల్లడిల్లిపోయిందో మాటల్లో చెప్పలేను. నా కళ్ల ముందే ఉంటే ఎలాగోలా ఓదార్చుకోగలను. కానీ ఎక్కడో దూరతీరాన.. వాడు ఏమై పోతాడోనని తెగ కంగారు పడిపోయాను. ఆ రోజు నాకు ఒక్కటే అర్థమైంది.. ఈ ప్రపంచంలో ఎక్కడైనా, ఎంత ఉన్నత చదువు చదివినా, విజయ శిఖరాలు అందుకున్నా, నా బిడ్డలాంటి వ్యక్తులు వివక్షకు గురవుతారని’ అంటూ ముకుంద ఎంతో భావోద్వేగంతో చెప్పారు.
‘ఆ రోజు నా బిడ్డ ఒక మాట అన్నాడు. ‘అమ్మా, నేనేమీ చేసుకోను. నువ్వు కంగారు పడకు. నువ్విచ్చిన ధైర్యంతో ఏ కష్టమొచ్చినా అధిగమిస్తాను. కానీ, నాలాంటి వాళ్లు ఈ లోకంలో ఎంతోమంది. అమ్మానాన్నలు ఆదరించక, కుటుంబాల నుంచి విడిపోయి దుర్భరంగా జీవిస్తున్నారు. నువ్వు వాళ్ల కోసం నిలబడు. వారి హక్కుల కోసం పోరాడు’ అని చెప్పాడు’ అంటూ తన కొడుకు ఔదార్యం గురించి ముకుంద ఎంతో గర్వంగా చెప్పారు.
ఉద్యోగం చేస్తున్న సమయం నుండే ముకుంద, తన కొడుకుతో కలిసి పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గనేవారు. మొదట హెచ్‌ఐవీ బాధితులు, అనాధ, వృద్ధాశ్రమాల్లో సేవా ప్రస్థానం ప్రారంభించిన ఆమె 2012లో తొలిసారి కొడుకుతో కలిసి ఎల్జీబీటీ వ్యక్తులకు మద్దతుగా ‘ఫ్రైడ్‌ మార్చ్‌’లో పాల్గన్నారు. ఆ రోజు నుండి నేటి వరకు ఆమె సేవాప్రస్థానం నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. ‘క్వీర్‌ బంధు పేరెంట్స్‌ అసోసియేషన్‌’ ప్రారంభించి ఎల్జీబీటీ వ్యక్తుల హక్కుల కోసం, వారి అస్తిత్వం కోసం శక్తివంచన లేకుండా పోరాడుతున్నారు.
ప్రభుత్వ సంస్థల ప్రోత్సాహంతో ఎల్జీబిటీ వ్యక్తులకు రావాల్సిన న్యాయమైన హక్కులను సాధిస్తున్నారు. ముకుంద చేసిన సాయంతో ఎంతోమంది ట్రాన్స్‌ వ్యక్తులు ప్రముఖ సంస్థల్లో ఉన్నత కొలువులు సాధించారు. సమాజంలో గౌరవంగా జీవిస్తున్నారు. పలు సెమినార్లు, ప్రచార కార్యక్రమాల్లో ఎల్జీబిటీల తరపున తన గళాన్ని వినిపిస్తున్నారు. కుటుంబాల్లో చైతన్యం నింపుతున్నారు. 65 ఏళ్ల వయసులో కూడా రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తున్న ముకుంద ఇప్పుడు తన బిడ్డకే కాదు, ఎంతోమందికి అమ్మ.
కుటుంబం నుంచి గెంటివేయబడి, అసాంఘిక కార్యకలాపాలు చేయించే ముఠాలకు ఇరుక్కుపోయిన ఎందరో బాధితులకు ముకుంద అండగా నిలబడుతున్నారు. గుర్తింపు కార్డులు ఇప్పిస్తున్నారు. దాతల నుండి నిధులు సేకరించి ఆర్థికంగా సాయం చేస్తున్నారు. ‘సాయం కోసం ఏ చిన్న సందేశం ఇచ్చినా, అర్ధరాత్రి అయినా స్పందిస్తాను. ఏ ఆపదలో ఉండి ఫోను చేశారో.. నేను మాట్లాడకపోతే వాళ్ల జీవితం ఏమై పోతుందో అని భయపడిపోతాను. అందుకే ఓపిక ఉన్నా లేకపోయినా వాళ్లతో మాట్లాడాకే నిద్రపోతాను’ అంటున్న ఆమె గొప్ప మాతృహృదయానికి నిదర్శనం.

ముకుంద కొడుకు ఇప్పుడు పూర్తిగా అమ్మాయిగా మారిపోయారు. పీహెచ్‌డీ పూర్తి చేసి, పోస్ట్‌ డాక్టోరోల్‌ సాధించారు. ఎక్కడైతే అవమానం జరిగిందో, అక్కడే బెస్ట్‌ పెర్ఫ్‌ర్మార్‌గా గుర్తింపు పొందారు. కాదన్న వారి నుండే సాదర స్వాగతాలు అందుకుంటున్నారు. బిడ్డ ఉజ్వల భవిష్యత్తుకై కలలు గనే ఒక తల్లికి ఇంతకంటే ఏం కావాలి?

– జ్యోతిర్మయి

➡️