గొప్ప గుణం

Dec 1,2023 09:56 #Jeevana Stories

అనగనగా ఔరంగాబాద్‌ అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో దశరదయ్య అనే రైతు ఉన్నాడు. అతనికి రామ్‌, లక్ష్మణ్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. లక్ష్మణ్‌ నలుపు రంగులో ఉంటాడు. రామ్‌ తెలుపు రంగులో ఉంటాడు. గ్రామంలోని అందరూ లక్ష్మణ్‌ నలుపుగా ఉండడం చూసి హేళన చేసేవారు.

గ్రామస్తులు, దోస్తులు అందరూ దూరంగా ఉంటున్నారని లక్ష్మణ్‌ తన తల్లికి చెప్పి బాధపడ్డాడు. అప్పుడే వచ్చిన రామ్‌, తమ్మున్ని ఓదార్చాడు. ఇద్దరూ పెరిగి పెద్దవారయ్యారు. పట్నంలో చదువుకున్నారు. ఒకరోజు గ్రామ సర్పంచ్‌ కోటయ్య అడవిలో వెళుతుంటే దుండగులు అడ్డుపడి దాడి చేస్తారు. కోటయ్యకు బాగా గాయాలవుతాయి. పట్నంలోని ఆసుపత్రిలో చేర్పిస్తారు. గాయం బాగా అవడంతో అర్జెంటుగా రక్తం అవసరమౌతుంది. అప్పుడు, అక్కడే డాక్టరుగా పనిచేస్తున్న లక్ష్మణ్‌ రక్తం ఇచ్చి కాపాడాడు.

తనకు ప్రాణభిక్ష పెట్టిన డాక్టరును ఒకసారి చూడాలని లక్ష్మణ్‌ దగ్గరికి వెళ్లాడు కోటయ్య. అక్కడ ఉన్న లక్ష్మణ్‌ని చూసి సిగ్గుతో తల దించుకున్నాడు. అప్పుడు కోటయ్యను దగ్గరకు తీసుకుని ‘మామ మీరేమి ఇంతలా బాధపడవద్దు. ఆరోగ్యం జాగ్రత్త’ అని చెప్పాడు లక్షణ్‌. గ్రామానికి తిరిగి వెళ్లిన కోటయ్య, ‘చిన్నప్పుడు నల్లగా ఉన్నాడని ఎంతగా అవమానించానో.. అతడే ఇప్పుడు నా ప్రాణాలు కాపాడాడ’ని గ్రామస్తులకు ఎంతో గొప్పగా చెప్పాడు.మనిషి గుణాగుణాలను ఎంచేవి, అతని నడక, ప్రవర్తనే కాని, శరీర రంగు కాదని గ్రామస్తులు తెలుసుకుంటారు. సెలవుల్లో ఊరికి వచ్చిన రామ్‌, లక్ష్మణ్‌లను ఈసారి గ్రామస్తులు ఆప్యాయంగా పలకరించారు.

– సంగేపు కీర్తన, 7వ తరగతి,93962 49007.

➡️