ఆమె సంకల్పం దృఢమైనది..

Mar 29,2024 05:10 #Jeevana Stories

ఆమె.. ఫలానా వాళ్ల కోడలు, ఆమె.. ఫలానా అతని భార్య, ఆమె.. ఆ బిడ్డకు తల్లి వంటి ఆమెకంటూ ఓ గుర్తింపు లేని వాతావరణంలో పుట్టి పెరిగిన ఓ మహిళ, తన కంటూ ప్రత్యేక స్థానం కావాలని చిన్నప్పటి నుండి కలలుగంది. చదువుతోనే అది సాధ్యమని నమ్మి గ్రాడ్యుయేషన్‌ చేసింది. ఆ తరువాత ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుని బాలికా విద్య కోసం అహర్నిశలు పాటుపడింది. ఫలితంగా మూడేళ్ల క్రితమే ఆమెకు జాతీయ ఉపాధ్యాయురాలిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆమె ఎవరంటే- బీహార్‌కి చెందిన చందనా దత్‌. శిక్షామిత్రగా ఈ అవార్డు అందుకున్న తొలి మహిళ ఆమె. ఈ విజయం వెనుక ఆమె ఎన్నో ఆటుపోట్లు చవిచూసింది. బోధకురాలిగా విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడంతోనే సరిపెట్టుకోకుండా, వారి కుటుంబాలను ఉపాధి మార్గంలో నడిపిస్తోంది.

బీహార్‌ మధుబనిలోని రాంతీ ప్రాథమికోన్నత పాఠశాలలో చందనా దత్‌ (49) శిక్షామిత్రగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో వివాహితలను తమ సొంత పేర్లతో పిలవరు. వారి మొదటి బిడ్డ తల్లి, అతని భార్య, ఆ ఇంటి కోడలు.. ఇవే ఆమె గుర్తింపు చిహ్నాలు. ‘నా చిన్నతనం నుండి మా ఇంట్లో, చుట్టుపక్కల ఇలాంటి వాతావరణం ఉండేది. నాకు అది నచ్చేది కాదు. ఏదైనా సాధించి నాకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాలని ఎంతో పట్టుదలగా ఉండేదాన్ని. నా అక్కలు ఇద్దరూ గ్రాడ్యుయేషన్‌ పూర్తి కాకుండానే వివాహాలు చేసుకుని అత్తారిళ్లకి వెళ్లిపోయారు. నేను మాత్రం పట్టుబట్టి గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యేదాకా పెళ్లి చేసుకోలేదు. ఉన్నత విద్య చదువుకున్నాను’ అంటూ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు చందనా.
తక్కువ వేతనంతోనే..
2005లో చందన శిక్షా మిత్రగా విధులు చేపట్టారు. శిక్షా మిత్రలకి చాలా తక్కువ వేతనం ఉంటుంది. అలా ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో నియమించబడిన చందన రూ.1500 జీతం నుండి పనిచేయడం మొదలుపెట్టారు. ‘నేను స్కూలుకు వెళ్లే సరికి 400 నుండి 500 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వారు కూడా సరిగ్గా హాజరు కావడం లేదు. బాలికల సంగతి సరేసరి. పిల్లలను ఎలాగైనా స్కూలుకు రప్పించాలని మా టీచర్ల బృందం తీర్మానించుకున్నాం’ అంటున్న చందన స్కూలు చుట్టుపక్కల ఉన్న ముస్లిం కాలనీలు, షెడ్యూల్‌ కులాల కాలనీలకు క్రమం తప్పకుండా వెళ్లేవారు. పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేవారు.

నెలల బిడ్డతో..
ఇదంతా అందరూ చేసేదే.. డ్రాపౌట్స్‌ని స్కూలుకి రప్పించేందుకు ఎంతోమంది టీచర్లు ఇలాంటి పద్ధతులనే పాటిస్తారు. కానీ చందనా అంతటితోనే ఆగిపోలేదు. నెలల బిడ్డను చంకన పెట్టుకుని, ఇళ్లిళ్లు తిరిగారు. ‘ఎండలో, బిడ్డతో ఇలా తిరగడం అవసరమా?’ అని ఎంతోమంది ఎద్దేవా చేశారు. ‘ఈ మాత్రం జీతానికి ఇంత చేయాలా?’ అని బంధువులు చెవులు కొరుక్కున్నారు. అయినా ఆమె వెనుకంజ వేయలేదు. క్రమంగా బాలికల హాజరు పెరిగింది. మొదట 10 శాతం ఉన్న హాజరు ప్రస్తుతం 60 శాతానికి పెరిగింది.

కోవిడ్‌ సమయంలో …
‘పిల్లలను స్కూలుకు పంపించేందుకు వారి తల్లిదండ్రులు ఒప్పుకునేవారు కాదు. చాలామంది ఇళ్లల్లో ఆడపిల్లలు, వారి తమ్ముళ్లను, చెల్లెళ్లను చూసుకోవడానికి ఉండిపోయేవారు. అమ్మానాన్న పనికి వెళితే ఆ చిన్నబిడ్డలకు ఆ ఆడపిల్లే ఆసరా మరి. అలా ఇంటికే పరిమితమైన పిల్లలకు వయసు రాకుండా పెళ్లిళ్లు చేయడం అక్కడ సర్వసాధారణం. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని నేను చాలా ప్రయత్నం చేశాను. కోవిడ్‌ సమయంలో మా ప్రాంతంలో ఎన్నో కుటుంబాలు ఉపాధి లేక విలవిల్లాడాయి. ముందు, ఆ కుటుంబాలకు ఏదైనా ఆదాయం చూపించాలని ఆలోచించాను. మా ప్రాంతంలో మిథిలా కళరూపాలు చాలా ప్రసిద్ధిగాంచాయి. ఆ కళారూపాలతో ఫేస్‌ మాస్క్‌లు ఎలా తయారు చేయవచ్చో ఆ కుటుంబాలకు నేర్పాను’ అంటున్న చందన లాక్‌డౌన్‌ సమయంలో అందరిలా ఇంటికే పరిమితం కాకుండా, తన విద్యార్థులతో ఆ కాలనీలకు వెళ్లి మాస్క్‌ల ఆర్డర్‌ ఇచ్చారు. ఉత్పత్తులు తయారయ్యాక వాటిని విక్రయించే బాధ్యత ఆమే స్వయంగా తీసుకున్నారు. అలా 10 వేల మాస్క్‌లు విక్రయించారు. చందన గురించి ఇంతవరకే చెప్పుకుంటే చాలదు. ఆ కుటుంబాల మహిళలకు అక్షరాలు కూడా నేర్పారు. ఆ ఇళ్లల్లో ఉన్న తన విద్యార్థులనే అందుకు పురమాయించారు. అలా ప్రతి ఇంట్లో పిల్లలు తల్లులకు విద్య నేర్పేలా చేశారు.
రెండు దశాబ్దాలుగా శిక్షా మిత్రగా పనిచేస్తున్న చందన, కళారూపాలు తయారుచేయడంలో, సాహిత్య రంగంలో కూడా ప్రావీణ్యం ఉంది. మిథిలా ఆర్ట్‌ నేర్చుకునే క్రమంలో మైథిలీ లిపిలో మాస్టర్‌ డిగ్రీ చేశారు. విద్యార్థులకు మైథిలీ లిపితో పాటు ఆంగ్లం కూడా బోధిస్తారు. ఇంకా తన అభిరుచి ప్రకారం ఖైతీ, నేపాలి, బజ్జిక, భోజ్‌పురి భాషల్లో కూడా మాస్టర్స్‌ చేశారు. భాషలు నేర్చుకోవడమే కాదు, ఆయా భాషల్లో కథలు, కవితలు కూడా రాస్తున్నారు.
కవితలు, పిల్లల కథలు రాస్తున్న చందన మొట్టమొదట రచన ‘గంగా స్నాన్‌’. మైథిలీ భాషలో అది ప్రచురితమైంది. ఆ తరువాత ‘చాహక్‌’ పేరుతో పిల్లల కోసం చేసిన రచనలను ప్రచురించారు. తన కూతురుతో ఆ పుస్తకానికి కవర్‌పేజీ చేయించి ఆమెను కూడా భాగం చేశారు. ‘దళిత మైథిలీ కథ సంచయాన్‌’లో ఆమె రచనలు ప్రచురితమయ్యాయి. డజనుకు పైగా కథల పుస్తకాలు అచ్చు వేయించారు. టీచర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ సాహిత్య రంగంలో కూడా కృషి చేస్తున్న చందనాను రాష్ట్ర ప్రభుత్వం పలు సత్కారాలతో గౌరవించింది. అలా 2021లో జాతీయ ఉత్తమ టీచర్‌గా కేంద్రం ఇచ్చిన సత్కారంతో ఆ పురస్కారం అందుకున్న తొలి శిక్షామిత్రగా ఆమె చరిత్ర సృష్టించారు.
‘ఆమె’ని పేరుతో పిలవడానికి కూడా ఇష్టపడని సమాజంలో కళాకారిణిగా, రచయిత్రిగా, కవయిత్రిగా, ఉపాధ్యాయినిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చందనా దత్‌ లాంటి వాళ్లు మనచుట్టూ ఎంతోమంది..

➡️