అతడి మాట .. ఆ పిల్లలకు బడిబాట …

Mar 10,2024 10:08 #feature

ఓ ఆటో డ్రైవర్‌ చెప్పిన మాట ఆమెకు ప్రేరణ అయింది. వందలాది మంది నిరుపేద బాలబాలికలకు బడిగా అవతరించింది. ఒకప్పుడు ఆలనాపాలనా లేని ఆ వాడ పిల్లలకు బడి విద్యాబుద్ధులు పంచుతోంది. మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తోంది. కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదులుకొని ఆ పిల్లలకు విద్యావెలుగులు అందివ్వడంలో ఆత్మసంతృప్తి పొందుతున్నారు సీమాసేధ్‌.

ఢిల్లీలోని గురుగ్రామ్‌లో నివసించే సీమాసేథ్‌ ఓ కార్పొరేట్‌ సంస్థలో హెచ్‌ఆర్‌ విభాగంలో గతంలో పనిచేసేవారు. సామాజిక సేవలో భాగంగా ఆమె తన ఉద్యోగ సమయం ముగిసిన తర్వాత సాయంత్రం పూట సికిందర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు సబ్జెక్టును ఉచితంగా బోధించేవారు. ప్రతిరోజూ ఇలా రెండు, మూడు గంటలు చొప్పున శిక్షణ ఇచ్చేవారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లేవారు. ఓ రోజు ఇలా స్కూలుకు వెళ్లి తిరిగి ఇంటికి రావటానికి ఆమె ఆటో ఎక్కారు. మాటల సందర్భంలో ”ఇక్కడ చదువు చెప్పటానికి మీరు ఫీజు తీసుకుంటారా?” అనడిగాడు ఆటోడ్రైవరు మహేష్‌. ”లేదు. ఉచితంగానే చెబుతాను.” అన్నారావిడ.
”మా వాడలోని పేద పిల్లలకు చదువు చెబుతారా? వాళ్ల తల్లిదండ్రులు రోజువారీ పనులకు వెళ్లిపోతే- పిల్లలు ఎందుకూ కొరకాకుండా పోతున్నారు.” అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ మాటలు ఆమెను ఆలోచింపచేశాయి. తనవంతుగా మురికివాడ పిల్లల చదువుకు సహకరిస్తానని చెప్పారు. బోధనకు ఏదైనా అనువైన ప్రదేశం చూడాలని సూచించారు. అతడు అంగీకరించి ఆ కాలనీ మధ్యలో ఉన్న ఓ పాత గోదామును చూపించాడు.
ఆ తరువాత సీమాసేధ్‌ కొన్ని ఏర్పాట్లు చేసుకొని, 35 మంది పిల్లలతో ‘నయీదిశ’ పేరుతో పాఠశాలల ప్రారంభించారు. పిల్లల్లోని ఆసక్తి ఆమెను ఆకట్టుకొంది. డ్రైవర్లు, అసంఘటిత కార్మికులు, చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే తల్లిదండ్రుల పిల్లలే వీరంతా. ఆర్థిక ఇబ్బందులకుతోడు చదువుకోవటానికి పాఠశాలలు సైతం అందుబాటులో లేని పరిస్థితుల్లో బాలకార్మికులుగా మిగిలిపోతున్నారు. 2013లోనే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ‘నయీ దిశా’ పేరుతో స్వచ్ఛంధ సంస్థ (ఎన్‌జిఒ)ను ఏర్పాటు చేశారు. తరగతులు ప్రారంభమయ్యాక ప్రాథమిక దశలో పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదవటం, రాయటం రాక ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించారు.
ఈ పరిస్థితిలో ఎంతోకొంత మార్పు తీసుకురావటం తన వంతుగా కృషి చేయటానికి పూనుకున్నారు. ఈ విషయం ఆనోటా, ఈనోటా తెలిసి పిల్లలు చాలామంది ఇక్కడికి చదువుకోవటానికి రావటం ప్రారంభించారు. మొదట్లో పాత గోదాములో ప్రారంభమైన తరగతులు ఆ తర్వాత భవనానికి మారాయి. ఎన్‌సిఆర్‌టి సిలబస్‌కు అనుగుణంగా 12 మంది ఉపాధ్యాయులను ఏర్పాటు చేసి సిలబస్‌ను పూర్తిచేయటానికి చర్యలు తీసుకున్నారు. పిల్లలకు ఇంగ్లీష్‌, హిందీ, గణితం, ఇంగ్లీష్‌, పర్యావరణ శాస్త్రం, కళలు, థియేటర్‌ ఆర్ట్స్‌, కంప్యూటర్‌ తరగతులు నేడు బోధి స్తున్నారు. అందరూ ఆయా సబ్జెక్టుల్లో నిపుణత సాధిస్తున్నారు.

                                                                   అనాథ నుంచి 12వ తరగతి వరకూ …

బప్పన్‌దాస్‌ తల్లిదండ్రులు బెంగాల్‌ నుంచి గురుగ్రామ్‌ ప్రాంతానికి వలస వచ్చారు. దాస్‌కు ఎనిమిదేళ్ల వయస్సులో ఉండగా 1999 వరదల్లో తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. అనాథగా మారిన బప్పన్‌దాస్‌ 2014లో సీమాసేథ్‌ సాయంత్రం పూట నిర్వహించే ఇంగ్లీషు తరగతులకు హాజరయ్యాడు. ఆ తర్వాత స్థానిక విద్యా నియోస్‌లో చేరాడు. చదువుపై ఆసక్తి ఉన్నా భౌతిక పరిస్థితులు సరిగా లేకపోవటంతో నిరుత్సాహంతో ఆగిపోయాడు. బప్పన్‌ను సీమాసేథ్‌ చదువుకోవాలనీ, భవిష్యత్తులో ఇంజనీర్‌ అవుతావని ప్రోత్సహించారు. ఆమె ప్రోత్సాహంతో బప్పన్‌ ఇప్పుడు 12వ తరగతి చదువుతున్నాడు. ఇలా ఎందరో పిల్లలకు ఆమె ప్రేరణగా, సహాయంగా నిలుస్తున్నారు.

                                                                           కరోనాలో ఆన్‌లైన్‌ తరగతులు

కరోనా సమయంలో పాఠశాల మూత పడినప్పటికీ ఆమె ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించారు. ఫోన్ల ద్వారా పిల్లలు ఆన్‌లైన్‌ తరగతుల్లో పాల్గొనేవారు. తమ పిల్లలు టీచర్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతుండటం చూసి తల్లిదండ్రులు సంతోషపడేవారు. లాక్‌డౌన్‌ ముగిసే నాటికి పిల్లలు ఆయా సబ్జెక్టుల్లో పురో గతితోపాటుగా గుణకార పట్టికలను అలవోకగా చెప్పేలా నేర్చుకున్నారు. ఐదో తరగతి చేరుకున్న తర్వాత ప్రతి విద్యార్థి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే వారికి ఎన్‌ఒఎస్‌ కింద ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోకి ప్రవేశం లభిస్తుంది. వీరికి ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, శిక్షా కేంద్రం, ఎస్‌ఆర్‌ఎఫ్‌, లోటస్‌ పెటల్‌ ఫౌండేషన్‌ వంటి పాఠశాలల్లోకి చేరేందుకు అనుమతి లభిస్తుంది. ఆ ప్రవేశపరీక్షలో నెగ్గటానికి అవసరమైన తర్ఫీదును సీమా అందించారు.

                                                                              ఉపాధ్యాయులకు శిక్షణ

స్కూలు నిర్వహణలో సీమా చాలా కచ్చితమైన పద్ధతులను అవలంబిస్తున్నారు. ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ అయ్యేలా శిక్షణాతరగతులను నిర్వహిస్తున్నారు. ప్రణాళిక ప్రకారం … సిలబస్‌ అయ్యేలా తనిఖీలు జరుపుతారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలనూ తెలుసుకొని, పరిష్కరిస్తారు. ప్రతినెలా చివరి శనివారం పేరెంట్‌-టీచర్‌ మీటింగ్‌ కూడా ఏర్పాటుచేశారు. ఈ విద్యాలయం కొనసాగేందుకు నిధులు సమకూర్చటం కూడా సేథ్‌కు ఎంతో సవాల్‌గా నిలిచేది. 68 ఏళ్ల వయస్సులోనూ ఆమె అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూనే 400 మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతున్నారు. కొందరు దాతల సహకారం అందుకుంటూ స్కూలును ముందుకు నడిపిస్తున్నారు.

➡️