రోజూ మనం ఎంత నీరు తాగాలి?

వేసవిలో చిన్నా, పెద్ద తగినంత నీరు తాగాలి. దాహం వేసినప్పుడు దప్పిక తీర్చుకోవడం కాదు. తరచూ కొంత పరిమాణంలో నీటిని తాగుతూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే వేసవిలో డీహైడ్రేషన్‌ వల్ల సంభవించే అనేక సమస్యల నుంచి బయటపడొచ్చు. అయితే శరీరానికి తగినంత హైడ్రేషన్‌ ఎందుకు అవసరం? శరీరానికి ఎంత నీరు అవసరం? నీటి ప్రయోజనాలు నీరు తాగడానికి ఆసక్తి లేనప్పుడు ఏం చేయాలి? వంటి విషయాలపై కనీస అవగాహన పెంచుకోవాలి.

నీరు ఎందుకు తాగాలి?
వేసవి కాలంలో చెమట ద్వారా శరీరం నుండి చాలా నీరు బయటికి పోతుంది. దీంతో శరీర సమతుల్యతకు అవసరమైన ఎలక్ట్రోలైట్‌లను కోల్పోతుంది. ఎలక్ట్రోలైట్‌లు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం, చల్లబరచడం అనే సహజ ప్రక్రియలో ఉపయోగపడతాయి. వీటిని కోల్పోవడం అంటే శరీరం వేడెక్కి, విపరీతమైన అలసట లేదా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. సమయానికి చికిత్స చేయకపోతే ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. కోల్పోయిన నీటిని శరీరానికి తిరిగి అందించాలన్నా, నిర్జలీకరణాన్ని నివారించాలన్నా తగినంత నీటిని తీసుకోవడం అవసరం.

ఎంత నీరు తాగాలి?
వ్యక్తులు వారి వయస్సు, బరువు, లింగం, అనారోగ్యాలను బట్టి వేర్వేరు కొలతల్లో నీరు తీసుకోవాలి. ఎవరికి ఎంత నీరు కావాలి? రోజుకు ఎంత నీరు అవసరమో చూద్దాం.

పిల్లలు వయసుల వారీగా.. (రోజుకు)

4 – 8 ఏళ్ల మధ్య వయస్సు : 5 నుండి 6 గ్లాసులు లేదా 1000-1200 మి.లీ
9 – 13 ఏళ్ల మధ్య వయస్సు :7 నుండి 8 గ్లాసులు 1400 నుండి 1600 మి.లీ
14 – 18 ఏళ్ల మధ్య వయస్సు : 8 నుండి 11 గ్లాసులు లేదా 1600-2200 మి.లీ

పెద్దలు వయసుల వారీగా.. (రోజుకు)

మహిళలు (19, అంతకంటే ఎక్కువ వయసు) : 8-10 గ్లాసులు లేదా 1600 -2000 మి.లీ
పురుషులు (19, అంతకంటే ఎక్కువ వయసు): 8-13 గ్లాసులు లేదా 1600 – 2600 మి.లీ
పాలు ఇచ్చే స్త్రీలు: 10-15 గ్లాసులు లేదా 2000 నుండి 3000 మి.లీ
గర్భిణీలు: 10-11 గ్లాసులు లేదా 2000-2200 మి.లీ
మూత్రపిండ వ్యాధులు, మూత్ర నాళాల రుగ్మతలు లేదా ఇతర రుగ్మతలు ఉన్న వ్యక్తులు- వైద్యులు సూచించినట్లు నీటిని తీసుకోవాలి. ఈ పరిమాణం కూడా వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది. మూత్రం రంగు ముదురు పసుపు రంగులోకి మారడం నీటిని తక్కువగా తీసుకోవడానికి సంకేతం. కాబట్టి తగినంత నీటిని తీసుకొని ఆరోగ్యంగా ఉండాలి.

నీటి ప్రయోజనాలు
తరచూ తగినంత నీటిని తీసుకోవడం వల్ల హైడ్రేషన్‌ కాకుండా ఉంటుంది. మలబద్ధకం బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. కిడ్నీలోని టాక్సిన్‌లను బయటకు పంపుతుంది. మొటిమలు, ఇతర చర్మ సమస్యల సంభవనీయతను తగ్గించవచ్చు. జీర్ణక్రియ ప్రక్రియకు తోడ్పడుతుంది. స్పష్టమైన, హైడ్రేటెడ్‌ ఛాయను ఇస్తుంది. శరీర ఉష్ణోగ్రత, రక్తపోటును నియంత్రిస్తుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్‌ (సోడియం, పొటాషియం) సమతుల్యతను కాపాడుతుంది మూత్రాశయంలో బాక్టీరియా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. కణజాలం, అవయవాలను రక్షిస్తుంది. అయితే ఈ నీటిలో దాదాపు 20 శాతం నీరు అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలు ద్వారా కూడా పొందవచ్చు.

Eating Fruit or Drinking Fruit Juice

నీరు తాగడానికి ఆసక్తి లేదా?
కొంతమందికి దాహం వేస్తే తప్ప మిగతా సమయంలో నీరు తాగే అలవాటు ఉండదు. ఈ అలవాటు అంత మంచిది కాదు. తగినంత హైడ్రేషన్‌ స్థాయిలను నిర్వహించడం చాలా కష్టం. ఈ సమస్యను బయటపడాలంటే నీటి శాతం అధికంగా ఉండే పానీయాలు తీసుకోవాలి.

మజ్జిగ : వేసవిలో శరీరాన్ని చల్లగా, హైడ్రేట్‌గా ఉంచడంలో మజ్జిగ బాగా సహాయపడుతుంది.

నిమ్మరసం : ఒక చల్లని గ్లాసు నిమ్మరసం రిఫ్రెష్‌, హైడ్రేటింగ్‌, శరీరానికి అవసరమైన విటమిన్‌ సిని కలిగి ఉంటుంది.

కొబ్బరి నీరు : లేత కొబ్బరి నీరు ఒక అద్భుతమైన బాడీ ఎలక్ట్రోలైట్‌ బ్యాలెన్సింగ్‌ ద్రావణం.

గ్రీన్‌ టీ : గ్రీన్‌ టీలో మన శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి అవసరమైన అనేక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ప్రతిరోజూ మితమైన పరిమాణంలో తీసుకుంటే ఇది హైడ్రేషన్‌కు బాగా సహాయపడుతుంది.

పండ్ల రసాలు : సీజనల్‌ పండ్ల రసాలు అన్ని పోషకాలను కలిగి ఉంటాయి. తగినంత మొత్తంలో నీరు త్రాగలేని వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. (మధుమేహం లేని వారికి).
శరీరంలోని అన్ని అవయవ వ్యవస్థలు సమర్ధవంతంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకోవడానికి తగిన పరిమాణంలో నీరు తాగడం చాలా అవసరం.

➡️