తప్పు తెలుసుకుంటే …

Dec 22,2023 10:05 #Jeevana Stories

        రంగాపురం గ్రామంలో దర్జీగా జీవనం పోసుకుంటున్న రంగస్వామి, జానకమ్మ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు బబ్లూ. లేక లేక పుట్టినవాడవడం వల్ల వాడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. గారాబంతో వాడు పెంకిఘటంగా తయారయ్యాడు. స్కూలుకు వెళ్లకుండా మారాం చేసేవాడు. బలవంతాన పంపితే అల్లరి చేసేవాడు. టీచరు చెప్పిన పాఠం వినేవాడు కాదు.

బబ్లూలో ఎలాగైనా మార్పు తేవాలని టీచరు చాలా ఆలోచించారు. ఒకసారి బబ్లూతో ఆడుకుంటూ పాఠం వినకుండా ఉన్న ఇద్దరు పిల్లలను బబ్లూతో పాటు క్లాసు బయట నుంచోపెట్టారు. అప్పుడే ఆ పిల్లల్లో ఒకడి తండ్రి అటువైపుగా వెళుతూ లోపలికి వచ్చాడు.

‘బయట ఎందుకు ఉన్నావ’ని కొడుకుని అడిగాడు. జరిగిందంతా తెలుసుకుని తన కొడుకుని బబ్లూ పక్కన కాకుండా దూరంగా కూర్చోబెట్టుమని టీచరుతో చెప్పి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన క్లాసులో మిగతా పిల్లలందరిపై బాగా ప్రభావం చూపించింది. బబ్లూతో మాట్లాడడం మానేశారు. తనతో ఆడుకునే వాళ్ళు ఎవరూ లేక బబ్లూ చాలా బాధపడ్డాడు.

ఒకరోజు శారీరక శుభ్రత గురించి పాఠం చెబుతూ, ‘బబ్లూ నువ్వు ఇంటికి వెళ్లి పళ్ళు తోముకునిరా’ అన్నారు టీచరు. ‘మధ్యాహ్నం వేళ ఎవరైనా పళ్ళు తోముకుంటారేంటి’ అని అడిగాడు బబ్లూ. ‘మరి పళ్ళు ఎప్పుడు తోముకుంటావ’ని అడిగారు టీచరు. ‘ఉదయం నిద్ర లేచిన వెంటనే తోముకుంటాన’ని బబ్లూ చెప్పాడు. ‘మరి టీచర్‌ పాఠం చెబుతున్నప్పుడు ఏం చేయాల’ని క్లాసులో పిల్లలందరినీ ఉద్దేశించి అడిగారు టీచరు. ‘శ్రద్దగా వినాల’ని పిల్లలందరూ ఒకేసారి అరిచారు.

‘అంటే ఉదయం లేచాక చేయాల్సిన పనులు అప్పుడే చేయాలి. చదువుకోవాల్సిన సమయంలో చదువుకోవాలి. ఆడుకోవాల్సిన సమయంలో ఆడుకోవాలి. అంతేగాని, ఒక పని చేయాల్సిన సమయంలో మరొక పని చేస్తే మనకు ఏ పనీ రాదు’ అని వివరించారు టీచరు.

బబ్లూకి తాను చేసిన తప్పేమిటో అర్థమైంది. ఇంతకాలం తను చదువుకోకుండా అమ్మని నాన్నని ఎంత బాధ పెట్టాడో అర్థమైంది. వెంటనే టీచరుతో ‘ఇక నుండి క్లాసులో బుద్ధిగా చదువుకుంటాను టీచర్‌’ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. టీచర్‌ పిల్లలందరి చేత చప్పట్లు కొట్టించారు. అప్పటినుంచి బాగా చదువుకోవడం మొదలుపెట్టిన బబ్లూ, తరగతి గదిలో బుద్ధిమంతుడే కాదు, బాగా చదివే కుర్రాడు అనిపించుకున్నాడు.

– కొత్తపల్లి ఉదయబాబు,95337 56075.

➡️