పిల్లలకు ఇలా నేర్పిద్దాం !

Jan 30,2024 10:20 #feature

             పిల్లలు జీవితంలో సరైన మార్గంలో వెళ్లాలని ప్రతి తల్లీదండ్రీ కోరుకుంటారు. ఎదుగుతున్న పిల్లలకు కొంతమంది తల్లిదండ్రులు అతి స్వేచ్ఛను ఇస్తే- మరికొందరు తాము చెప్పిన్నట్లే చేయాలని పిల్లల మీద ఒత్తిడి తెస్తుంటారు. ఈ రెండు పద్ధతులు పిల్లలపై విపరీత ప్రభావాన్ని చూపుతాయి. బాగా గారాబం చేయడం లేదా కఠినంగా ప్రవర్తించడం చాలామంది తల్లిదండ్రుల్లో కనిపించే సాధారణ స్వభావం. ఇది పిల్లల ఆలోచనా సరళిలో ఎన్నో వైరుధ్యాలకు దారితీస్తుంది. సానుకూల దృక్పథం : పిల్లల చుట్టూ ఉన్న సమాజాన్ని ఒక్కొక్కటిగా వారికి పరిచయం చేయాలి. పిల్లలకు వచ్చే సందేహాలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పాలి. ప్రతి ఒక్క అంశాన్ని సానుకూల దృక్పథంతో ఆలోచించేలా చేయాలి. చదువులో గాని, ఆటల్లో గాని వారికి కావాల్సిన ప్రోత్సాహం అందించాలి. తద్వారా వారిలో ఏదైనా సాధించగలం అనే దృక్పథం పెరుగుతుంది.

సహాయపడే గుణం

                పిల్లలకు చిన్నప్పటి నుండి సహాయపడే గుణాన్ని అలవాటు చేయాలి. ఇతరులకు సహాయపడే కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయాలి. ఏదైనా సాధించాలనే తపనతో పాటు ఇతరులకు సహాయపడాలనే ఆలోచన ఉండడం వల్ల పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి.కోపగించుకోవద్దు : కొన్ని సందర్భాల్లో పిల్లలపై తెలియకుండానే కోప్పడుతుంటారు. అలాంటి సందర్భాలలో కొంచెం నిగ్రహంగా ఉండాలి. గట్టిగా అరవడం, తిట్టడం వంటివి చేయకుండా, దగ్గరకు తీసుకొని అలా చేయకూడదని నెమ్మదిగా చెప్పాలి. ఆ పని వల్ల జరిగే అనర్థాలు ఏమిటో వివరించాలి. ఎంత ఎక్కువ కోపం ప్రదర్శిస్తే పిల్లలు అంత మొండిగా తయారవుతారు.

బాధ్యతల అప్పగింత

                   పిల్లలకు ఇంటి పనుల్లో కూడా భాగస్వామ్యం కల్పించాలి. ఇంట్లో చిన్న చిన్న బాధ్యతలను అప్పజెప్పాలి. దానివల్ల ఎలా నడుచుకోవాలో వారికి చిన్నప్పటి నుంచీ తెలుస్తుంది.

సఖ్యతతో మెలగండి

అమ్మానాన్న సఖ్యతగా ఉండడం అనేది కూడా పిల్లల ఎదుగుదలకు దోహదపడుతుంది. చాలామంది పిల్లలు అమ్మతోనో లేదా నాన్నతో మాత్రమే చనువుగా ఉంటారు. ఇంకొకరితో పెద్దగా మాట్లాడరు. ఇద్దరితో సమానంగా తమ అభిప్రాయాలను పంచుకునే వాతావరణం కల్పించాలి. సవాళ్లను ఎదుర్కొనేలా .. ఏదైనా సాధించాలనే లక్షణాన్ని చిన్నప్పటి నుంచీ అలవర్చాలి. ఎటువంటి సవాళ్లనైనా ధైర్యంగా స్వీకరించేలా ప్రోత్సహించాలి. ఏ పనినైనా ఇష్టంగా చేయడం నేర్పాలి. ఇలా చేయడం వల్ల వారిలో సానుకూల స్థితిలో పోరాట పటిమ పెరుగుతుంది. ఏదైనా సాధించాలనే తపనా అలవడుతుంది.

ఒత్తిడి నియంత్రణ

దైనందిన జీవితంలో ఎన్నో ఒత్తిళ్లతో సతమతమవుతుంటాం. అవన్నీ పిల్లలపై చూపించకూడదు. విసుక్కోవడం, చీదరించుకోవడం, అరవడం వంటివి చేస్తే పిల్లల్లో తల్లిదండ్రుల పట్ల వ్యతిరేక భావం పెరుగుతుంది. కాబట్టి పెద్దలు తమ ఒత్తిడిని, కోపాన్ని పిల్లల మీద చూపించకూడదు.

➡️