అమ్మా నాన్నా, ఆలోచించండి..

Mar 26,2024 06:35 #Father, #feachers, #Jeevana Stories, #mother

భార్యభర్త ఇద్దరూ కలిసి సంపాదిస్తే గాని రోజులు గడవడం లేదు. పొద్దున్న నుండి రాత్రి వరకు ఉరుకులు పరుగుల జీవితంలో పడి చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ఆలనాపాలనను అశ్రద్ద చేస్తున్నారు. బిడ్డల సంరక్షణ తల్లిదండ్రులిద్దరిదీ. ఇద్దరూ పని ఒత్తిడితో సతమతమయ్యేటప్పుడు పిల్లల బాధ్యత ఒకరి మీద ఒకరు నెట్టివేసుకోకుండా సమంగా పంచుకోవాలి. అప్పుడే పిల్లలు సక్రమంగా తీర్చిదిద్దబడతారు.
బాధ్యత అంటే వారికి స్కూలుకు పంపించడం, వేళకి అన్నం తినిపించడం, స్నానం చేయించడం, బట్టలు తొడగడం మాత్రమే కాదు. వారి భావోద్వేగాలు పట్టించుకోవడం. మంచి, చెడుల విశ్లేషణలను తెలియజేయడం. చాలా మంది ఇళ్లల్లో పిల్లల పెంపకం భాగస్వాములు ఇద్దరిలో ఎవరిదో ఒకరిదే అన్నట్లు వ్యవహరిస్తారు. కానీ, ఇద్దరూ సమాన బాధ్యతగా వ్యవహరించాలి.
ఎదుగుతున్న పిల్లల ముందు చీటికీమాటికీ తగాదాలు పడడం, ఇతరుల గురించి అవమానంగా మాట్లాడుకోవడం, ఇంటికి వచ్చిన వారు వెళ్లిపోయాక వారి గురించి చెడ్డగా మాట్లాడడం చాలామంది ఇళ్లల్లో చూస్తుంటాం. ఆ వాతావరణంలో పెరుగుతున్న పిల్లలు కూడా అదే ఒరవడి కొనసాగిస్తారు. స్నేహితులతో, బంధువులతో సజావుగా మెలగడం మానేసి విభిన్నంగా వ్యవహరిస్తుంటారు. అది వారి భవిష్యత్తుకు మంచిది కాదు.
సమాజ నిర్మాణంలో పిల్లలను భాగస్వామ్యం చెయ్యాలన్న స్పృహ ఉండేది చాలా కొద్దిమంది తల్లిదండ్రులకే. పిల్లలకు సొంత ఆలోచనలు, కోరికలు ఉంటాయి. వాటికి విలువ ఇవ్వాలి. పిల్లల చుట్టూ స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలి. స్వేచ్ఛ అంటే విశృంఖలత్వం కాదు.. వారి అభిప్రాయాలు, అభిరుచులు నిస్పష్టంగా చెప్పుకునే అవకాశం.
చాలామంది తల్లిదండ్రులు పిల్లల వ్యక్తిత్వ వికాసం గురించి అసలు మాట్లాడరు. ఆ మాటకు అర్థం కూడా తెలియని వారుంటారు. పిల్లలను వ్యక్తిత్వ వికాస కేంద్రాలుగా చూడాలి. వారి చుట్టూ మనం కల్పించే సాదృశ్య వాతావరణమే వారిని సమాజ నిర్మాతలుగా తీర్చిదిద్దుతుంది. ఆ ప్రక్రియలో తల్లిదండ్రులు కీలక భాగస్వామ్యం పోషించాలి. స్నేహితులతో, బంధువులతో సఖ్యతగా మెలిగేలా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
పిల్లలు సక్రమంగా పెరిగితే తల్లిదండ్రులను కీర్తించే సమాజం, వారు పెడదోవ పడితే నిందిస్తుంది కూడా. అందుకే ఇకనైనా మీ బిజీ లైఫ్‌లో కొంత సమయం కచ్చితంగా పిల్లల కోసం కేటాయించాలి. ఒకరు, ఇద్దరు పిల్లలున్న ఇంట్లో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలకు వెళితే నాలుగ్గోడల మధ్య ఆ పిల్లలు ఒంటరి జీవితం గడుపుతున్నారు. ఒకప్పుడంటే అమ్మమ్మ, తాతయ్య, నానమ్మలు ఉండేవారు. బాబాయి, పిన్ని, పెదనాన్న, పెద్దమ్మ, అత్తయ్య, మామయ్య పిల్లలతో పండగలు, వేడుకలు కలిసి జరుపుకునేవారు. కాని ఇప్పటికాలం పిల్లలకి అవేమీ తెలియడం లేదు. ఆప్యాయతలు కొరవడుతున్నాయి. అక్కాచెల్లెళ్లు, అన్నాదమ్ముల అనుబంధం అర్థం కావడం లేదు.
‘పిల్లలు ఏది కావాలంటే అది చేస్తున్నాం. ఏమి అడిగితే అది ఇచ్చేస్తున్నాం’ పిల్లల పట్ల మా బాధ్యత ఇదే అనుకునే తల్లిదండ్రులు.. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. సమయం దొరికినప్పుడల్లా పిల్లలతో సామాజిక అంశాలపై చర్చించాలి. వారి చుట్టూ పెనవేసుకున్న మూఢనమ్మకాలను పారద్రోలేలా వ్యవహరించాలి. శాస్త్రీయ ఆలోచనల వైపు మళ్లించాలి. పిల్లల ఆలోచనల్లో ఎప్పుడూ కుల మత భేదాలు రానీయకూడదు. స్నేహం, సౌభ్రాతృత్వంతో పిల్లలు పెరిగేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఆడపిల్లలున్న తల్లిదండ్రులు ఆ పిల్లలను ఆత్మవిశ్వాసంతో పెరిగేలా చేయాలి. పిరికితనం నూరిపోయొద్దు. అలాగే మగపిల్లలు ఉన్న అమ్మానాన్న ఆ పిల్లలకు ఆడపిల్లలను గౌరవించడం నేర్పాలి. మంచి అలవాట్లు చెప్పాలి. చెడ్డ అలవాట్ల వల్ల కలిగే దుష్పరిణామాలను తెలియజేయాలి. ఇక ఆడ, మగ పిల్లలున్న ఇళ్లల్లో ఒకరిపట్ల ఒకరు గౌరవంగా మెలిగేలా చూడాలి. భిన్న అభిప్రాయాలున్నప్పటికీ ఏకాభిప్రాయంతో ఎలా మెలగాలో నేర్పించాలి. ఇలా మీ ఇంటి పిల్లలను తీర్చిదిద్దితేనే సమాజం చైతన్యం అవుతుంది. ఎన్నో ఏళ్ల నుండి సమాజంలో నాటుకుపోయిన కుల, మత ఘర్షణలు, ఆడపిల్లలపై అకృత్యాలు, దాడులు కొంతవరకైనా తగ్గుతాయి.

➡️