అడవిలో అవసరం

May 9,2024 05:30 #jeevana

కోసల రాజు సుదర్శన వర్మ వేటకు వెళ్ళి అడవిలో దారి తప్పాడు. ఆ అడవిలో గుర్రం అదుపు తప్పి, ఇష్టమొచ్చినట్టు పరుగులు తీసింది. కొమ్మలు, ముళ్ల కంపలు తగిలి అతడి బట్టలు చిరిగి పోయాయి. అతడు గుర్రం మీద నుంచి కిందికి దూకేశాడు. దాహంతో నోరు పిడచ గట్టుకు పోతోంది. ఆ సమయంలో ఓ ముసలి అవ్వ చిన్న కడవతో నీరు తీసుకుపోవడం రాజు కంట పడింది.
”ఓ.. అవ్వా… నాకు చాలా దాహంగా వుంది కొద్దిగా నీరు పోయవా! నీకు ఈ వజ్రాల హారం ఇస్తాను” అన్నాడు.
”ఇంకా..” అంది అవ్వ.
”చేతికి వున్న బంగారు కడియాలు కూడా ఇచ్చేస్తాను” అన్నాడు అతడు.
అవ్వ నవ్వుతూ ”ఇంకా” అంది. మహారాజు నీరసంగా ”చెవులకి వున్న రత్నాలు పొదిగిన కర్ణాభరణాలు ఇస్తాను’ అన్నాడు. ”మీరు చూస్తే .. మహారాజులా వున్నారు. నేను ఇంకా.. ఇంకా.. అంటున్నా మీకు తెలియక పోవడం ఆశ్చర్యం వేస్తోంది. మీరు ఇచ్చే కానుకలు ఈ అడవిలో నేను ఏం చేసుకుంటాను. ఇదిగో దాహం తీర్చుకొండి” అంటూ నీరు పోసింది. మహారాజు తృప్తిగా నీరు తాగాడు.
ఇంతలో మిగిలిన సైనికులు రావడంతో అవ్వ పక్కకి తప్పుకుంది. వారంతా మహారాజుని తీసుకుని రాజ్యానికి వెళ్ళి పోయారు. కానీ మహారాజుకి అవ్వ నీరు అడిగినప్పుడు ఇంకా.. ఇంకా.. అనడం మరలా మరలా జ్ఞాపకం రాసాగింది. మరుసటి రోజు కొందరు సైనికులని పంపి ఆ అవ్వను తీసుకురమ్మన్నాడు. వారు అడవిలో వెతికి ఆమెను రాజధానికి తీసుకువచ్చారు. మహారాజు ఆమెను ఒక ఆసనంపై కూర్చోపెట్టి రత్నాలు, వజ్రాలు, ధనం పెద్ద పళ్ళెంతో తెప్పించి ఇచ్చాడు.
”అవసరమైన సమయంలో నా దాహం తీర్చావు. అందుకే ఈ బహుమానం” అన్నాడు రాజు. ”మహారాజా.. నిన్న నన్ను చూసి కూడా మరలా మీరు ఇలా బహుమానం ఇవ్వడం చూస్తే నాకు నవ్వు వస్తోంది. అడవిలో వుండే నాకు ఈ ధనం ఎందుకు? ఒక్కో సమయంలో ఈ డబ్బు పనికి రాదని నిన్న మీరు గ్రహించే వుంటారు. పైగా ఈ ధనం నాకు ఆపదను కూడా తెస్తుంది” అంది.
”మరి ఏం కావాలో కోరుకో” అన్నాడు మహారాజు. ‘పక్క రాజ్యం వెళ్లాలంటే ఈ అడివిలో నుండే దగ్గర మార్గం వుంది. కొంతమంది అలా వెడుతూ దాహం కోసం, విశ్రాంతి కోసం చూస్తున్నారు. కనుక అడవి మార్గంలో కొన్నిచోట్ల బావులు తవ్వించండి. చిన్న చిన్న శాలలు కట్టించండి. అవి అందరికీ ఉపయోగం అంది” అవ్వ.
”నీ మంచి మనసు నాకు తెలుసు. అందరికీ తెలియాలనే ఇక్కడి దాకా రప్పించాను. నీ పేరు మీదే ఆ బావులు, పర్ణశాలలు నిర్మిస్తాను” అన్నాడు మహారాజు.
ా కూచిమంచి నాగేంద్ర
91821 27880

➡️