విజ్ఞానశాస్త్ర పితామహుడు గెలీలియో

Feb 15,2024 10:41 #Science, #Special Days
profile of galileo

పిల్లలూ, ఈ రోజు విజ్ఞాన శాస్త్ర పితామహుడు గెలీలియో పుట్టినరోజు. ఆయన ఇటలీకి చెందిన భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు, తత్వవేత్త. టెలీస్కోపు (దూరదర్శిని)ను వాడుకలోకి తెచ్చాడు. గెలీలియో ఇటలీలోని పీసా నగరంలో 1564 ఫిబ్రవరి 15న జన్మించారు. చిన్న వయసులో తండ్రి వద్ద విద్యాభ్యాసం చేశాడు. ఆయనకు కవిత్వం, సంగీతం, కళా విమర్శపై కూడా ఆసక్తి ఉండేది. పీసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థిగా ఉన్న గెలీలియో గణితశాస్త్రంపై మక్కువతో గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. ఆ తరువాత అక్కడే గణిత శాస్త్ర అధ్యాపకుడిగా చేరాడు. అప్పటికి మతం, ఫిలాసఫీ, సైన్స్‌ మూడూ ఒకటే అనే తీరులో సాగేవి. గెలీలియో మతం నుంచి సైన్సును వేరుచేశాడు. ఫిలాసఫీ నుంచి సైన్సును పరిపుష్టం చేశాడు. గణితాన్ని విజ్ఞాన శాస్త్రంలో ప్రవేశపెట్టాడు. గణితం రాకతో విజ్ఞాన శాస్త్రానికి కచ్చితత్వం ఏర్పడింది.

గెలీలియోతోనే ఆధునిక విజ్ఞానం మొదలైందని, కాబట్టి ఆయన్ని ఆధునిక వైజ్ఞానిక పితామహుడిగా పరిగణించాలని ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, స్టీఫెన్‌ హాకింగ్‌ వంటి వారు పేర్కొన్నారు. కాల గణన గడియారాలు లేని సమయంలో వ్రేలాడుతున్న చర్చి దీపాల కదలికలతో డోలనా కాలాలను గణించి సమయాన్ని అంచనా వేశాడు గెలీలియో. ఈ పరిశీలన ఆధారంగానే ‘పల్స్‌ మీటరు’ రూపొందించాడు. గణితశాస్త్ర ప్రధానాచార్యునిగా ఉన్నప్పుడే యాంత్రిక శాస్త్రం రచించాడు. ఇది కప్పీలు, తులాదండాలు, వాలుతలాల ద్వారా బరువులు సులభంగా ఎత్తడాన్ని సూత్రీకరించింది. ఆ సమయంలోనే వాయు థర్మామీటర్‌ను, నీటిని ఎత్తుకు తరలించే యంత్రాన్ని, గణితంలో వర్గాలు, వర్గమూలాలు కనుగొనే కంపాస్‌ పరికరాన్ని కనుగొన్నారు.

టెలిస్కోప్‌ గెలీలియో పరిశోధనలో ముఖ్యమైనది. కటకాలను ఉపయోగించి దూరపు వస్తువులను తలకిందులుగా చూడగలుగు తున్నారని తెలిసి, ఆరు నెలల స్వల్ప కాలవ్యవధిలో టెలిస్కోపును ఆవిష్కరించిన గొప్ప శాస్త్రవేత్త. దీనిద్వారా ఎన్నో విశ్వ రహస్యాలను ఛేదించడం సాధ్యమైంది.

గెలీలియో కోపర్నికస్‌ సూర్య కేంద్రక సిద్ధాంతాన్ని బలపరిచాడు. సూర్యుని చుట్టే భూమి తిరుగుతుందని ప్రకటించాడు.అప్పటికే ప్రాచుర్యంలో ఉన్న భూకేంద్రక సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నందుకు కొందరు మతాధికారులు కోపర్నికస్‌ సిద్ధాంతాన్ని నిషేధించి, అతడి ప్రయోగాలు మత వ్యతిరేకమైనవని తీర్మానించారు. ప్రయోగ ఫలితాలు వెల్లడి చేయకూడదని ఆంక్షలు పెట్టారు. అయినా గెలీలియో తన వాదాన్ని విడవకుండా, పుస్తక రూపంలో వెలువరించాడు. అదే 1632లో వెలువడిన ఈ ‘డైలాగ్స్‌ కన్సర్నింగ్‌ ది టూ ఛీఫ్‌ వరల్డ్‌ సిస్టమ్స్‌’ అనే గ్రంథం. అయితే, మతాధికారులు దీని ప్రచురణను నిలిపివేయడమే కాకుండా గెలీలియోకు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. శిక్ష అనుభవిస్తున్న కాలంలోనే ఆయన కంటిచూపు కోల్పోయారు. అత్యంత దీనస్థితిలో 1642 జనవరి 8న ఆయన కన్ను మూశారు. సత్యాన్ని చాటటంలో ఎన్ని అవరోధాలూ కష్టాలూ ఎదురైనా ఆయన వెనకడుగు వేయలేదు.

➡️