ఆమె జీవితాన్ని జయించింది..!

Dec 2,2023 09:59 #Jeevana Stories

శాంతి మునుస్వామి జీవితం ఎన్నో సవాళ్లమయం. అబ్బాయిగా పుట్టి అమ్మాయిలా మారిపోయిన తనను ఎంతోమంది అవమానించారు. వేధించారు. విధిలేని పరిస్థితుల్లో, పస్తులు పడుకున్న దీనస్థితిలో తన ఒంటినే సరుకుగా మార్చుకుంది. ఆ జీవితం.. ఎన్నో కాళరాత్రులను మిగిల్చింది. అప్పుడే తన బతుకు బాగు చేసుకోవాలంటే, ఓ అడుగు ముందుకు వేయాలని నిశ్చయించుకుంది. ఆ నిర్ణయం ఇప్పుడామెను ప్రత్యేకంగా నిలిపింది.

‘అమ్మ ఎంత అందంగా ముగ్గు వేసిందో.. ఆ డిజైన్‌ చాలా ముచ్చటగా ఉంది. దానికి అద్దిన రంగులు ఎంత బాగున్నాయో’ అనుకుంటూ వాకిలికి దూరంగా ఉన్న ఓ గదిలో తెరచాటు నుండి ఆ రంగవల్లి వంకే తదేకంగా చూస్తుండిపోయింది శాంతి మునుస్వామి. ఆ తన్మయత్వంలో ఒకసారి తనను తాను నియంత్రించుకోలేక అమ్మ దగ్గరకి పరుగెత్తుకు వచ్చింది. ‘అమ్మా.. నేను కూడా వేస్తాను’ అంటూ మురిపెంగా అడిగింది. ‘ఛ నోర్మురు.. ఇది ఆడపిల్ల్లల పని. ముందు ఇక్కడి నుండి వెళ్లు’ అని కళ్లు ఇంత పెద్దవి చేసి మరీ గదిమింది అమ్మ. ఎందుకంటే శాంతి మునుస్వామి అప్పుడు శంకర్‌ మునుస్వామిగా ఉన్నాడు. ఫ్యాంట్లు, షర్ట్లు వేసుకుంటున్నా, లోపల గదిలో తన చెల్లి గౌనులు, వేసుకుని ఎంతో మురిసిపోయేవాడు. స్కూల్లో అమ్మాయిలతో ఎక్కువ స్నేహం చేసేవాడు. బార్బీ బొమ్మలతో ఆడుకునేవాడు. ఇవన్నీ ఆ తల్లికి నచ్చేవి కావు. ఆ కుటుంబం ఒప్పుకునేది కాదు. ఎన్నోసార్లు అమ్మ చేతిలో దెబ్బలు తిన్నాడు. తనపై ఇంతటి విద్వేషం ఎందుకో అర్థం కాని వయసులో ఇంట్లో, స్కూల్లో వేధింపులు తాళలేక పదో తరగతితో చదువు ఆపేశాడు.

ఓ మందుల షాపులో పనికి వెళ్లిన శంకర్‌, పనిలో తీరిక లేకుండా ఉన్నా, తన బాధలు పట్టించుకునే వారు లేరని ఎంతో మదనపడేవాడు. ఒక్కోసారి షాపు బయట ఓ మూల కూర్చొని బోరున ఏడ్చేవాడు. ‘ఆ రోజు నాకు బాగా గుర్తుంది. షాపు బయట ఏడుస్తున్న నన్ను ఒకావిడ పలకరించింది. ఆమె నన్ను ఓ అమ్మాయిగా సంబోధించింది. అప్పుడు నాకు చాలా సంతోషమేసింది. ఆ రోజు నుండి నాలో ఏదో తెలియని ధైర్యం వచ్చింది. నా బాధ అంతా ఆమెతో పంచుకున్నాను. తనతో రమ్మంది. అలా నేను ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీలోకి అడుగుపెట్టాను. ఇది జరిగిన కొన్నేళ్లకు నేను ఇంటికి వచ్చాను. అమ్మ నన్ను ఒప్పుకోలేదు. ‘నేను అబ్బాయికి జన్మ ఇచ్చాను. అమ్మాయికి కాద’ని చెప్పింది. పెళ్లి చేస్తానని బలవంత పెట్టింది. గదిలో వేసి గడియ వేసింది. అమ్మానాన్నతో బాగా గొడవపడ్డాను. నేను ఇక ఇంటికి రానని, నన్ను వదిలేయమని బతిమాలాను. అలా ఆ రోజు ఇంటి నుండి బయటపడి, ట్రాన్స్‌ కమ్యూనిటీలో చేరిపోయాను’ అంటున్న శాంతి 21 ఏళ్ల వయసులో సెక్స్‌ వర్కర్‌గా జీవితాన్ని ప్రారంభించింది.

ఇలా ఎన్నో చేదు అనుభవాలతో నిండిపోయిన శాంతి జీవితం ఓ అందమైన మలుపుకు దారిమళ్లే సందర్భం కొన్నేళ్ల తరువాత వచ్చింది. బెంగుళూరుకు చెందిన ఓ రీసెర్చ్‌ సెంటర్‌ శాంతి జీవితకథను ప్రపంచానికి చెప్పమని ఆహ్వానించింది. తమ సంస్థలో రేడియో జాకీగా ఉండమని మార్గం చూపించింది. ‘నాకు రేడియో గురించే తెలియదు. కానీ, ఈ మురికికూపం నుండి బయటపడాలంటే ఇంతకంటే మంచి అవకాశం రాదని ఒప్పుకున్నాను. రికార్డింగ్‌, లైవ్‌ ప్రోగ్రామ్‌ ఇవ్వడం, ఎడిటింగ్‌ వంటివన్నీ నేర్చుకున్నాను. అయితే కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు.

ఎంతో ఆనందంగా రేడియో జాకీగా జీవితాన్ని ప్రారంభించినా, మూడేళ్లకు మించి అక్కడ పనిచేయలేకపోయాను. శస్త్రచికిత్స చేసుకోవాలని ఎంతో తపించేదాన్ని. ఉద్యోగాన్ని వదిలి చికిత్స చేయించుకున్నాను. అది వికటించింది. మానసికంగా, శారీరకంగా ఎంతో కుంగిపోయాను. నాలాగే ఎంతోమంది ఇలాంటి బాధలే పడుతుంటారు. వారందరికీ మంచి జీవితాలు ఎవరు ఇస్తారు? మేమంతా ఇలా ఉండిపోవాల్సిందేనా? అని ఎంతో మదనపడేదాన్ని.

paint image
paint image

చిన్నప్పుడు అమ్మ వేసిన ముగ్గులకు ఆకర్షితురాలినై చిత్రకళ నేర్చుకున్నాను. ఆ కళనే ఇప్పుడు నా జీవితాన్ని బాగుచేసుకునే మార్గంగా వేయాలనుకున్నాను. నాలాగే ఆలోచించే వారందరినీ ఓ బృందంగా తయారుచేశాను. ‘ఆరావణి కళ’ పేరుతో శిక్షణ ఇచ్చాను. అయితే మాలాంటి వారికి ఎవరు పని ఇస్తారు? ఎంతో కాలం ఎదురుచూసిన తరువాత ఓ స్వచ్ఛంద సంస్థ నుండి ఆహ్వానం వచ్చింది. ఆ ప్రాజెక్టు పనిని మేమంతా ఎంతో బాగా పూర్తిచేశాం. నిలువెత్తు గోడలపై, రెండు నిచ్చెనల ఎత్తులో నిలబడి బొమ్మలు వేశాం. మా పనితనానికి ఎంతో గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు మా ఇంటి వరకు చేరింది. ఈ దీపావళికి అమ్మ నన్ను ఇంటికి పిలిచింది. నా కోసం పంజాబీ డ్రెస్‌ తీసుకొచ్చింది. ఇది నేను ఊహించని పరిణామం. ఇంట్లో అందరూ నన్ను ఎంతోప్రేమగా చూశారు. 20 ఏళ్ల క్రితం ఇలా లేదు’ అంటున్న శాంతి మునుస్వామి బృందం వేసిన చిత్రాలు ఇప్పుడు బెంగుళూరు మెట్రోస్టేషను 36 పిల్లర్లపై చూడవచ్చు. పూనేలో విహెచ్‌1 సంగీత కచేరి సందర్భంగా ఆ మ్యూజిక్‌ ఛానెల్‌ గోడపై వీక్షించవచ్చు. ఇంకా ఆ బృందం, కోవిడ్‌ సమయంలో 2021లో కోవిడ్‌ యోధులకు సెల్యూట్‌ చేసే కుడ్య చిత్రాలను స్వామి వివేకానంద మెట్రో స్టేషనులో చిత్రించారు. ఇలా ఎన్నో చోట్ల శాంతి, ఆమె బృందం వేసిన చిత్రాలు అలరిస్తున్నాయి. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు ఉన్నా, తనతో పాటు తన వారి జీవితాలలో వెలుగులు నింపిన శాంతి మునుస్వామి లాంటి వారు అభినందనీయులు.

➡️